Updated : 29/08/2021 10:40 IST

HBD Nagarjuna: సాహసాల ‘గ్రీకువీరుడు’.. అభిమానుల ‘మన్మథుడు’

సైకిల్‌ చైన్‌ తెంచి టాలీవుడ్‌ హీరోయిజానికి కొత్త దారి వేసిన కథానాయకుడు నాగార్జున. ‘హలో గురు ప్రేమకోసమే’అని పాడుకుంటూ హీరోయిన్‌ వెంటపడితే ప్రేక్షకులూ గంతులేశారు.  మా..మా.. మాస్ అంటూ చొక్కా మడతేసి కొడితే థియేటర్లో అభిమానులు పూనకంతో ఊగిపోయారు.  క్యాన్సర్‌ బాధితుడిగా ‘గీతాంజలి’లో చూపించిన విషాదానికి సినిమా హాళ్లు కన్నీళ్లతో తడిశాయి. ‘అన్నమయ్య’, ‘శ్రీ రామదాసు’ సినిమాలకి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది తెలుగు సినీ లోకం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ టాలీవుడ్‌ ‘కింగ్‌’గా సాగిపోతున్నారాయన. ఇవాళ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

సాహసాలకు వెనకాడని నైజం

కెరీర్‌ ఆరంభం నుంచే తన సాహసాలతో టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచిన హీరో నాగార్జున‌. ‘విక్రమ్‌’తో వెండితెర అరంగేట్రం చేసిన నాగ్‌ అనతి కాలంలోనే టాప్‌ హీరోల సరసన చేరేందుకు ఓ రకంగా ఆ సాహసాలే తోడ్పడ్డాయని చెప్పొచ్చు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా లేని ఓ పాతికేళ్ల కుర్రాడికి డైరెక్టర్‌గా అవకాశమివ్వడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.  ఆ కుర్ర దర్శకుడే రామ్‌గోపాల్‌ వర్మ. వీరిద్దరూ తీసిన ‘శివ’ టాలీవుడ్‌లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఇలాంటి సాహసాలు తన కెరీర్‌లో మరెన్నో చేశాడాయన. అగ్రహీరోలంతా కమర్షియల్‌ సినిమాలు తీస్తూ దూసుకెళ్తున్న సమయంలో ‘గీతాంజలి’ లాంటి విషాద కావ్యాన్ని టాలీవుడ్‌కు అందించి తన మార్క్‌  చూపించాడు. భక్తి చిత్రాలకు కమర్షియల్‌ సినిమాల స్థాయి కలెక్షన్లు రప్పించడం నాగార్జునకే చెల్లింది. ‘ఘరానా బుల్లోడు’, ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి సూపర్‌ హిట్లు తీసిన తర్వాత ‘అన్నమయ్య’ లాంటి భక్తిరస చిత్రాన్ని ఎంచుకోవడం కూడా అప్పట్లో ఓ సాహసమే.


అమ్మాయిల కలల రాకుమారుడు 

90వ దశకం నుంచే తెలుగమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు నాగార్జున. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో మహిళల్లోనూ విపరీతమైన క్రేజ్‌ సంపాదించాడు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా నాటికి ఆ అభిమానం తారస్థాయికి చేరింది. ఆ తర్వాత వచ్చిన ‘మన్మథుడు’, ‘సంతోషం’ లాంటి సినిమాలతో టాలీవుడ్‌ మన్మథుడిగా మారిపోయారు. పురుషులతో సరిసమానమైన మహిళా అభిమానులను నాగార్జునకు ఉన్నారనడంలో సందేహం అక్కర్లేదు. 


బుల్లితెరపైనా విశ్వరూపం

వెండితెరపై ఎన్నో హిట్లిచ్చిన నాగార్జున.. బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. తొలిసారి ఆయనే నిర్మించిన ‘యువ’ అనే సీరియల్‌లో మెరిసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీలో పాపులర్‌ రియాలిటీ షో అయినా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తీసుకొచ్చారు షో నిర్వాహకులు. ఆ కార్యక్రమాన్ని తనదైన స్టైల్‌ జోడించి రక్తి కట్టించారు.  ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’కి కూడా హోస్ట్‌ గా చేసి మెప్పించారాయన.  త్వరలోనే బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ ఆరంభం కానుంది. ఈ రియాలిటీ షోలతో బుల్లితెరపైనా అభిమానులను సంపాదించుకున్నారాయన. 


ఏఎన్నాఆర్‌తో ఆరు

తెలుగుతెరపై చెరిగిపోని ముద్రవేసిన లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ వారసత్వాన్ని నాగార్జున విజయవంతంగా కొనసాగించారు. అయితే వీరిద్దరూ కలిసి సినిమాలు కూడా చేశారు.  ఆయనతో నాగార్జున చేసిన చివరి సినిమా ‘మనం’ మంచి విజయం సాధించింది. అయితే వీరిద్దరూ దీనికన్నా ముందు మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగార్జున హీరో అయ్యాక తొలిసారి ‘రావుగారి ఇల్లు’లో  నటించారు. ఆ తర్వాత  ‘కలెక్టరుగారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’,  ‘ఇద్దరూ ఇద్దరే’, ‘శ్రీరామదాసు’ ఇలా మొత్తం ఆరు సినిమాల్లో కలిసి నటించారు. అయితే అంతకుముందే ఏయన్నార్‌ ‘సుడిగుండాలు’ చిత్రంలో  బాలనటుడిగా చేశాడు నాగ్‌. తండ్రి ఏయన్నార్‌తోనే కాకుండా తన ఇద్దరు కుమారులు నాగచైతన్య,అఖిల్‌లతోనూ కలిసి నటించారాయన. 


వైవిధ్య చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌

ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల్లో నాగ్‌ కచ్చితంగా ముందుంటారు. ఇండస్ట్రీ హిట్లు అందించినప్పుడు.. ఆ వెంటనే ఏదో ఒక విభిన్న కథాంశంతో చిత్రాలను ముందుకు తెచ్చేవారాయన. ‘విక్కీదాదా’తో  హిట్‌ కొట్టిన వెంటనే ‘గీతాంజలి’ విడుదలైంది. అందులో క్యాన్సర్‌ రోగిగా ఆయన నటనకు ప్రశంసల జల్లు కురిసింది.  ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి రొమాంటిక్‌ సినిమాతో బాక్సాఫీస్‌ కాసుల వర్షం కురిపించిన ఆయన, ఆ వెంటనే ‘అన్నమయ్య’ సినిమా చేశారు. ఇలా ఓ వైపు కమర్షియల్‌ హిట్లు కొడుతూనే ఆ వెనువెంటనే వైవిధ్యంగా దర్శనిమిచ్చేవారు. ఇలాగే ‘మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాల తర్వాత ‘ఊపిరి’ సినిమా చేశారు. అందులో కాళ్లు, చేతులు పనిచేయని సంపన్నుడి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీలో నటిస్తుండగా, కల్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో ‘బంగార్రాజు’గా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు నాగ్‌.  హిందీలో  ‘బ్రహ్మస్త్ర’లోనూ  నటిస్తున్నారు. నాగ్‌ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ... ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్