Updated : 03/12/2021 11:59 IST

Omicron: ప్రమాదకర స్థాయికి ఒమిక్రాన్‌ ఆర్‌నాట్‌ విలువ..!

* దక్షిణాఫ్రికాలో కేసుల ఉద్ధృతికి కారణమిదే..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఒమిక్రాన్‌ మెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది..!  ఇప్పటికే  30కి పైగా దేశాల్లో 370కిపైగా కేసులు తేలాయి. ఇక తొలుత ఒమిక్రాన్‌ను కనుగొన్న దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్‌కోవ్‌-2  ఆర్‌నాట్‌ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. భారత్‌లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్‌ కాగా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదురుగు కూడా తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. వీరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందో లేదో మాత్రం తేలలేదు.

దక్షిణాఫ్రికాలో కేసులు పెరిగాయి ఇలా..

దక్షిణాఫ్రికాలో నవంబర్‌ 16న కేవలం 136 కరోనా కేసులు వచ్చాయి. ఇక.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కనుగొన్నట్లు నవంబర్‌ 24న ప్రకటించారు. నవంబర్‌ 26 నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 3,402కు పెరిగింది. అదే డిసెంబర్‌ 1 నాటికి 8,561కి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా 80శాతం కేసులు గౌటెంగ్‌ ప్రావిన్స్‌లోనే నమోదువుతున్నాయి.

గౌటెంగ్‌ ప్రావిన్స్‌లో ఆర్‌నాట్‌ విలువ 2గా ఉందని  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ) వెల్లడించినట్లు నేచర్‌ పత్రిక కథనం పేర్కొంది. ఆర్‌నాట్‌ విలువలో ఈ స్థాయి పెరుగుదలను కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చూసినట్లు డర్బన్‌లోని క్వాజులా-నాటల్‌ విశ్వవిద్యాలయంలోని అంటువ్యాధుల నిపుణుడు రిచర్డ్‌ లెస్సల్‌ వెల్లడించారు. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌నాట్‌గా పేర్కొంటారు. అదే సౌతాఫ్రికా మొత్తంగా చూస్తే ఆర్‌నాట్‌ విలువ 1.47గా ఉన్నట్లు మెడికల్‌ న్యూస్‌ టుడే వెల్లడించింది. అయితే ఆర్‌నాటు విలువ 1 దాటడం ఏమాత్రం సానుకూల పరిణామం కాదు.

మ్యూటేషన్లతోనే సమస్య..!

సెప్టెంబర్‌లో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి ఉన్న సమయంలోనే ఇక్కడ ఆర్‌నాట్‌ విలువ 1 కంటే తక్కువగా నమోదైంది. కానీ, డెల్టాతో పోలిస్తే ఇది 3 నుంచి 6 రెట్ల మందికి సోకుతోందని బెల్జియంలోని ది క్యాథలికే యూనివర్శటీ లివెన్‌ బయాలజిస్ట్‌ టామ్‌ వెన్సిలీర్‌ పేర్కొన్నారు. ‘వేగంగా వ్యాపించడం వైరస్‌కు అనుకూలిస్తుంది.. మనుషులకు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత వేగంగా వ్యాప్తి చెందితే అంత వేగంగా కొత్త మ్యూటేషన్లు పుట్టుకొచ్చి పరిస్థితిని ఘోరంగా మారుస్తాయి. ఈ వేరియంట్‌ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల  పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే ఒమిక్రాన్‌ను కొద్దిమేర గుర్తించగలుగుతున్నట్లు నేచర్‌ పత్రిక కథనం వెల్లడించింది.

ఇమ్యూనిటీని తప్పించుకొంటుందా..?

దక్షిణాఫ్రికాలో నాలుగోవంతు మంది కొవిడ్‌ టీకాలు తీసుకొన్నారు. డెల్టా వేరియంట్‌ వ్యాపించిన సమయంలో పెద్దసంఖ్యలో ప్రజలు దీని బారిన పడ్డారు. కానీ, దక్షిణాఫ్రికాలో రీ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్లు ఆ దేశ ఎన్‌ఐసీడీ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణమం భవిష్యత్తులో ఇమ్యూనిటీని తప్పించుకొనే వేరియంట్లు తయారు కావడానికి దోహదం చేసే అవకాశం ఉందని స్విట్జర్లాండ్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ బెర్న్‌ ఎపిడమాలజిస్ట్‌ క్రిస్టియన్‌ ఆల్థస్‌ పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, అమెరికాకు చెందిన నిపుణుల బృందాలు ఈ మ్యూటేషన్లు యాంటీబాడీలను ఎంతవరకు తప్పించుకోగలవు అనే అంశంపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటీ..?

విట్వాటర్‌రాండ్‌ విశ్వవిద్యాలయ వైరాలజిస్టు షబీర్‌ మది దక్షిణాఫ్రికాలో వ్యాక్సిన్‌ పరీక్షలకు నేతృత్వం వహించారు. ఒమిక్రాన్‌ విషయంలో ఆయన ఓ అంశాన్ని గమనించారు. దక్షిణాఫ్రికాలో వినియోగించిన ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకొన్న వారిలో బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు వస్తునట్లు గుర్తించారు. కాకపోతే వ్యాక్సిన్లు ఎంత మేరకు రక్షణ ఇస్తున్నాయో పూర్తిగా తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. కాకపోతే బూస్టర్‌ డోస్‌ శరీరంలోని యాంటీబాడీలను పెంచి మరింత రక్షణను ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. సార్స్‌కోవ్‌-2 సోకిన తర్వాత కోలుకొని టీకాలు తీసుకొన్న వారిలో యాంటీబాడీలు ఒమిక్రాన్‌పై ఆశావాహంగానే పనిచేస్తున్నట్లు రాక్‌ఫెల్లర్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. 

అంటు వ్యాధులను  కనుమరుగు చేయడానికి కొంతకాలం పాటు ఆర్‌నాట్‌ విలువను 1కంటే తక్కువగా ఉంచడం చాలా అవసరం. దీని విలువ తగ్గిస్తే వ్యాధిపై పట్టు సాధించినట్లే. ఇది 1కంటే తక్కువగా ఉంటే.. వ్యాధి అదృశ్యమవుతుందని 2003లో వ్యాపించిన సార్స్‌ ఇన్ఫెక్షన్‌ ఘటన తెలియజేస్తోంది.

Read latest National - International News and Telugu News

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని