Updated : 16/05/2020 09:55 IST

నాడు స్టార్స్‌ను చేస్తే.. నేడు సాయం చేశారు!

మేమున్నామని.. మీకేంకాదని..!

లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు చిత్ర పరిశ్రమంతా ఒక్కటైంది. తమను ఆదరించి.. స్టార్స్‌ను చేసిన అభిమానులు, ప్రజలకు తమవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఉపాధిలేక సతమతమవుతున్న వారికి అండగా నిలిచారు. కొందరు నేరుగా సాయం చేస్తే.. మరికొందరు పరోక్షంగా ప్రభుత్వానికి విరాళాలు అందించారు. మరికొందరేమో నిత్యావసర సరకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. పలువురు ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి.. విరాళాలు సేకరిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన తారలు, వారు చేసిన కార్యక్రమాల్ని చూద్దాం..

సినీ కార్మికుల కోసం..

లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రకాల షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో పనిచేస్తే కానీ పూటగడవని సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విరాళాలు సేకరిస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి చొరవతో ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. దీనికి చిరు అధ్యక్షత వహిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ, సురేశ్‌బాబు, కల్యాణ్‌, దాము, శంకర్‌, బెనర్జీ, మెహర్‌ రమేశ్‌ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సీసీసీకి విరాళాలు ఇచ్చారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌ రూ.1500 విలువజేసే 12 వేల కరోనా రిలీఫ్‌ కూపన్లను తెలుగు చిత్ర పరిశ్రమలోని కార్మికుల కోసం అందజేశారు. అంటే ఆయన మొత్తం రూ.1.80 కోట్ల ఆర్థిక సాయం చేశారన్నమాట. బాలకృష్ణ, నాగార్జున, ఎస్‌.ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌, తారక్‌, రామ్‌ చరణ్‌, నాని, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, రవితేజ, లావణ్య, తమన్నా, కాజల్‌ తదితరులు విరాళాలు అందించి, మంచి మనసు చాటుకున్నారు. కేవలం సీసీసీకే కాకుండా ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల సహాయనిధికి కూడా సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు.

రూ.25 లక్షలతో మొదలై..

రోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న మధ్య తరగతి ప్రజల్ని ఆదుకోవడానికి యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఫౌండేషన్‌ స్థాపించారు. రూ.25 లక్షల మూలనిధితో ‘మిడిల్ క్లాస్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సామాన్యులు, మధ్యతరగతి వారికి కావల్సిన నిత్యావసర సరకులను ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందు కోసం దేవరకొండ ఫౌండేషన్ పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో (www.thedeverakondafoundation.org) అత్యవసరమున్న వారు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తమ బృందం ఇంటిదగ్గరికి వచ్చి సహాయం చెయ్యలేదు కాబట్టి.. సహాయార్థులు ఎవరైనా వాళ్లింటి దగ్గర దుకాణాల్లో సరకులు కొనుగోలు చేస్తే ఆ ఖరీదును ఈ ఫండ్‌ నుంచి చెల్లిస్తామని విజయ్‌ పేర్కొన్నారు. ఈ ఫౌండేషన్‌కు విరాళాల రూపంలో వచ్చిన మొత్తంతోనూ విజయ్‌ దేవరకొండ సాయం చేశారు.

రూ.100 ఇస్తే పాట పాడతా..

భాషతో సంబంధం లేకుండా తన సుమధుర గానంతో శ్రోతలను పరవశింపజేసే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎస్పీబీ కూడా తన వంతు కృషి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తమకు నచ్చిన పాట పాడమని తనని అడగవచ్చని, అయితే ఆ పాటకు సాధారణ రుసుముగా రూ.100 తీసుకుంటానని అభిమానులను కోరారు. అలా వచ్చిన మొత్తాన్ని  పారిశుద్ధ్య, పోలీస్‌, వైద్యులకు సాయంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కూడా విశేష స్పందన వచ్చింది.

భారీ విరాళం

రోనాతో పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ భారీ విరాళం అందించారు. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించారు. అంతేకాదు ఇటువంటి సంక్షోభ సమయంలో అహర్నిశలు సేవలందిస్తున్న పోలీసులకు అండగా నిలిచారు. ముంబయి పోలీస్‌ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు భారీ విరాళం అందించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ప్రశంసల జల్లులు కురిశాయి.

ఫాంహౌస్‌ నుంచి..

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ తన ఫౌండేషన్‌ ద్వారా 1000 కుటుంబాలకుపైగా సాయం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కాలినడకన స్వస్థలాలకు బయలుదేరిన వలస కార్మికులకు తన ఫౌండేషన్‌ ద్వారా నిత్యం ఆహారం పంచుతున్నట్లు ఆయన చెప్పారు. రోజుకు కనీసం 500 మందికి పంపిణీ చేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. అంతేకాదు అనేక మందికి తన ఫాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. వారితో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. తన ఇల్లు, ఫాంహౌస్‌, నిర్మాణ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ముందుగానే మూడు నెలల జీతం ఇచ్చేశానని ఇటీవల చెప్పారు.

నేరుగా..

దుటివారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ లాక్‌డౌన్‌లో అనేక మందిని ఆదుకున్నారు. ఉపాధి లేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సాయం చేశారు. 25 వేల మంది సినీ కార్మికులకు విడతల వారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ సాయం చేస్తానని మాటిచ్చారు. అదేవిధంగా ఇటీవల చిత్ర పరిశ్రమలోని దివ్యాంగులకు రూ.3000 చొప్పున అందించారు. తన ఫాంహౌస్‌కు సమీపంలోని గ్రామస్థులకు రేషన్‌ పంపిణీ చేశారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, మినీ వ్యాన్‌లలో స్వయంగా నిత్యావసర సరకులు నింపి, పంపారు.

రూ.200 ఇస్తే తనతో డ్యాన్స్‌

థానాయిక శ్రియ వినూత్నంగా విరాళాలు సేకరించారు. లాక్‌డౌన్‌ వల్ల సమస్యలు ఎదుర్కొంటోన్న పేదవారి కష్టాలు తీర్చేందుకు ‘ది కైన్డ్‌నెస్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు. www.thekindnessproject.in వెబ్‌సైట్‌లో రూ.200 విరాళం చెల్లించి, రిసిప్ట్‌ ఈ-మెయిల్ చేసిన వారిలో కొందర్ని ఎంపిక చేసి.. వారితో కలిసి డ్యాన్స్‌ చేస్తానని అన్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన వృద్ధులు, రోజువారీ కూలీలు, అనాథలు, వికలాంగుల శ్రేయస్సుకు వినియోగిస్తున్నారు.

మంచి మనసు చాటిన ప్రణీత

లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రోజు కూలీలు, పేదల పరిస్థితి దయనీయంగా మారడంతో అలాంటి వారికి తనవంతు సాయం చేశారు కథానాయిక ప్రణీత. ఆర్థికంగా సహాయం చేయడమేకాదు, పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. భోజనం తయారు చేసి ప్యాకెట్లలో సర్ది పేదలకు పంపిణీ చేస్తున్నారు. తానే స్వయంగా రంగంలోకి దిగి వంట చేయడం, వండిన పదార్థాలను ప్యాక్‌ చేసి పేదలకు అందిస్తున్నారు.

వివిధ రూపాల్లో..

థానాయకుడు గోపీచంద్‌ . 1000కిపైగా పేద కుటుంబాలకు నెలకు సరిపడా సరకులు, నిత్యావసరాల్ని పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా వీటిని పేదలకు అందించారు.


టుడు శివాజీ రాజా తన ఫాంహౌస్‌లో పండించిన కూరగాయల్ని అవసరాల్లో ఉన్న వారికి పంచారు. ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేయాలని కోరారు.


టి, యాంకర్‌ రష్మి గౌతమ్‌ మూగ జీవాల ఆకలి తీర్చారు. లాక్‌డౌన్‌ కారణంగా హోటళ్లు, దుకాణాలు మూత పడ్డాయి. వాటిపై ఆధారపడి అక్కడ మిగిలిపోయిన వాటిని తిని ఆకలి తీర్చుకునే వీధి శునకాలకు రష్మి, జంతు ప్రేమికులతో కలిసి ఆహారం అందించారు.


వలస కార్మికుల తరలింపు

ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన ఉదారతను నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధిలేక చిక్కుకున్న వలస కార్మికుల్ని స్వస్థలాలకు తరలించడం కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకుని ఆయన రవాణా సౌకర్యం కల్పించారు.


ప్రముఖ నటుడు, ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ కూడా తన మంచి మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి రూ.11 లక్షలు విరాళంగా ప్రకటించారు. ‘మా’లోని సభ్యుల కోసం రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దీన్ని అవసరాల్లో ఉన్న 100 మంది సభ్యులకు రూ.10 వేలు చొప్పున అందించారు.

వారికి అండగా..

టువంటి సమయంలో ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల పాలు, మజ్జిగా పంపిణీ చేశారు. ఒక నెల రోజుల పాటు నార్త్ జోన్ పరిధిలో పనిచేస్తున్న వెయ్యిమంది సిబ్బందికి వీటిని అందించారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోని ట్రాన్స్‌జండర్స్‌కు నిత్యావసర సరకులు అందించారు. మిగిలిన వారు కూడా సాయం చేయాలని కోరారు.

ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకుని..

ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు సాయం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అక్కడి పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇది కాకుండా రోజూ ఉచితంగా కూరగాయలు సరఫరా చేస్తున్నారట.

కోలీవుడ్‌ నటులూ తమవంతు సాయం

కోలీవుడ్‌ సినీ ప్రముఖులు సైతం కార్మికుల కోసం విరాళాలు అందించారు. అంతేకాదు ప్రధాని, ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. అజిత్‌ రూ.50 లక్షలు పీఎం-కేర్స్‌కు, రూ.50 లక్షలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి, రూ.25 లక్షలు ‘ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’కు విరాళంగా అందించారు. కరోనాపై పోరుకు విజయ్‌ రూ.1.30 కోట్లు విరాళం ప్రకటించారు.

జనీకాంత్‌ నడిగర్‌ సంఘంలోని సభ్యులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. 1000 మందికి వీటిని అందించారు. ‘ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా’కు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. కమల్‌ హాసన్‌ 40 మంది జర్నలిస్టులకు రూ.15 వేలు (మొత్తం రూ.6 లక్షలు) చొప్పున సాయం చేశారు. నటుడు ఉదయనిధి స్టాలిన్‌ 60 మంది పేద జర్నలిస్టులకు రూ.3 వేలు అందించారు. వీళ్లు మాత్రమే కాకుండా కోలీవుడ్‌లో‌ పలువురు తారలు తమవంతు సాయం చేశారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని