Published : 26/10/2021 01:35 IST

Poonch encounter: ఈ దుర్మార్గుడు జియా ముస్తఫా ఎవరో తెలుసా..?

పూంచ్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన ‘నదీమార్గ్‌’ నరమేధం సూత్రధారి 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో రెండు వారాల నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఆదివారం ఓ ఊహించని ఘటన చోటు చేసుకొంది. కరుడుగట్టిన ఉగ్రవాది జియా ముస్తఫా ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ముష్కరుల స్థావరాలను గుర్తించేందుకు జైల్లో ఉన్న జియాను భద్రతా దళాలు అడవుల్లోకి తీసుకెళ్లాయి. దళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా భారీఎత్తున కాల్పులు జరపడంతో కొందరు జవాన్లతో పాటు జియా కూడా గాయపడ్డాడు. అతడిని ఆ ప్రదేశం నుంచి బయటకు తేవడానికి దళాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఘటనాస్థలంలోనే జియా మరణించాడు. సోమవారం 15 రోజు కూడా మెందహార్‌ అడవుల్లో భారీ ఎత్తున కాల్పులు జరుగుతున్నాయి. 

శనివారమే పోలీస్‌ రిమాండ్‌కు..

2003లో అరెస్టైన జియా ముస్తఫా తొలుత శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నాడు. కానీ, 2018లో నవీద్‌ జాట్‌ అనే ఉగ్రవాది ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆసుపత్రి నుంచి పరారవడంతో జియాను జమ్మూలోని కోట్‌ బాల్‌వాల్‌ జైలుకు తరలించారు. తోటి ఖైదీలను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో తిహార్‌ జైలుకు పంపించాలనుకున్నారు. కానీ, అది జరగలేదు. దీంతో కోట్‌ బాల్‌వాల్‌ జైల్లోనే ఉండిపోయాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని లష్కరే ఉగ్రవాదులతో ‘టచ్‌’లో ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శనివారం మెందహార్‌ పోలీసులు 10 రోజుల రిమాండ్‌లోకి తీసుకొన్నారు. ఆదివారం అతన్ని బాతా దురియా వద్ద ఎన్‌కౌంటర్‌ ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఉగ్రవాదుల దాడిలో జియా మరణించాడు. అతికష్టం మీద ముస్తఫా మృతదేహాన్ని దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. 

‌ఉగ్రవాదుల్లో పెద్దచేప..!

2001లో నియంత్రణ రేఖను దాటి కశ్మీర్‌లో ప్రవేశించిన జియా ముస్తఫా చిన్నా.. చితకా ఉగ్రవాది కాదు. 24 మంది కశ్మీరీ పండిట్ల ప్రాణాలను బలిగొన్న ‘నదీమార్గ్‌’ నరమేధానికి సూత్రధారి. 2003 ఏప్రిల్‌ 10వ తేదీన ముస్తఫా అరెస్టును నాటి కశ్మీర్‌ డీజీపీ ఏకే సూరీ శ్రీనగర్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించారు. ఇదో పెద్ద విజయంగా అప్పట్లో పేర్కొన్నారు. ముస్తఫా.. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో జిల్లా కమాండర్‌గా పనిచేశాడు. పాక్‌లోని లష్కరే నాయకత్వం ఆదేశాల మేరకే తాను నరమేధానికి పాల్పడినట్లు జియా విచారణలో వెల్లడించాడు. 2003 ఏప్రిల్‌ చివర్లో జియా ఇచ్చిన సమాచారం ఆధారంగా యారీపోరాలోని ఒక ఇంటిపై భద్రతా దళాలు దాడిచేసి అబు రఫీ, అబు వసీం, అబు బిలాల్‌ అనే ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేశాయి. వీరు ముగ్గరు కూడా నదీమార్గ్‌ నరమేధంలో పాల్గొన్నారు. 

ఏమిటీ ‘నదీమార్గ్‌ నరమేధం’..?

1990ల్లో కశ్మీరీ పండిట్లపై దాడులు జరగడంతో ‘నదీమార్గ్‌’ గ్రామంలోని చాలా మంది ఇళ్లు వదిలి జమ్మూ సహా ఇతర ప్రాంతాలకు వలసపోయారు. కానీ, 50 కుటుంబాలు మాత్రం ధైర్యంగా ‘నదీమార్గ్‌’లోనే ఉన్నాయి. ఈ గ్రామానికి తొమ్మిది మంది పోలీసులతో పికెట్‌ కూడా ఉంది. కానీ, 2003 మార్చి 23వ తేదీన ముగ్గరు పోలీసులు రాలేదు. ఆ రోజు రాత్రి దాదాపు 12 మంది ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు ధరించి గ్రామానికి వచ్చారు. వీరు తొలుత పోలీస్‌ పికెట్‌ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆరుగురు పోలీసులు నిద్రపోతుండటంతో వారి ఆయుధాలను తీసుకొని వారిని బంధించారు. అనంతరం గ్రామంలోకి వెళ్లారు. అక్కడ కశ్మీరీ పండిట్లను వీధుల్లోకి ఈడ్చుకొచ్చి వరుసగా నిలబెట్టి కాల్చి చంపారు. మృతుల్లో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు. అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పలు దేశాలు ఈ దాడిని ఖండించాయి. నిందితులకు శిక్షపడేందుకు అవసరమైన సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. 

శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో..!  

2003 సంవత్సరంలో భారత్‌-పాక్‌ మధ్య సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారత్‌-పాక్‌లు తెరవెనుక చర్చలను మొదలుపెట్టాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొనే అవకాశాలు మెరుగుపడుతున్నప్పుడు నదీమార్గ్‌ ఘటన చోటు చేసుకొంది. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని