Omicron: కేసుల పెరుగుదలకు తగ్గట్లు సిద్ధం కావాలి: డబ్ల్యూహెచ్‌వో

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ రోజురోజుకి విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, భారత్‌ తదితర ఆసియా- పసిఫిక్‌ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో...

Published : 03 Dec 2021 14:46 IST

జెనీవా: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ రోజురోజుకి విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, మలేషియా, భారత్‌ తదితర ఆసియా- పసిఫిక్‌ దేశాల్లోనూ కేసులు నమోదయ్యాయి. విదేశీయుల రాకపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో శుక్రవారం ఈ వేరియంట్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహచ్‌వో) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ కొత్త వేరియంట్‌ కేసుల పెరుగుదలను ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా ఆసియా-పసిఫిక్ దేశాలు తమ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, పౌరులకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని సూచించింది. గత నెలలో దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ ఒమిక్రాన్‌ను డబ్ల్యూహెచ్‌వో 'ఆందోళనకర వేరియంట్‌(వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌)'గా వర్గీకరించిన విషయం తెలిసిందే.

‘ప్రస్తుత విధానాలు సరిపోతాయి’

‘సరిహద్దు నియంత్రణలు వైరస్‌ వ్యాప్తిని కొంత ఆలస్యం చేయగలవు. కానీ.. ప్రతీ దేశం కేసుల పెరుగుదలకు తగ్గట్లు సిద్ధం కావాలి’ అని డబ్ల్యూహెచ్‌వో పశ్చిమ పసిఫిక్ రీజినల్‌ డైరెక్టర్ తకేషి కసాయ్‌ తెలిపారు. ‘దేశాలన్ని కేవలం సరిహద్దు కట్టడి చర్యలపై మాత్రమే ఆధారపడకూడదు. తీవ్రంగా వ్యాపించే లక్షణాలున్న ఈ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం కావాలి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు పాటిస్తున్న విధానాలు సరిపోతాయని తెలుస్తోంది’ అని చెప్పారు. డెల్టా వేరియంట్‌ నుంచి నేర్చుకున్న పాఠాలను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. టీకాలు వేయడం, మాస్కు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి నిబంధనలను అమలు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని