Cinema news: కళ్లజోడుతో, చేతికర్రతో నడిచే సత్యాగ్రహం

మన సినీ కవులు తమ కలాలతో గాంధీని కీర్తించారు. సమకాలీన సమాజానికి గాంధీజీ, ఆయన భావజాలం ఆవశ్యకతను తెలుగు ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశారు.

Updated : 29 Oct 2023 11:15 IST

అహింసతోనే స్వేచ్ఛను సాధించొచ్చని నిరూపించిన మహానేత మహాత్మాగాంధీ. ఆయన స్ఫూర్తితో తెలుగులో ‘నేటి గాంధీ’, ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, ‘మహాత్మ’ లాంటి పలు సినిమాలు తెరకెక్కాయి. మన సినీ కవులు తమ కలాలతో గాంధీని కీర్తించారు. సమకాలీన సమాజానికి గాంధీ, ఆయన భావజాలం ఆవశ్యకతను తెలుగు ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆ బోసినవ్వుల బాపూజీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనపై వచ్చిన టాలీవుడ్‌ గీతాలేంటో చూద్దాం. 

దండియాత్రనే దండయాత్రగా చేసిన జగజ్జేత

‘మహాత్మ’లోని ‘రఘుపతి రాఘవ రాజారాం’ అంటూ సాగే పాట ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.  ‘మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా..గాంధీ, మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి’ అని మహాత్ముడి జీవిత స్ఫూర్తిని నూరిపోసిన పాటిది. ‘గుప్పెడు ఉప్పును పోగేసి, నిప్పుల ఉప్పెనగా చేసి, దండియాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత’ అని అహింస మార్గంలో ఆయన చేసిన పోరాటాలను గుర్తుచేస్తుంది.  గాంధీ గొప్పతనాన్ని తెలియజేసే ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.  దివంగత గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గాత్రంతో.. ప్రేక్షకుల్లో దేశభక్తి నింపారు.


  ఓ బాపూ నీ సాయం మళ్లీ కావాలి

మాస్‌, మెలోడి గీతాలతో యువతను ఆకట్టుకునే సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌. ‘శంకర్‌దాదా జిందాబాద్‌’లో మహాత్మాగాంధీ స్ఫూర్తిని తెలిపే అద్భుతమైన పాటనందించారు. ‘ఓ బాపూ నువ్వే రావాలి’ అంటూ సాగే ఆ గీతం గాంధీయిజం ఆవశ్యకతను తెలియజెప్పింది. ఆవేశం, కోపం కాదు, చిరునవ్వే మన ఆయుధం అంటూ అహింసా మార్గాన నడవాలని హితబోధ చేస్తుందీ పాట. సమాజంలో జరుగుతున్న అరాచకాలను ఆపేందుకు బాపూ నువ్వే రావాలి, నీ సాయం మళ్లీ కావాలి అని రచయిత సుద్దాల అశోక్‌తేజ చైతన్యవంతమైన సాహిత్యం అందించారు. అదే స్థాయిలో ఈ పాటను ఆలపించి గాంధీపై ప్రేమను చాటుకున్నారు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్, గాయకుడు సాగర్‌.


రావయ్యా బాపూజీ, మళ్లీ జన్మించి..

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజశేఖర్‌ కథానాయకుడుగా వచ్చిన చిత్రం ‘నేటి గాంధీ’. తెల్లదొరల చెర నుంచి దాస్యపు సంకెళ్లు తెంచి స్వాతంత్ర్యం తెచ్చావు. కానీ ఇప్పుడది అంధకారం పాలైంది. అందుకే బాపూజీ, దివి నుంచి మళ్లీ జన్మించి రావయ్య అని గాంధీని వేడుకొనే వాక్యాలు కదిలిస్తాయి. సమాజంలో జరుగుతున్న అకృత్యాలను ఆపడానికి బాపు మళ్లీ జన్మించాలని కథానాయిక రాశీ కోరుకుంటారు. ఇందులో గాంధీ జయంతి గురించి చెప్పే మరో అపూర్వమైన పాట ఉంది. వేటూరి సాహిత్యం, మణిశర్మ సంగీతం అందించారు.


మహాత్మా.. నీ బాటను నడిచే బలమివ్వు

బాపు గొప్పతనాన్ని వివరించే పాటల్లో ‘గాంధీ పుట్టిన దేశం, రఘు రాముడు ఏలిన రాజ్యం..’ ప్రముఖంగా నిలుస్తుంది. అవినీతిని గెలిచే బలమివ్వు, నీ చల్లని దీవెనిచ్చి, నీ బాటను నడిచే బలమివ్వు అని వచ్చే వాక్యాలు గాంధీ భావజాలంపై ప్రజల్లో ఇంకా బలమైన నమ్మకముందని చెబుతాయి. మైలవరపు గోపీ సాహిత్యంలో జాలువారిన ఈ స్ఫూర్తి గీతాన్ని సుశీల ఆలపించారు. కోదండపాణి స్వరాలు సమకూర్చారు.


గాంధీ పుట్టిన దేశమా ఇది!

గాంధీలాంటి మహాత్ముడు పుట్టిన దేశమేనా అని అసంతృప్తిని వ్యక్తం చేసే ఈ పాట ‘పవిత్రబంధం’ చిత్రంలోనిది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు. గాంధీ అనుసరించిన శాంతి, సహనం, సమధర్మంపై నేడు గూండాల లాఠీ దెబ్బ పడిందని అసహనం వ్యక్తం చేశాడు అలనాటి సినీకవి. సిఫారసు లేనిదే కనీసం స్మశానంలోనైనా చోటు దొరకదని 50 ఏళ్లకిందే ఈ పాటలో వ్యక్తం చేశారు. ఈనాటికి మన సమాజంలో అలాంటి పరిస్థితే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను మధుసుధనరావు తెరకెక్కించారు. 
 


మరిన్ని గాంధీ పాటలు

* జగపతి బాబు, ప్రేమ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మా ఆవిడ కలెక్టర్‌.’ ఇందులో జాతీయ జెండాపై ఓ గీతం ఉంది. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీత సారథ్యంలో రూపొందిన పాట. ఇందులో గాంధీ గొప్పతనం కనిపిస్తుంది.

* నందమూరి తారక రామారావు, మోహన్‌ బాబు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’. ఇందులోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో ‘గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతులై వెలిగే ధ్రువతారలు కన్నది ఈ దేశం. గాంధీ గురించి ఇలా రచయిత రాశారు జాలాది రాజారావు. కీరవాణి సంగీతం అందించగా బాలు ఆలపించి ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని