US: ఆంక్షలు ఎత్తివేసిన అగ్రరాజ్యం.. ప్రవాసుల తిరుగు ప్రయాణం

అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆ దేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. సోమవారం నుంచి అమెరికా-భారత్​ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి......

Published : 08 Nov 2021 18:37 IST

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆ దేశానికి భారతీయులు తరలివెళ్తున్నారు. సోమవారం నుంచి అమెరికా-భారత్​ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆంక్షల కారణంగా భారత్​లో చిక్కుకున్న ప్రవాసులు ప్రస్తుతం తిరుగు ప్రయాణమవుతున్నారు. అమెరికా తీసుకున్న నిర్ణయం తమకు ఉపశమనం కలిగించిందని వారు పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా గతేడాది మార్చి 23న అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తూనే సాధారణ ప్రయాణాలను పునరుద్ధరించడం తమ లక్ష్యమని ఆ దేశం పేర్కొంటోంది. భారత్​ సహా చైనా, మెక్సికో, కెనడా, ఐరోపాకు చెందిన ప్రయాణికులపై కూడా యూఎస్‌ ఆంక్షలను తొలగించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించాకే ప్రయాణాలకు అనుమతించాలి. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు 35 వేల డాలర్ల వరకూ జరిమానా విధించనున్నట్లు అగ్రరాజ్యం స్పష్టం చేసింది.

యూఎస్‌కు ప్రయాణమయ్యే ముందే విదేశీ పౌరులకు వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండాలి. ప్రయాణానికి ముందు 72 గంటల్లోపు చేయించుకున్న కొవిడ్‌ పరీక్ష ‘నెగెటివ్‌’ రిపోర్టును అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అయితే మెక్సికో, కెనడాల నుంచి రోడ్డు, జల మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులు కొవిడ్​ టెస్ట్​ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 18 ఏళ్ల లోపు వారు టీకాలు తీసుకొని ఉండాల్సిన అవసరం లేదు. రెండేళ్లు, అంతకంటే చిన్న పిల్లలకు కొవిడ్‌ పరీక్ష అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని