ఆ రాత్రి సుశాంత్‌ సోదరితో గొడవ జరిగింది

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఒక కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన

Published : 19 Aug 2020 01:38 IST

అప్పటి నుంచి ఆ ఫ్యామిలీతో నేను సరిగా మాట్లాడటం లేదు: రియా చక్రవర్తి

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి కూడా ఒక కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ నుంచి రూ.15కోట్లు రియా చక్రవర్తి తీసుకున్నట్లు ఆయన తండ్రి కేకే సింగ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి తన లాయర్లతో కలిసి ఒక  ప్రకటన విడుదల చేసింది. సుశాంత్‌ నుంచి నగదు తీసుకున్నట్లు ఆయన కుటుంబం చేస్తున్న ఆరోపణలను అందులో ఖండించింది. అసలు తనకు ఆ కుటుంబంతో పరిచయం పెద్దగా లేదని స్పష్టం చేసింది.

‘‘కొన్నేళ్లుగా రియా, సుశాంత్‌లు ఒకరికొకరు తెలుసు. ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లు. ఏప్రిల్‌ 2019లో జరిగిన ఓ పార్టీకి  కలిసి హాజరయ్యారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. డిసెంబరు 2019 నుంచి ఇద్దరూ బాంద్రాలో కలిసి జీవించడం మొదలు పెట్టారు. జూన్‌ 8, 2020న సుశాంత్‌ ఇంటి నుంచి రియా వెళ్లిపోయింది. ప్రస్తుతం సుశాంత్‌ కుటుంబం చేస్తున్న ఆరోపణలు అర్థరహితం. అవన్నీ కల్పితాలు. ముంబయి పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రియా ఆర్థిక లావాదేవీలను పరిశీలించాయి. సుశాంత్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఆమెకు ఎలాంటి లావాదేవీలు జరగలేదు. రియా ఆదాయపుపన్ను వివరాలను కూడా పోలీసుల, ఈడీ పరిశీలించారు. చట్ట ’వ్యతిరేకంగా ఎలాంటి అవతకతవకలు కనిపించలేదు’’

‘‘సుశాంత్‌తో పరిచయమైన తొలి రోజుల్లో సుశాంత్‌ ఇంటికి రియా వెళ్లారు. అప్పుడు సుశాంత్‌ తన సోదరి ప్రియాంక, ఆమె భర్త సిద్ధార్థ్‌లతో కలిసి ఉండేవారు. ఒకరోజు జరిగిన పార్టీలో ప్రియాంక అతిగా మద్యం సేవించారు. మరుసటి రోజు షూటింగ్‌ ఉండటంతో రియా... సుశాంత్‌ గదికెళ్లి నిద్రపోయింది. అర్ధరాత్రి లేచి చూసే సరికి ప్రియాంక తన పక్కన ఉండటంతో రియా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమెను నిద్రలేపి ఆ గది నుంచి వెళ్లిపోమన్నది చెప్పింది. ఇదే విషయాన్ని రియా.. సుశాంత్‌కు చెప్పగా, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటి నుంచి సుశాంత్‌ కుటుంబంతో రియా సత్సంబంధాలు సరిగా లేవు’’

‘‘ఈ ఏడాది జూన్‌లో సుశాంత్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ముంబయి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని, ఎవరినైనా వచ్చి కలవమని చెప్పాడు. దీంతో ఆయన సోదరి మీతూ వస్తానని చెప్పడంతో తన ఫ్లాట్‌ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సుశాంత్‌.. రియాను కోరాడు. తనకు ఇష్టం లేకపోయినా, సుశాంత్‌ సోదరి వస్తోందన్న కారణంగా రియా కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రియా డాక్టర్‌ సుశాన్‌ వాకర్‌ వద్ద థెరపీ తీసుకుంది. రియా ఎప్పుడూ ఆదిత్య ఠాక్రేను కలవలేదు. కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడలేదు. శివసేన నాయకుడిగా మాత్రమే ఆదిత్య ఆమెకు తెలుసు’’ అని రియా న్యాయవాదులు ఆమె తరఫున ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని