Imran Khan: జో ఫోన్‌ చేస్తారని ముందుగా ఊహించి చెప్పలేం..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భవిష్యత్తులో ఫోన్‌ చేస్తారా..? అనే విషయాన్ని చెప్పలేమని శ్వేత సౌధ సిబ్బంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అత్యంత ప్రధాన్యమున్న అంశం ఉంటేగానీ జోబైడెన్‌ నుంచి కాల్‌ వెళ్లదని వివరించారు.

Updated : 28 Sep 2021 15:38 IST

ఇంటర్నట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు భవిష్యత్తులో ఫోన్‌ చేస్తారా..? అనే విషయాన్ని చెప్పలేమని శ్వేత సౌధ సిబ్బంది పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య అత్యంత ప్రాధాన్యమున్న అంశం ఉంటేగానీ జోబైడెన్‌ నుంచి కాల్‌ వెళ్లదని వివరించారు. ఇటీవల అమెరికన్‌ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో జో ఫోన్‌ చేయని విషయాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తావించారు. ‘బిజీగా’ ఉన్న అధ్యక్షుడు బైడెన్‌  అఫ్గానిస్థాన్‌ సుస్థిరత విషయంలో పాక్‌ మద్దతు కోరడానికి ఏమాత్రం బాధపడరు అంటూ ఎద్దేవా చేశారు.

నేడు శ్వేతసౌధం ప్రెస్‌ బ్రీఫింగ్‌ సమయంలో కొందరు విలేకర్లు మీడియా కార్యదర్శి జెన్‌సాకీని ఈ విషయమై ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ భవిష్యత్తులో బైడెన్‌ నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఫోన్‌కాల్‌ వెళుతుందనే విషయాన్ని ఊహించలేమని అన్నారు. అలాంటిది ఏమైనా జరిగితే విలేకర్లకు వెల్లడిస్తామని చెప్పారు.  పాకిస్థాన్‌లోని అత్యున్నత నాయకులతో సంబంధాలు కొనసాగుతున్నాయని సాకి చెప్పారు. విదేశాంగ శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌, బైడెన్‌ కార్యవర్గంలో కీలక వ్యక్తులు పాక్‌ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. అధ్యక్షుడు ఈ సమయంలో విదేశీ నాయకులందరితో మాట్లాడటం సాధ్యం కాదని వెల్లడించారు. కానీ, ఆయన బృందం అదే పనిచేస్తోందని వివరించారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐరాసలో ప్రసంగం నిమిత్తం అమెరికా వెళ్లినప్పుడు బైడెన్‌తో కూడా భేటీ అయ్యారు. మరోపక్క ఇమ్రాన్‌ఖాన్‌ ఐరాసలో ప్రసంగం సందర్భంగా అఫ్గాన్‌లో అమెరికా నిర్ణయాలను తప్పుపట్టారు. అదే సమయంలో బైడెన్‌ తనతో నేరుగా మాట్లాడకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ వాండీ ఆర్‌ షర్మన్‌ త్వరలో భారత్‌, పాక్‌ల్లో పర్యటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని