America: భారత సాయాన్ని మరువలేం

కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్‌కు తమకు అండగా నిలిచిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పునరుద్ఘాటించారు. భారత్‌ సాయాన్ని అమెరికా....

Updated : 29 May 2021 10:52 IST

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైన తొలినాళ్లలో భారత్‌ తమకు అండగా నిలిచిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పునరుద్ఘాటించారు. భారత్‌ సాయాన్ని అమెరికా ఎప్పటికీ మరువలేదన్నారు. ప్రస్తుతం కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అనేక అంశాల్లో భారత్‌, అమెరికా పరస్పర సహకారంతో కలిసి ముందుకు సాగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్‌ మహమ్మారిపైనా కలిసే పోరాడుతామని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌ శుక్రవారం బ్లింకెన్‌తో భేటీ అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బైడెన్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమెరికాలో పర్యటించిన తొలి క్యాబినెట్‌ స్థాయి మంత్రి జైశంకరే కావడం విశేషం. కరోనా కష్టకాలంలో వివిధ రూపాల్లో భారత్‌కు అండగా నిలిచిన అమెరికాకు జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బ్లింకెన్‌తో భేటీ సందర్భంగా అనేక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య బంధం బలపడిందని పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తోనూ జైశంకర్‌ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఉన్న అవకాశాలపై చర్చించినట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుత సమయంలో నెలకొన్న భద్రతా సమస్యలపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌పై పోరులో ముందున్న అమెరికా సైనిక వ్యవస్థని ఈ సందర్భంగా అభినందించినట్లు వెల్లడించారు.

అలాగే కొవిడ్‌ టీకాల విషయమై సహాయం కోరుతూ జైశంకర్‌ అమెరికాలోని పలువురు ప్రముఖులతో చర్చలు జరిపారు. డెమొక్రాటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన ప్రభావశీలురైన శాసనకర్తలతో ఆయన భేటీ అయ్యారు. విదేశీ వ్యవహారాల సభా సంఘం ఛైర్మన్‌ గ్రెగరీ మీక్స్‌, ఇండియా కాకస్‌ ఛైర్మన్‌ బ్రాడ్‌ షెర్మాన్‌, వాణిజ్య ప్రతినిధి కేథరిన్‌ తాయ్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సల్లివాన్‌తోనూ భేటీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని