Updated : 23/09/2021 07:39 IST

అప్పుడే ఏ మార్పైనా సాధ్యం

‘హైబ్రీడ్‌ పిల్ల’.. సాయిపల్లవి. తెరపై సహజంగా కనిపిస్తూ తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఈఅమ్మడు.. బలమైన నటనా ప్రాధాన్య పాత్రలతో కథానాయకులకు దీటుగా కథల్ని భుజాలపై మోసి మెప్పిస్తుంటుంది. ఇప్పుడామె నాగచైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఇది ‘ఫిదా’ లాంటి హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న కొత్త సినిమా. ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది సాయిపల్లవి. ఆ విశేషాలివి...

‘‘లవ్‌స్టోరీ’ సినిమాలో రేవంత్‌, మౌనికల పాత్రల ద్వారా దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ మంచి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. సమాజంలోని అసమానతలు, లింగ వివక్ష లాంటి అంశాలను చర్చించారు. మనలో ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు.. మాస్టర్స్‌ కాదు.. కానీ, ప్రయత్నించి సాధించాలనే సంకల్పం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది. అలా రేవంత్‌, మౌనిక పాత్రలు తమ కలల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాయి? ఎదురైన సవాళ్లేంటి? అన్నది ఆసక్తికరం. ఇందులో రేవంత్‌గా చైతన్య నటించగా.. మౌనిక పాత్రను నేను పోషించా. ఈ సినిమా కోసం నాకు శేఖర్‌ నుంచి పిలుపొచ్చినప్పుడే.. కచ్చితంగా చేయాలని నిర్ణయించేసుకున్నా. ఇక కథ.. అందులోని నా పాత్ర విన్నాక ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో వదులు కోకూడదని బలంగా అనుకున్నా’’.

సంతృప్తి దొరికింది..

‘‘అత్యాచారాలు, మహిళలపై జరిగే దాడుల గురించి తెలిసినప్పుడు మనసులో ఒకరకమైన బాధ ఉండేది. ఏం చేయలేని పరిస్థితి. నటిగా ఉన్నప్పుడు వెండితెరపై నా కళతో ఆ తప్పును ప్రశ్నించగలుగుతా. సమస్యపై ఓ ఆలోచన తీసుకురాగలుగుతా. ‘లవ్‌స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు ఈ విషయంలో నాకెంతో సంతృప్తిగా అనిపించింది. కనీసం ఈ సినిమాతోనైనా నా గళం వినిపించగలిగా. ఇప్పటి వరకు అమ్మాయిని బాధితురాలిగా చూపించిన సినిమాలే ఎక్కువ వచ్చాయి. సమస్యలను అధిగమించి ఎలా ప్రయాణాన్ని కొనసాగించిందనేది శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో కమర్షియల్‌గా చూపించారు. అందుకే ఇది ప్రతి అమ్మాయి, మహిళ చూడాల్సిన సినిమా’’.

ఏ సమస్యపైనైనా చర్చ జరిగితేనే..

‘‘సమాజంలోని అసమానతలైనా.. కుల, మత, లింగ వివక్షలైనా సరే.. ఏ సమస్యపైనైనా చర్చజరగాలి. అప్పుడే ఏ మార్పయినా సాధ్యమవుతుంది.


ఆ వివక్ష ఎదుర్కోలేదంటేనే ఆశ్చర్యపోవాలి

‘‘ఈ భూమిపై పుట్టిన ప్రతి అమ్మాయి ఏదోక సమయంలో వివక్ష ఎదుర్కోక తప్పదు. ఏ అమ్మాయి అయినా వివక్ష ఎదుర్కోలేదంటేనే ఆశ్చర్యపోవాలి. చుట్టూ ఉన్న సమాజంలోనే కాదు.. ఇంట్లో మన అమ్మ, అక్కచెల్లెళ్ల వరకు అందరికీ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. పోనీలే అని చాలా మంది వదిలేస్తుంటారు. అసలివి బయటకు చెప్పుకోవాల్సిన అవసరమేంటనే భావన ఇంకా జనాల్లో ఉంది. ఈ వివక్ష విషయంలో వందేళ్ల తర్వాత మార్పు రావచ్చేమో’’.


ఆ చిత్రం అందుకే వద్దన్నా

‘‘నేను గొప్ప డ్యాన్సర్‌ని అని ఎప్పుడూ అనుకోను. ‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్‌ వేడుకలో చిరంజీవి సర్‌ నాపై కురిపించిన ప్రశంసలు ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. నేనిప్పటి వరకు చేసిన గీతాల్లో ‘రౌడీబేబీ’, ‘ఏవండో నాని గారు’ పాటలు కష్టంగా అనిపించాయి. రీమేక్‌లు చేయకూడదనే రూల్స్‌ ఏమీ పెట్టుకోలేదు. మాతృక స్థాయిలో చేయాలి లేదా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి ఉంటుంది. అందుకే దాని బదులు ఓ కొత్త స్క్రిప్ట్‌ చేస్తే మంచిద నిపిస్తుంది. చిరంజీవి సర్‌ సినిమాకి నో చెప్పడానికి కారణం.. అది రీమేక్‌ అని కాదు. ఆ పాత్రకు న్యాయం చేయలేను అనిపించింది’’.


* ‘‘ప్రస్తుతం నేను తెలుగులో రానాతో ‘విరాటపర్వం’ చేస్తున్నాను. ఇంకొక్క రోజు చిత్రీకరణ మిగిలి ఉంది. నానితో చేస్తున్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రీకరణ పూర్తయింది. తెలుగులో రెండు, తమిళం, మలయాళంలో ఒక్కో సినిమా చేయాల్సి ఉంది. ఓటీటీ కోసం ఓ కథ వింటున్నా. మంచి కథ దొరికితే బాలీవుడ్‌లో చేయడానికైనా సిద్ధమే’’.


* ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక... అన్ని భాషల చిత్రాలను పాన్‌ ఇండియా స్థాయిలో చూస్తున్నారు. అందుకే అక్కడి నటులకు ఇక్కడ, ఇక్కడి వారికి అక్కడ అవకాశాలు వస్తున్నాయి. ఇది చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది.

* ప్రస్తుతానికి నటిగానే కొనసాగుతున్నా. భవిష్యత్తులో వైద్యురాలిగా మారతానేమో. జార్జియాలో వైద్యవిద్య అభ్యసించాను.  మన దేశంలో డాక్టర్‌గా సేవలందించడానికి అనుమతి కోసం పరీక్ష రాయాల్సి ఉంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని