Published : 31/08/2021 09:19 IST

Tollywood Folk Songs: జనం గుండెల్లోంచి టాలీవుడ్‌ తెర దాకా!

తెలుగు సినిమాల్లో వెలుగుతున్న జానపదం

జనం గుండెల్లోంచి వచ్చే జానపదం టాలీవుడ్‌లో మార్మోగుతోంది.. సెమట సుక్కల్లోంచి పుట్టిన పాట వెండితెరపై చెలరేగిపోతోంది.. పల్లెపదుల సరసాల గీతం కుర్రకారు నాలుకలపై నాట్యమాడుతోంది.. నిన్నటిదాకా ఐటెం సాంగ్‌ల ఊపులో ఊరేగిన సినిమా గీతం ఇప్పుడు ఫోక్‌ మట్టి పరిమళాల్ని అద్దుకుంటోంది.. కాస్త మనసుపెట్టి చూస్తే ఈ మధ్య తెలుగు చిత్రాల్లో అభిమానుల్ని అలరిస్తున్న జాబితాలో వీటి వాటానే ఎక్కువ. వాటిలో రికార్డులు సృష్టిస్తున్న కొన్ని పాటల్ని అలా టచ్‌ చేద్దాం.

జానపదం, తెలుగు సినిమా పాటది విడదీయలేని బంధం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల నుంచి ఫోక్‌ సాంగ్‌ అడపాదడపా టాలీవుడ్‌లో ప్రభావం చూపిస్తూనే ఉంది. పంట చేలో పడుచులు పాడుకునే గీతాలు, కుల వృత్తుల శ్రామికులు శ్రమను మర్చిపోవడానికి పేర్చుకునే అక్షరాల అల్లికలు.. బావా మరదళ్లు, ప్రేయసీ ప్రియుల సరసాలు.. ఈ ఫోక్‌సాంగ్స్‌ పుట్టడానికి ప్రేరణలు. పల్లె గొంతుల్లో, జానపద కళాకారుల గుండెల్లో పల్లవించి బాగా పాపులర్‌ అయిన పాటల్ని కొంచెం అటుఇటూగా మార్చి తమ సినిమాల్లో ఉపయోగించుకొని జానపదంపై తమ మమకారాన్ని చాటుకుంటున్నారు కొందరు దర్శకులు, నిర్మాతలు. కొన్నేళ్లు వెనక్కి వెళ్తే ‘లాలూ దర్వాజ లస్కర్‌ బోనాల్‌ పండక్కి వస్తనని రాకపోతివి...’ అనే అచ్చ తెలంగాణ జానపదం అప్పట్లో పెద్ద సంచలనం. ‘సంక్రాంతి పండగొచ్చె సంబరాలు తీసుకొచ్చె.. వస్తావా జానకీ వంగతోటకీ’, ‘మాయదారి మైసమ్మో మైసమ్మా...’ ఇలాంటివి యువత, కాలేజీ విద్యార్థులను ఒక ఊపు ఊపాయి. ‘తాటి చెట్టు ఎక్కలేవు.. తాటికల్లు దింపలేవు..’, ‘కాటమరాయుడా.. కదిరీ నరసింహుడా..’ ఇలాంటివే. ఇక ఈ మధ్యకాలంలోకి పెద్ద హీరోలు, పెద్ద సినిమాల్లోనూ ఫోక్‌సాంగ్‌ చేర్చడం ఓ ఆనవాయితీలా మారింది. గతంలో ఐటెం సాంగ్‌లా ఇప్పుడు ఓ ఫోక్‌ అనే ట్రెండ్‌ మొదలైంది. దానికి తగ్గట్టే వీటిని జనం బాగా ఆదరిస్తున్నారు. ఒక్కో పాట యూట్యూబ్‌లో వీక్షణల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. అందులో మేలిమి కొన్ని.. 


దారి చూడు దుమ్ము చూడు మామా..

సినిమా: కృష్ణార్జున యుద్ధం

నాని నటించిన ఈ సినిమా ఎంతమందికి గుర్తుందో, లేదో తెలియదుగానీ రెండు, మూడేళ్ల కిందట ఈ జానపదం దుమ్ము దులిపింది. దీన్ని రాసింది, పాడిందీ పెంచల్‌దాస్‌. సినిమాల్లోకి రాకముందే ఈ పాటకు అక్షరం కట్టారాయన. చాలా వేదికలపై పాడారు కూడా. దీన్ని ఓ షోలో చూసిన తర్వాత సినిమా పెద్దలు పెంచల్‌దాస్‌ని సంప్రందించి అతడితోనే పాడించారు. హిప్‌హాప్‌ తమీజా బాణీలు సమకూర్చాడు. పెంచల్‌దాస్‌ని ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసిందీ జానపదం. 


ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా...

(సినిమా: రంగస్థలం)

యాక్టింగ్‌తో ఇరగదీశాడు అని రామ్‌చరణ్‌కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా ‘రంగస్థలం’. ప్రముఖ జానపద సింగర్‌ శివనాగులు దీన్ని చాలా వేదికలపై, రియాలిటీ షోల్లో పాడాడు. సందర్భోచితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సినిమా కోసం తీసుకున్నారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ని మార్చి రాశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చాడు. మూడేళ్ల కిందట ఈ పాట పెద్ద హిట్‌ అయ్యింది. అవినీతి రాజకీయాల్ని ఎత్తిచూపే సందర్భాల్లో వస్తే ఈ పాట వినపడుతూనే ఉంటోంది.


నాదీ నక్కిలీసు గొలుసు..

(సినిమా: పలాస 1978)

ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో బాగా పాపులర్‌ అయిన జానపదం ఇది. అసరయ్య అనే జానపద కళాకారుడు ఆశువుగా ఈ పాట పాడుతూ జనాల్లోకి తీసుకెళ్లాడు. ఎక్కడో దీన్ని విన్న సంగీత దర్శకుడు రఘు కుంచె అతడ్ని వెతికి, అనుమతి తీసుకొని మరీ ‘పలాస 1978’లో ఒక పాటకోసం వాడుకున్నాడు. రియాలిటీ షోలు, పెళ్లి వేడుకలు, టిక్‌టాక్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌ల కారణంగా మార్మోగిపోయింది.  


రాములో రాములా నన్నాగం జేసిందిరా...

(సినిమా: అలవైకుంఠపురములో..)

ఫోక్‌ సాంగ్‌కి కిరాక్‌ డ్యాన్స్‌ స్టెప్పులు జోడించి కుర్రకారును ఓ ఊపు ఊపేసిన సాంగ్‌ ‘రాములో రాములా నన్నాగం జేసిందిరో’ కాసర్ల శ్యాం ఈ గీతాన్ని తీర్చిదిద్దితే తమన్‌ బాణీలు అందించాడు. అల్లు అర్జున్, సుశాంత్, పూజా హెగ్డే, నివేదా పెతురాజ్‌ స్టెప్పులతో ఈ పాటని ఓ రేంజ్‌కి తీసుకెళ్లారు. యూత్‌ సెల్‌ఫోన్లకి రింగ్‌టోన్‌గా, వాట్సాప్‌ స్టేటస్‌గానూ ఫేమస్‌ అయ్యింది. గతంలో ఇదే పల్లవితో వచ్చిన రాములో రాములా.. తెలంగాణ యాసలో ప్రాచుర్యం పొందింది. అనురాగ్, మంగ్లీలు ఈ జనపదానికి ప్రాణం పోశారు. పాట వింటూ కుర్ర జనం ఆగమాగమైపోయిండ్రు. 


సారంగదరియా

(సినిమా: లవ్‌ స్టోరీ)

‘దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుట్టెపు రైకలు మెరియా..’ అంటూ సింగర్‌ మంగ్లీ పాడితే జనం ఫిదా అయిపోయారు. ఇక సాయిపల్లవి డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్లు కుర్రాళ్లకి నిద్రకు దూరం చేశాయి. యూట్యూబ్‌లో పాట విడుదలైన వారం రోజులకే వ్యూస్‌ కోటి దాటాయి. ఎంతగా జనాల్లోకి చేరినా దీనిపై కొన్ని వివాదాలు చెలరేగాయి. నేను రాసి, పాడిన పాటను కాపీ కొట్టారంటూ ఒక సింగర్‌ సుద్దాల అశోక్‌తేజపై విమర్శలు చేశారు. కొన్నాళ్లకు వివాదం సద్దుమణిగింది. మొత్తానికి ఈ వీడియో సాంగ్‌ని ఇప్పటికి ముప్ఫై కోట్లకుపైగా వీక్షించారు. ఇదో రికార్డు.


దిగు దిగు దిగు నాగా

(సినిమా: వరుడు కావలెను)

పాపులారిటీ, వివాదం రెండింటితో జనం నోళ్లలో నానుతున్న తాజా ఫోక్‌ సాంగ్‌ ‘దిగు దిగు దిగు నాగా...’ అసలైన పాటని అష్టవంకర్లు తిప్పి అశ్లీల పదాలు గుప్పించాడని సినిమా గీత రచయిత అనంత్‌ శ్రీరామ్‌పై చాలా విమర్శలొచ్చాయి. అయినా ఈ పాటని యూట్యూబ్‌లో ఇప్పటికే 94లక్షల వ్యూస్‌ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్‌ అయిన ఈ జానపద గీతాన్ని సినిమా కోసం మార్చి రాశాడు అనంత్‌ శ్రీరాం. తమన్‌ సంగీతం అందించాడు. శ్రేయా ఘోషల్‌ తన గాత్రంతో కనికట్టు చేసింది. 


ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లో ఫోక్‌ తన హవా చూపిస్తోంది. ఉప్పెనలో ‘సిలకా సిలకా...’, రాజా ది గ్రేట్‌లో ‘గున్నా గున్నా మామిడీ...’, సీటీమార్‌లో ‘జ్వాలారెడ్డీ...’ ఎన్నెన్నో. సినిమాలో కథ, కథనం, ఫైట్లు, నాలుగు పాటలులాగా ‘ఒక ఫోక్‌ సాంగ్‌’ అనే ఆలోచన కూడా వచ్చి చేరడం కామన్‌ అయిపోతోంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని