‘లవ్‌స్టోరి’ మరో ‘ప్రేమనగర్‌’

‘‘నటుడు.. స్టార్‌ ఇవి రెండూ భిన్నమైన పదాలు. చైతన్యని శేఖర్‌ కమ్ముల ఒక స్టార్‌ నటుడిగా మార్చార’’న్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా ‘లవ్‌స్టోరి’ విజయోత్సవ వేడుక జరిగింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది.

Updated : 23 Aug 2022 12:36 IST

‘‘నటుడు.. స్టార్‌ ఇవి రెండూ భిన్నమైన పదాలు. చైతన్యని శేఖర్‌ కమ్ముల ఒక స్టార్‌ నటుడిగా మార్చార’’న్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా ‘లవ్‌స్టోరి’ విజయోత్సవ వేడుక జరిగింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు. వేడుకని ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ ‘‘ప్రేమనగర్‌’ విడుదలై యాభై ఏళ్లయ్యింది. నాన్న కెరీర్‌లో పెద్ద విజయం సాధించిన ఆ సినిమా విడుదల రోజునే ‘లవ్‌స్టోరి’ విడుదలైంది. అప్పట్లో కూడా ఇలాగే తుఫాన్‌ వచ్చింది. ఈసారి కొవిడ్‌, తుఫాన్‌ వచ్చినా ‘లవ్‌స్టోరి’ ఘన విజయం సాధించి, మరో ‘ప్రేమనగర్‌’ అయ్యింది. ఈ సినిమా విజయంతో ప్రతి దర్శకనిర్మాత సంబరాలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. అలా మా అందరినీ చల్లని చూపు చూసి మీ దీవెనలు ఇవ్వండని కోరుతున్నాం’’ అన్నారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంలో చాలా ఒత్తిళ్లు ఎదుర్కొన్నాం. నిర్మాతలు నిరంతరంగా మాతో ఉంటూ మనం థియేటర్‌కి వెళ్లాల్సిందే అన్నారు. చిరంజీవి సర్‌ మొదలుకొని చాలా మంది మాకు అండగా నిలిచార’’న్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘నా సినిమాలు విడుదలై రెండేళ్లయింది. ‘లవ్‌స్టోరి’ విడుదలైన రోజు చాలా మేజికల్‌గా అనిపించింది. ముందు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాల’’న్నారు. కార్యక్రమంలో కె.ఎస్‌.రామారావు, నిర్మాత నారాయణ్‌దాస్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, సుద్దాల అశోక్‌తేజ్‌, సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌, మాస్టర్‌ భాను ప్రకాశ్‌, బేబీ త్రిషాల తదితరులు పాల్గొన్నారు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు