టాప్‌ కొరియోగ్రాఫర్‌ మెచ్చిన డ్యాన్స్‌ ఇది..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అధిక మొత్తంలో వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే...

Updated : 26 Nov 2020 11:56 IST

త్రివిక్రమ్‌ చూస్తే కచ్చితంగా పిలుస్తారు: శేఖర్‌

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ ఫైట్‌ ఎంతో విభిన్నంగా చిత్రీకరించారు దర్శకుడు త్రివిక్రమ్‌. శ్రీకాకుళం మాండలికంలో ‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’ అనే పాటకు అనుగుణంగా ఫైట్‌ చూపించారు. దీనికి థియేటర్లలో అభిమానులు సైతం ఈలలు వేసి గోల చేశారు.

కాగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ ఛాంపియన్స్‌’. దక్షిణాదిలో పేరు పొందిన కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో రష్మి-సుధీర్‌, ఆది-వర్షిణి టీమ్‌ లీడర్లగా మెప్పిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న ఈ షో తాజాగా సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా సెమీస్‌ రౌండ్‌-2లో ఆది-వర్షిణి టీమ్‌కు చెందిన సోమేశ్‌ తన డ్యాన్స్‌తో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు.

‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’ అనే పాటకు సోమేశ్‌.. ఇసుకతో వేసిన డ్యాన్స్‌ చూసి సెట్‌లో ఉన్నవాళ్లందరూ ‘వావ్’‌ అన్నారు. పెర్ఫామెన్స్‌ అనంతరం శేఖర్‌ మాట్లాడుతూ.. ‘పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫామెన్స్‌ సోమేశ్‌. ఏం చెప్పాలో మాటలు రావడం లేదు. నువ్వు అద్భుతమైన కంటెస్టెంట్‌వి’ అని అన్నారు. అనంతరం సోమేశ్‌కి డ్యాన్స్‌ కొరియోగ్రాఫ్‌ చేస్తున్న చిట్టి మాస్టర్‌పై స్పందిస్తూ.. ‘చిట్టి.. సోమేశ్‌ డ్యాన్స్‌ గురించి ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. నటరాజ స్వామే వచ్చి డ్యాన్స్‌ చేసినట్లు ఉంది. సాంగ్‌కి అనుగుణంగా ఇసుక థీమ్‌ని బాగా సృష్టించావు. థమన్‌ ఈ సాంగ్‌ని చాలా బాగా కంపోజ్‌ చేశారు. ఇది డ్యాన్స్‌ సాంగ్‌ కాదు. ఫైట్‌ సాంగ్‌. కానీ, వినే కొద్ది వినాలనిపించేలా ఉంటుంది. ఇలాంటి పాటకు కొరియోగ్రఫీ క్రియేట్‌ చేసి పెర్ఫామెన్స్‌ చేయడం నాకు బాగా నచ్చింది. ఒకవేళ త్రివిక్రమ్‌గారు ఇది చూస్తే.. తప్పకుండా నిన్ను పిలుస్తారు’ అని శేఖర్‌ మాస్టర్‌ వివరించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని