Updated : 04/06/2021 09:49 IST

SPB: స్వరాలై గుండెల్లో పుడుతూనే ఉంటావ్‌

నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి

ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్‌?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?
రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ రాగాలై పుడుతూనే ఉంటావ్‌?
నువ్వు పుట్టి డెబ్బై ఐదేళ్లేనేమో... నిమిషానికి డెబ్బై సార్లు మా గుండెల్లో స్వరాలై మోగుతూనే ఉంటావ్‌.
ఎవరయ్యా నువ్వు?


‘అహో... ఒక మనసుకు నేడే పుట్టిన రోజు...
తన పల్లవి పాడే చల్లని రోజూ...’
అంటూ... పుడుతూనే మొదలెడతావు నీ
రాగాలాపన.
నిద్రరాక ఏడుస్తుంటే..‘లాలిజో లాలీజో.. ఊరుకో పాపాయి’ అని
అమ్మవైపోతావు.
కాలేజీకి వెళుతుంటే... ‘బోటనీ పాఠముంది... మ్యాటనీ పిక్చరుంది దేనికో ఓటు చెప్పరా...’
అని టీజింగ్‌ చేస్తావ్‌.
‘స్నేహమేర జీవితం... స్నేహమేర శాశ్వతం’...
ఇంతలో స్నేహితుడై పలుకరిస్తావ్‌.
అమ్మ లాలిలో ఉంటావు...
కుర్రకారు జాలీలో ఉంటావ్‌.
ఎవరయ్యా నువ్వు?ఎక్కడి నుంచి వచ్చావ్‌?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?


అమ్మాయి మనసు అర్థం కాక నలిగిపోతుంటే... ‘మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు...’ అంటూ యవ్వనాన్ని గిల్లేస్తావ్‌.
‘ఏ దివిలో విరిసిన పారిజాతమో...
ఏ కలలో మెరిసిన ప్రేమ గీతమో’..
కవిత్వాలు రాయిస్తావ్‌.
‘ప్రియా.. ప్రియతమా రాగాలు... సఖి కుశలమా అందాలు’.. వలపు గీతాలు పాడిస్తావ్‌.
పెళ్లికి సిద్ధమైతే.. ‘తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల’ అని ఎత్తుకుంటావ్‌...
ప్రేమ విఫలమైతే.. ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ అంటావ్‌...
ప్రణయంలోనూ ఉంటావ్‌...
ప్రళయంలోనూ ఉంటావ్‌.
ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్‌?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?
కొంచెం మజ్జుగా
పడుకుంటే... ‘తెల్లారింది లెగండోయ్‌.. కొక్కొరోకో..’ అని సీతారామశాస్త్రిని గొంతేసుకొని వాయిద్యాలతో బయలుదేరతావ్‌.
కాస్త నిర్లక్ష్యంగా ఉంటే చాలు... ‘అర్ధశతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా?’ అంటూ శంఖారావం పూరిస్తావ్‌.
‘తరలిరాద..తనే వసంతం... తన దరికిరాని వనాల కోసం’
లౌకికత్వాన్ని లౌక్యంగా పాడేస్తావ్‌.
‘రండి కదలిరండి.. నిదురలెండి..కలసిరండి’ అని విప్లవాగ్ని బోధిస్తావ్‌.
ముడుచుకున్న అచేతనంలో ఉంటావ్‌... బిగించిన
పిడికిలిలో ఉంటావ్‌.
ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్‌?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?


మా బాధ్యతలన్నీ తీరాక..
‘అదివో అల్లదివో హరి వాసమూ...’
అంటూ ఆధ్యాత్మిక గురువవుతావ్‌.
‘బ్రహ్మమొక్కటే... పరబ్రహ్మమొక్కటే...’
అని సర్వమత సారాంశాలూ విశదీకరిస్తావ్‌.
ఇంతచేశా.. అంత చేశా... అని లెక్కలు చూసుకుంటుంటే...
‘ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం... నడుమ ఈ నాటకం’... లెక్కల్ని సరిచేస్తావ్‌.
‘నరుడి బ్రతుకు నటన...
ఈశ్వరుడి తలుపు ఘటన..
ఆ రెండి నట్టనడుమా నీకెందుకింత తపనా?’
అని జీవిత సత్యాల్ని చరమాంకంలో
ఎరుకపరుస్తావ్‌..
ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్‌?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?
నిమిషానికి డెబ్బై సార్లు మా గుండెల్లో స్వరాలై పుడుతుంటావ్‌..
ఏ సందర్భంలోనైనా పాట సంబంధం
కలుపుకొని.. వస్తూనే ఉంటావ్‌.


 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని