సన్మాన వేదికపై రాజస్థాన్‌ సీఎంకు చేదు అనుభవం

‘‘అనుకున్నదొక్కటీ..  అయింది ఒక్కటీ... బోల్తా కొట్టిందిలే..’’   పాటను గుర్తుచేసేలా ఉంది రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన. అవును మరి! సీఎం ఉపాధ్యాయులను సన్మానించడానికి వస్తే.. అక్కడున్న ఉపాధ్యాయులు సన్మానం కాదు ముందు మా సమస్యలు పరిష్కరించండంటూ జరుగుతున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు.

Updated : 24 Sep 2022 15:28 IST

జైపుర్‌: ‘అనుకున్నదొక్కటీ..  అయింది ఒక్కటీ... బోల్తా కొట్టిందిలే..’  పాటను గుర్తుచేసేలా ఉంది రాజస్థాన్‌లో జరిగిన ఈ  ఘటన. అవును మరి! సీఎం ఉపాధ్యాయులను సన్మానించడానికి వస్తే.. అక్కడున్న ఉపాధ్యాయులు సన్మానం కాదు ముందు మా సమస్యలు పరిష్కరించండంటూ ఆవేదనను వెళ్లగక్కారు. ఇదంతా మంగళవారం రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల గౌరవ సభలో జరిగింది.

‘‘సీఎం సార్‌.. ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి. టీచర్లు బదిలీ కావాలన్నా, కొత్త పోస్ట్‌ రావాలన్నా స్థానిక ఎమ్మెల్యేలకు లంచమివ్వాల్సిందే ’’అంటూ రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు చెప్పారు ఉపాధ్యాయులు. ఇదే సభలో రాష్ర్ట  విద్యాశాఖ మంత్రి గోవింద్‌ దోట్‌సార, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారందరి ముందే మీరు చెప్పేదంతా నిజమేనా అని సీఎం ప్రశ్నించగా.. నిజమేనన్నారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా. మీ పాలనలో ఇదంతా జరుగుతుందంటూ చెప్పేసరికి సభలో సీఎం అసహనం వ్యక్తం చేశారు. ‘‘బదిలీ కోసం టీచర్లు లంచాలు ఇవ్వడమనేది చాలా దురదృష్టకం. ఇలాంటి విధానాలకు చెక్‌ పెట్టేందుకు ఓ విధానాన్ని తీసుకొస్తాం’’ అన్నారు. సీఎం ప్రసంగం అనంతరం విద్యాశాఖ మంత్రి గోవింద్ మాట్లాడుతూ.. ‘‘ఈ విధానం అమలుతో లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదు’’ అని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని