Updated : 03/10/2021 04:55 IST

Samantha-naga chaitanya: ఔను... విడిపోతున్నాం

 నాగచైతన్య, సమంత సంయుక్త ప్రకటన

కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారాన్నే నిజం చేసింది నాగచైతన్య, సమంత జోడీ. వాళ్లిద్దరి వైవాహిక బంధానికి తెరపడింది. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామని శనివారం సంయుక్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఎన్నో చర్చలు, ఆలోచనల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ఇక నుంచి మా సొంత మార్గాల్లో ప్రయాణం చేయడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా మధ్య ఒక దశాబ్దానికిపైగా స్నేహం ఉండటం మా అదృష్టం. ఇది మా మధ్య ప్రత్యేకమైన బంధాన్ని నిలిపి ఉంచుతుందని నమ్మకం. ఈ క్లిష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు కావాలి. ముందడుగు వేయడానికి మాకు అవసరమైన గోప్యతని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అంటూ ఇద్దరూ ఒకే రకంగా ట్వీట్‌ చేశారు. నాగచైతన్య, సమంత వెండితెరపై విజయవంతమైన జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఏమాయ చేసావె’లో కార్తీక్‌, జెస్సీగా సందడి చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నారు. ఆ సినిమా నుంచే ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ‘మనం’ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలంపాటు సన్నిహితంగా కొనసాగిన ఈ జోడీ అక్టోబరు 6, 2017న గోవాలో వివాహ బంధంతో ఒక్కటైంది. వరుసగా రెండు రోజులు హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరూ సినీ జీవితాన్ని కొనసాగించారు. పెళ్లికి ముందు ‘ఏమాయ చేసావె’తోపాటు ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ తదితర చిత్రాల్లో నటించిన ఈ జంట, పెళ్లితర్వాత ‘మజిలీ’లో భార్యాభర్తలుగా నిజ జీవిత పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించింది. పెళ్లి తర్వాత నాలుగేళ్లకే ఈ ఇద్దరూ వివాహ బంధం నుంచి వైదొలిగారు. ఇటీవలే ఇద్దరూ విడిపోతున్నారనే ప్రచారం చిత్ర పరిశ్రమలో ఊపందుకుంది. ఈ ప్రచారంపై ఇద్దరూ గోప్యత పాటిస్తూ వచ్చారు. పెళ్లిరోజుకి నాలుగు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించారు. దీనివెనక కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. కొన్ని నెలల కిందటే ఈ విషయంపై ఇద్దరూ ఓ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. సమంత తన ట్విటర్‌ ఖాతాలో అక్కినేని ఇంటి పేరుని తొలగించినప్పట్నుంచి వీరి వైవాహిక బంధం మరింతగా చర్చకువచ్చింది. ఇటీవలే నాగచైతన్య ‘లవ్‌స్టోరి’లో నటించారు. సమంత ‘శాకుంతలం’ చిత్రీకరణని పూర్తి చేసింది.


దురదృష్టకరం: నాగార్జున

‘సమంత, చైతన్య మధ్య జరిగింది దురదృష్టకరం’ అన్నారు నాగార్జున. ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ... ‘‘బరువెక్కిన హృదయంతో చెబుతున్న మాట ఇది. భార్య, భర్త మధ్య జరిగే విషయాలు చాలా వ్యక్తిగతమైనవి. సమంత, చైతన్య ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైనవారు. నా కుటుంబం సమంతతో గడిపిన క్షణాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఆమె మాకు ఎప్పుడూ ప్రియమైన వ్యక్తే. దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక’’ అంటూ వ్యాఖ్య చేశారు.


 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని