Wuhan Lab: వుహాన్‌ ల్యాబ్‌లో భద్రతపై సంచలన విషయాలు!

చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌లో భద్రతా ప్రమాణాలపై డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు పీటర్‌ బెన్‌ ఎంబారెక్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుకపై......

Published : 13 Aug 2021 21:11 IST

బయటపెట్టిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం సభ్యుడు బెన్‌

లండన్‌: చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో భద్రతా ప్రమాణాలపై డబ్ల్యూహెచ్‌వో నిపుణుడు పీటర్‌ బెన్‌ ఎంబారెక్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుకపై దర్యాప్తు చేసేందుకు చైనా వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందంలో ఒకరైన బెన్‌ ఆ ల్యాబ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. ఎలాంటి నైపుణ్యం, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే వుహాన్‌ ల్యాబ్‌లో పరిశోధనలు జరిగాయన్నారు. డానిష్‌ టీవీ 2 డాక్యుమెంటరీలో భాగంగా ఆయన ఈ విషయాలను వెల్లడించారు. జూన్‌లోనే రికార్డు చేసిన ఈ డాక్యుమెంటరీ తాజాగా బయటకు వచ్చింది. హునాన్‌ మార్కెట్లో జంతువులకు, మనుషులకు మధ్య కాంటాక్ట్‌ అధికంగా ఉందని బెన్‌ తెలిపారు. సముద్ర జంతువుల మార్కెట్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ ల్యాబ్‌ ఉందన్నారు. గబ్బిలాల నుంచి నమూనాలను సేకరించినప్పుడు ల్యాబ్‌ సిబ్బందికి ఈ వైరస్‌ సోకే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమన్నారు. 

కరోనా మూలాలపై దర్యాప్తు చేసేందుకు ఈ ఏడాది తొలినాళ్లలో డబ్ల్యూహెచ్‌వో బృందం వుహాన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ల్యాబ్‌ లీక్‌ థియరీని డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం తొలుత ఖండించింది. ప్యాక్‌ చేసిన సముద్ర ఆహారం ద్వారా వైరస్‌ వ్యాపించిందనే అనుమానాలను సైతం వ్యక్తంచేసినా.. ఆ తర్వాత మాత్రం ల్యాబ్‌ లీక్‌పై మాట మార్చింది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా లీక్‌ అవ్వలేదని నిర్ధారణకు రావడం సరికాదని ఇటీవల డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ గ్యాబ్రియేసిస్‌ వ్యాఖ్యానించారు. వైరస్‌ వ్యాప్తి తొలి రోజుల గురించి చైనా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. తాను స్వయంగా ల్యాబ్‌ టెక్నీషియన్‌ అని, ఇమ్యునాలజిస్ట్‌గానూ పనిచేశానన్నారు. ల్యాబ్‌ ప్రమాదాలు జరుగుతుంటాయని, అది సాధారణమేనని కూడా ఆయన చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారి కొవిడ్‌ వెలుగుచూసిన వుహాన్‌ నగరంలో ఉన్న ల్యాబ్‌ భద్రతపై బెన్‌ ఆందోళన వ్యక్తంచేయడం చర్చనీయాంశంగా మారుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని