Rajashekar: ‘‘అంకుశం’లో రామిరెడ్డిని నిజంగానే కొట్టా.. ‘గరుడ వేగ-2’ తీస్తున్నాం!

విలక్షణ నటుడు రాజశేఖర్‌ది కళకళలాడే కళాకారుల కుటుంబం. ఆయన మూడున్నర దశబ్దాలుగా ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు తెరపై యాంగ్రీ స్టార్‌గా వెలుగొందుతుంటే, ఆయన భార్య జీవిత.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, నిత్యం భర్తకు వెన్నంటే తోడుగా ఉంటూ తన పంతాలో ముందుకెళ్తున్నారు. వారి ఇద్దరు కుమార్తెలూ

Updated : 12 Jan 2022 09:48 IST

మూడున్నర దశబ్దాలుగా ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు తెరపై యాంగ్రీ స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు రాజశేఖర్‌. ఆయన భార్య జీవిత.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, నిత్యం భర్తకు వెన్నంటే తోడుగా ఉంటూ ముందుకెళ్తున్నారు. వారి ఇద్దరు కుమార్తెలూ హీరోయిన్లుగా తెరంగేట్రం చేసి విజయాలు అందుకున్నారు. సినిమా తమకు పంచప్రాణాలైతే.. కుటుంబం ఆరో ప్రాణంగా బతికే రాజశేఖర్‌ దంపతులు.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిద్దరూ పంచుకున్న జీవితానుభవాలు.. ఆసక్తికర విషయాలు మీకోసం..

మీరిద్దరూ మొదటసారి ఎక్కడ కలుసుకున్నారు?

రాజశేఖర్‌: మైనా థియేటర్‌లో ఓ ప్రివ్యూ షోకి వెళ్లినప్పుడు జీవితను తొలిసారి చూశా. అప్పటికే ఆమె హీరోయిన్‌ అని తెలుసు. చాలా యాక్టివ్‌గా ఉందే అని అనుకున్నా. అప్పుడు మేం ఇద్దరం కలుసుకోలేదు. కేవలం నేను తనని చూశానంతే.

జీవిత: నాకు ఆయన ‘హలో యార్‌ పెసురత్తు’ చిత్రంతో పరిచయమయ్యారు. నేను, ఆయన(రాజశేఖర్‌), సురేశ్‌ ముగ్గురం నటించాం. రెండ్రోజులు షూటింగ్‌ కూడా చేశాం. 

రాజశేఖర్‌: జీవిత హీరోయిన్‌, నేను హీరో. అనారోగ్యం కారణంగా మొదటి రోజు షూటింగ్‌కి ఆమె రాలేదు. రెండో రోజు సెట్‌కి రాగానే ‘ఈమెనే హీరోయిన్‌ ఎలా ఉంది?’ అని  చిత్రబృందం నన్ను అడిగింది. ‘బాగాలేదండి. మన సబ్జెక్ట్‌కి ఆమె సూట్‌ అవదు. హీరోయిన్‌ను మార్చేయండి’ అని చెప్పాను. మరుసటి రోజు జీవితను కాదు.. నన్ను మార్చారు.

జీవిత: చాలా కాలం తర్వాత ‘తలంబ్రాలు’ చిత్రంతో మళ్లీ కలిశాం. ఆ తర్వాత మాకు వివాహామైంది. మొదట వాళ్లింట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. ‘మగాడు’ షూటింగ్‌లో రాజశేఖర్‌ గారికి ప్రమాదం.. ఆస్పత్రిలో చేరడం వంటి ఘటనలు జరిగాయి. ఆ తర్వాతే మా మామగారు నన్ను ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్లారు.

మీరు డాక్టర్‌ కదా..? ఎందుకు యాక్టర్‌ అవ్వాలనుకున్నారు? 

రాజశేఖర్‌: చిన్నప్పట్నుంచి నటుడిని అవ్వాలని కోరిక ఉండేది. ‘నీలాగా మేం ఉంటే నటులమైపోతాం’ అని స్నేహితులు అనేవాళ్లు. దీంతో పరీక్షల కోసం చదవాల్సి వచ్చినప్పుడల్లా నటుడిని అవ్వాలనిపించేది. పరీక్షలు పూర్తికాగానే కాలేజీ, సరదాలతో ఆ ఆలోచన వచ్చేది కాదు. నాకు నత్తి ఉంది. ఎవరైనా దర్శక-నిర్మాతలు అవకాశం ఇచ్చిన తర్వాత.. నత్తి ఉందని తీసేస్తే అసహ్యంగా ఉంటుందనే భయం ఉండేది. అసలు నాకు నటన వచ్చో.. రాదో తెలుసుకోవడానికి యాక్టింగ్‌ స్కూల్‌లో చేరా. అక్కడ నాపై నాకు నమ్మకం కలిగి నటించడం మొదలుపెట్టా.

‘శేఖర్‌’ చిత్రంలో మీ గెటప్‌ బాగుంది. ఆ సినిమా సంగతేంటి?

జీవిత: ఇప్పటి వరకూ రాజశేఖర్‌ గారు చేయని పాత్ర అది. 50ఏళ్లుపైబడిన వ్యక్తిగా కనిపిస్తారు. ఆయనకిది 91వ చిత్రం. ప్రేక్షకులు ఆయన నటించిన 90 చిత్రాల్లో చూడని భిన్నమైన.. కొత్త రాజశేఖర్‌ను ఇందులో చూస్తారు. శేఖర్‌ పాత్రకుండే భావోద్వేగం చిత్రం ఆద్యంతం కొనసాగుతుంది. ఫిబ్రవరి 4న రాజశేఖర్‌ పుట్టిన రోజు. కుదిరితే ఆ రోజే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకుంటున్నాం. 

దర్శకురాలిగా ఇది ఎన్నో సినిమా? ఈ సినిమానే ఎందుకు చేశారు?

జీవిత: ఇది నాకు ఐదో సినిమా. మొదటి సినిమా ‘శేషు’. ఆ తర్వాత ‘ఎవడైతే నాకేంటి?’, ‘మహంకాళి’, ‘సత్యమేవ జయతే’ సినిమాలకు దర్శకత్వం వహించా. ఈ సినిమా చేయడానికి చాలా గ్యాప్‌ వచ్చింది. దీన్ని వేరే వాళ్లతో చేయిద్దామనుకున్నాం. కానీ, ఈ సినిమాతో చాలా కనెక్ట్‌ అయ్యాం. ఇంకో వారంలో షూటింగ్‌ ప్రారంభమవుతుందనగా.. రాజశేఖర్‌ గారికి కొవిడ్‌ వచ్చింది. నెల రోజులు ఐసీయూలో ఉన్నారు. 

రాజశేఖర్‌: చాలా సీరియస్‌ అయింది. ఇక నేను చచ్చిపోతాను. రేపో ఎల్లుండో నా చితికి మంట పెట్టేస్తారన్న ఆలోచనలు వచ్చాయి. పిల్లలకు, జీవితకు ధైర్యంగా ఉండాలని చెప్పా. ఆ తర్వాత ప్రాణాలు నిలిచాయి. కానీ.. కాళ్లు, చేతులు ఇంకా పనిచేయలేదు.

జీవిత: ఆ సమయంలో టీవీ చూస్తూ ‘‘నేను మళ్లీ నటించలేనేమో. నాపై నాకు నమ్మకం పోయింది. ‘శేఖర్‌’ చిత్రాన్ని వేరే వాళ్లతో చేయండి’’ అని ఆయన నాతో అన్నారు. ఈ చిత్రం గురించి మాట్లాడితే.. అవన్నీ గుర్తొస్తాయి. వీటిని దాటుకొని చిత్రీకరణ పూర్తి చేసి.. విడుదల చేయబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది.

రాజశేఖర్‌: ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా మంది నేను బతకాలని ప్రార్థించారు. వాళ్ల ప్రార్థనలే నన్ను కాపాడాయి. 

జీవిత: ‘శేఖర్‌’ సినిమాపై ఇద్దరం చాలా చర్చలు జరిపాం. వేరే దర్శకుడికి ఇస్తే తను అర్థం చేసుకొని తీయడం కష్టమైపోతుందేమోనని నేనే దర్శకత్వం వహించా. ఇందులో కన్నడ కిశోర్‌ గారు, శివాని(జీవిత రాజశేఖర్‌ దంపతుల కుమార్తె) శేఖర్‌ పాత్రకు కుమార్తెగా నటించింది.

రాజశేఖర్‌: శివానీని మొదట వద్దు అనుకున్నాను. తనే చేస్తానంటే ఒప్పుకున్నా. ఈ సినిమా తనకి అడ్వాంటేజ్‌ అవుతుందనుకుంటే.. తను నటించిన ‘అద్భుతం’ చిత్రం హిట్‌ కావడంతో శివాని పాపులరిటీ సంపాదించి.. ‘శేఖర్‌’కే అడ్వాంటేజ్‌గా మారింది. 

ఆడపిల్లలు పుట్టడం అదృష్టమే. కానీ, నటవారసుడుంటే బాగుండేదని మీరిద్దరికి ఎప్పుడైనా అనిపించిందా?

రాజశేఖర్‌: నాకు చాలా సార్లు అనిపించింది. కానీ, కుదర్లేదు. మాకున్నది అమ్మాయిలే అయినా మేం గర్వపడేలా చేస్తున్నారు.

మీ అమ్మాయిలకు శివాని, శివాత్మిక అని పేర్లు పెట్టారు. మీరు శివభక్తులా?

జీవిత: అవును. అందుకే, పెద్ద అమ్మాయికి శివాని అని పేరు పెట్టాం. మరోసారి గర్భం దాల్చినప్పుడు అబ్బాయి పుడితే శివ అని పేరు పెడదామనుకున్నాం. కానీ, అమ్మాయి పుట్టింది. ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు. తన పాస్‌పోర్టులో చాలాకాలం ‘బేబీ రాజశేఖర్‌’ అనే ఉండేది. ఆ తర్వాత శివాత్మిక పేరు కొత్తగా ఉందని పెట్టాం. రాజశేఖర్‌ గారికి శివభక్తి ఎక్కువ. ఆయన మెడలో ఒక చిన్న శివలింగం ఉన్న చెయిన్‌ ఉంటుంది. చాలాసార్లు అది పోయింది.. అయినా తిరిగొచ్చింది.

రాజశేఖర్‌: అప్పట్లో గుడికి ఎక్కువగా వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇంట్లోనే మొక్కుతున్నాం. మనకంటూ ఒక శక్తి ఉంది. కానీ, ఇన్ని రూపాల్లో ఉందని నమ్మను. మనం ఏది చేస్తే అదే తిరిగొస్తుంది. అదే ఖర్మ. దాన్ని నడిపించే శక్తినే దేవుడని నేను నమ్ముతాను. 

‘అంకుశం’ సినిమా షూటింగ్‌లో చార్మినార్‌ వద్ద రామిరెడ్డిని కొట్టుకుంటూ తీసుకురమ్మంటే.. నిజంగానే కొట్టారట?

రాజశేఖర్‌: అవును. రామిరెడ్డి గారు సున్నిత మనస్కులు. ఎవరైనా ఏమైనా మాటంటే పడేవారు కాదు. అయితే, ఆ షూటింగ్‌లో నేను కొట్టినట్టు నటిస్తున్నా.. ఆయన మాత్రం కదలట్లేదు. చూసేవాళ్లు ఏం అనుకుంటారోనని దెబ్బతగలనట్లుగానే ఉన్నారు. దీంతో దర్శకుడు కోడి రామకృష్ణ వచ్చి ఆయన్ను నిజంగానే కొట్టమని నాకు చెప్పారు. కొడితే కానీ నటించడేమోననుకొని నిజంగానే కొట్టేశా. అప్పుడు కదిలారు. ఆ సీన్‌ చేయడం రామిరెడ్డికి అస్సలు ఇష్టం లేదు. కానీ, ఆ సీనే హైలైట్‌గా నిలిచింది.

‘హనుమాన్‌ జంక్షన్‌’ సినిమా మోహన్‌బాబు గారు, మీరు కలిసి చేయాల్సింది.. కానీ, ఎందుకు చేయలేదు?

రాజశేఖర్‌: షూటింగ్‌ తొమ్మిది గంటలకు అంటే.. మోహన్‌బాబు గారు తొమ్మిదికే వచ్చేస్తారు. నేను తొమ్మిది గంటలకు అంటే పది గంటలకి వస్తాను. ఈ సినిమా వల్ల మన మధ్య బంధం దెబ్బతింటుంది. అందుకే, సినిమా చేయకుండా ఉంటే బాగుంటుందని మోహన్‌బాబుకి, ఎడిటర్‌ మోహన్‌కు చెప్పాను.

చాలా మంది హీరోగా నటించి.. విలన్‌గా మారుతున్నారు. మీకు అలాంటి ఆలోచన ఉందా?

రాజశేఖర్‌: నేను విలన్‌గా చేసే హీరోనయ్యాను. మంచి పాత్ర వస్తే మళ్లీ విలన్‌గా నటించేందుకు సిద్ధమే. చేయాలన్న కోరిక కూడా ఉంది.

జీవిత: తమిళ చిత్రం ‘తని ఒరువన్‌’లో అరవింద స్వామి పాత్రను తెలుగులో రాజశేఖర్‌ గారితో చేయిద్దామనుకున్నాం. మేమే సినిమా తీయాలని హక్కులు కొనేందుకు ప్రయత్నించాం. కానీ, రామ్‌చరణ్‌తో దర్శకుడు సురేందర్‌రెడ్డి ‘ధ్రువ’ తీశారు. రామ్‌చరణ్‌తో అయినా.. ఆ పాత్ర రాజశేఖర్‌ గారికి ఇస్తే బాగుంటుందని సురేందర్‌రెడ్డిని అడిగా. కానీ, అది కుదర్లేదు. మంచి ప్రాధాన్యత ఉన్న విలన్‌ పాత్ర ఉంటే చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. 

‘గరుడ వేగ-2’ తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు విన్నాను. నిజమేనా?

జీవిత: అవును. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు.. నాగార్జున గారితో ఓ చిత్రం తీస్తున్నారు. దాని తర్వాత మరో చిత్రముంది. దాని తర్వాత ‘గరుడ వేగ-2’ తీస్తాం. మీరు(ఆలీ) కూడా అందులో ఉంటారు.

జీవిత గారు.. మీరు బయటి హీరోలకు ఎందుకు దర్శకత్వం వహించలేదు?

రాజశేఖర్‌: సమయం ఉన్నదే తక్కువ. ఉన్న సమయం నాకు చేయడానికే సరిపోవట్లేదు. అందుకే, ఇంకో హీరోను పెట్టి చేయట్లేదు. మా ఇద్దరు పిల్లలు కూడా మా సినిమాలకూ దర్శకత్వం వహించమని జీవితను అడుగుతుంటారు. 

జీవిత: ఇల్లు, పిల్లలు ఇలా తీరికే ఉండట్లేదు.

భర్తగా కాకుండా, ఒక నటుడిగా ఆయన నటించిన ఏ సినిమా మీ గుండెకు హత్తుకుపోయింది?

జీవిత: అక్క మొగుడు, గోరింటాకు, శేషు. ‘అక్క మొగుడు’ చిత్రంలో హీరో పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి మొగుడు అలా ఉండాలి. పెళ్లవగానే భార్య నాది, ఆమె ఇంటితో సంబంధం లేదు.. అని అనుకోకుండా ఆ కుటుంబం కూడా తన కుటుంబమే అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా విభేదాలు వచ్చాయా?

జీవిత: అస్సలు రావు. నేను ఆయన ఏం చెబితే నేను అది చేస్తా. అలాంటప్పుడు ఇంకెందుకు గొడవలొస్తాయి?

రాజశేఖర్‌: ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. భార్యలు టార్చర్‌ పెడతారని అంటుంటారు. అది నాకు అస్సలు తెలియదు. ‘ఎలాంటి భార్య దొరుకుతుందనేది దేవుడు ఇచ్చిన వరం’ అని తమిళంలో వాక్యం ఉంది. నిజంగా ఇలా ఉంటే ఎలాంటి గొడవలు రావు. నేను కొన్నిసార్లు గొడవ పడుతుంటా. తర్వాత నేను చేసింది తప్పని తెలుసుకుంటా.

జీవిత: రాజశేఖర్‌ గారిది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయనకు కోపం కూడా ఎక్కువ సేపు ఉండదు. మా కుటుంబంలో ఎవరు ఏమన్నా నేనే వెళ్లి సారీ చెబుతా. 

జీవిత అంటే ఒక ఫైర్‌ బ్రాండ్‌ అనే ముద్ర ఉంది. ఆ మాట విన్నప్పుడు మీకు(రాజశేఖర్‌) ఏం అనిపిస్తుంది?

రాజశేఖర్‌: మన ఇంట్లో తుస్సుమని ఉంటుంది.. ఫైర్‌ బ్రాండ్‌ ఏంటని అనుకుంటా. 

జీవిత: మా పిల్లలు కూడా అలాగే అంటుంటారు. కానీ, నేను ఇంట్లో వేరు.. బయట వేరు. బయట వాళ్లకే ఫైర్‌ బ్రాండ్‌. మా ఇద్దరు పిల్లలు.. మేం చెప్పేవాటిని అర్థం చేసుకొని అనుకూలంగా ఉంటారు. ఆ విషయంలో మేం అదృష్టవంతులం. ఎన్ని కోట్ల రూపాయలున్నా అర్థం చేసుకునే పిల్లలు లేకపోతే వ్యర్థమే కదా..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని