Vaccination: సిబ్బంది రాగానేఒకరు చెట్టెక్కేశారు.. మరొకరు ఫైటింగ్ చేశారు..!

దేశంలో కరోనా టీకా కార్యక్రమం కీలక మైలురాళ్లను దాటుకుంటూ తుది అంకం చేరుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నా.. ఇంకా కొంతమందిలో అపోహలు వీడటం లేదు. అందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలే నిదర్శనం. 

Published : 20 Jan 2022 12:01 IST

లఖ్‌నవూ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కీలక మైలురాళ్లను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నా.. ఇంకా కొంతమంది అపోహలు వీడటం లేదు. దీనికి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో తాజాగా జరిగిన రెండు సంఘటనలే నిదర్శనం. 

యూపీలో కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం వైరస్ విజృంభిస్తుండటంతో ఎన్నికల సమయానికల్లా అర్హులందరికీ టీకా అందేలా చూడాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించింది. దానిలో భాగంగా అధికారులు బలియా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. యూపీ మొత్తం మీద అత్యల్ప వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇది కూడా ఒకటి కావడంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టీకా ఇవ్వడానికి సిబ్బంది రాగానే ఒక వ్యక్తి చెట్టెక్కగా.. మరోవ్యక్తి సిబ్బందిని తోసేసి టీకా ఇప్పుడొద్దంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న కొందరు చిత్రీకరించిన వీడియోల ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. 

సిబ్బంది చూడగానే ఒక వ్యక్తి వారికి దొరక్కుండా చెట్టెక్కేశాడు. ఏం కాదు కిందికి రావాలని అక్కడున్నవారు పిలిచినా తొలుత వినిపించుకోలేదు. ‘నేను రాను. నాకు టీకా వద్దు. భయం వేస్తోంది’ అంటూ ఆ వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. తర్వాత అంతా సర్దిచెప్పడంతో ఎట్టకేలకు అంగీకరించి వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. మరోవ్యక్తి మాత్రం టీకా తీసుకోవడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు. వ్యాక్సిన్‌ వేయడానికి వచ్చిన సిబ్బందితో చిన్నపాటి ఫైటింగ్ కూడా చేశాడు. వారి నుంచి తప్పించుకొని.. ‘ఇప్పుడు కాదు, నేను తర్వాత టీకా వేయించుకుంటాను’ అంటూ దూరంగా వెళ్లిపోయి నిల్చుకున్నాడు. ‘తర్వాత ఎందుకు.. ఇప్పుడు తీసుకో’ అంటూ అధికారులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతడు ససేమిరా అన్నాడు. వ్యాక్సిన్‌పై  ప్రజలకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ..అనేక సవాళ్ల మధ్య వైద్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. 

మరోపక్క రాష్ట్రంలో 95 శాతం మంది అర్హులు మొదటి డోసు తీసుకున్నారని,  62 శాతం మందికి రెండో డోసు అందిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వెల్లడించారు. ఇక 24 గంటల వ్యవధిలో యూపీలో 17 వేల కరోనా కేసులు రాగా, ఆరుగురు మరణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని