హాథ్రస్‌ ఘటన.. యూపీ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తులో జిల్లా కలెక్టర్‌ ఉదాశీనత కనబరుస్తున్నారంటూ గత నవంబరులో అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజాగా చర్యలకు...

Updated : 01 Jan 2021 15:05 IST

లఖ్‌నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తులో జిల్లా కలెక్టర్‌ ఉదాశీనత కనబరుస్తున్నారంటూ గత నవంబరులో అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. మెజిస్ట్రేట్‌ ప్రవీణ్‌కుమార్‌ లక్సర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు మరో 15 మంది అధికారులను కూడా వివిధ చోట్లకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌ జల్‌ నిగమ్‌ అదనపు ఎండీగా ఉన్న రమేశ్‌ రంజన్‌ను హాథ్రస్‌ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. కేసు దర్యాప్తుపై సీబీఐకి ఆయన సహకరిస్తారు. లక్సర్‌ను మీర్జాపూర్‌ జిల్లాకు బదిలీ చేసినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

హాథ్రస్‌కు చెందిన ఓ దళిత బాలికపై గత ఏడాది సెప్టెంబర్‌ 14న ఉన్నత కులానికి  చెందిన నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనపై దేశమంతా భగ్గుమన్న సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 29న మరణించింది. 30వ తేదీన అర్ధరాత్రే ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు పూర్తి చేశారు. తమపై ఒత్తిడి తెచ్చి అర్ధరాత్రి అంత్యక్రియలు జరిపారని కుటుంబ సభ్యులు ఆరోపించగా.. కుటుంబ సభ్యుల అనుమతి మేరకే కార్యక్రమాలు పూర్తి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారం, అనంతర పరిణామాలపై విపక్షాలు భగ్గుమనడంతో యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఘజియాబాద్‌ యూనిట్‌కు చెందిన సీబీఐ అధికారులు నలుగురు నిందితులను జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకుని విచారించారు. గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పలు రకాల ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. అత్యాచార ఘటన అనంతరం తొలుత బాధితురాలు చికిత్స పొందిన జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ వైద్యులను విచారించారు. అలాగే, బాధితురాలి కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసిన అనంతరం ఛార్జిషీటును దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

ఇవీ చదవండి

విందామా..! నవ వసతంతానికి మోదీ కవిత

న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 4100 ఫుడ్‌ ఆర్డర్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని