Taliban On Kashmir: తాలిబన్ల మాట వంకర.. కశ్మీర్‌పై ప్రేలాపనలు

భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోబోమని చెబుతూ వస్తోన్న తాలిబన్లు.. తాజాగా ఆ ప్రాంతంపై సంచలన వ్యాఖ్యలు చేశా

Updated : 03 Sep 2021 20:08 IST

కాబుల్‌: భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోబోమని చెబుతూ వస్తోన్న తాలిబన్లు.. తాజాగా ఆ ప్రాంతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని ముస్లింల తరఫున గళం వినిపించే హక్కు తమకు ఉందని ప్రకటించి తమ వక్రబుద్ధి బయటపెట్టారు. అయితే, ఏ దేశానికి వ్యతిరేకంగానైనా ‘సాయుధ ఆపరేషన్‌’ చేపట్టడం తమ విధానం కాదంటూ సుద్దులు చెప్పుకొచ్చారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనతో భారత్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. తాజా ప్రకటన కలకలం రేపుతోంది. 

తాలిబన్‌ రాజకీయ వ్యవహారాల అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ తాజాగా బీబీసీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ గురించి ప్రస్తావించారు. ‘‘ఒక ముస్లిం సంస్థగా.. భారత్‌లోని కశ్మీర్‌ సహా ఇతర దేశాల్లోని ముస్లింల తరఫున మాట్లాడే హక్కు మాకుంది. వారి తరఫున మేం గళం వినిపిస్తాం’’ అని అన్నారు. కశ్మీర్‌.. భారత అంతర్గత విషయమని, అందులో తాము జోక్యం చేసుకోబోమని తాలిబన్లను గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సుహైల్‌ చేసిన ప్రకటన ఇందుకు విరుద్ధంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

తాలిబన్లతో భారత్‌ అధికారికంగా చర్చలు జరిపిన కొద్ది రోజులకే వారి నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల  తాలిబన్‌ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టనెక్‌జాయ్‌.. కతర్‌లోని భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్‌తో సత్సంబంధాలనే తాము కోరుకుంటున్నామని, అఫ్గాన్‌లో కొత్త పాలన ఎలాంటి పరిస్థితుల్లోనూ భారత్‌కు ముప్పుగా మారదని తాలిబన్ల అధికార ప్రతినిధి మరో ముఖాముఖిలో చెప్పారు. 

ఇదిలా ఉండగా.. కశ్మీర్‌ విషయంలో తాలిబన్లతో కలిసి కుట్రలు పన్నేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పాక్‌ అధికార పార్టీ నేత ఒకరు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో తమకు సాయం చేస్తామని తాలిబన్లు చెప్పారంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సుహైల్‌ చేసిన తాజా వ్యాఖ్యలు కలవరపడుతున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని