వెండితెరపైనే కాదు లాక్‌డౌన్‌లోనూ వీళ్లు స్టార్సే..!

భారీ సెట్స్‌, సుందరమైన లోకేషన్స్‌లో ష్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అంటూ డైరెక్టర్‌ ఇచ్చే కమాండ్స్‌కు అనుగుణంగా పాత్రలోకి ఒదిగిపోయి నటీనటులు మెప్పిస్తుంటారు. అలా ఎంతోమంది వెండితెర, బుల్లితెర ..

Published : 30 May 2020 09:15 IST

వీడియోలతో సెలబ్రిటీలు.. వ్యూస్‌తో నెటిజన్లు సందడి

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ సెట్స్‌, సుందరమైన లోకేషన్స్‌లో స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. అంటూ డైరెక్టర్‌ ఇచ్చే కమాండ్స్‌కు అనుగుణంగా పాత్రలోకి ఒదిగిపోయి నటీనటులు మెప్పిస్తుంటారు. అలా ఎంతోమంది వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే అనుకోని విధంగా ఈ ఏడాది పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడింది. దీంతో సినీ, టీవీ ఆర్టిస్ట్‌లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఉన్నప్పటికీ పలువురు సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు రూపొందించి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించారు. ‘స్టే హోమ్‌ స్టే సేఫ్‌’ అనే నినాదంతో కొంతమంది తారలు షార్ట్ ఫిల్మ్స్‌తో మెప్పిస్తే.. మరికొంతమంది ఫన్నీ వీడియోలతో ఆకట్టుకున్నారు. అలా వీడియోలతో సెలబ్రిటీలు.. వ్యూస్‌తో నెటిజన్లు నెట్టింట్లో తెగ సందడి చేశారు. లాక్‌డౌన్‌లో నెట్టింట్లో మెప్పించిన సెలబ్రిటీలపై ఓ లుక్కేయండి..

మేమంతా ఒకే ‘ఫ్యామిలీ’

భారత చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటులుగా పేరు పొందిన అమితాబ్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, చిరంజీవి కలిసి నటించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘ఫ్యామిలీ’. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజువారీ కార్మికుల కోసం ఫండ్‌రైజ్‌ చేసేందుకు దీనిని రూపొందించారు. ప్రాంతం ఏదైనా సరే సినీ పరిశ్రమ అంతా ఒక్కటే అని మరోసారి ఈ లఘు చిత్రంతో నిరూపించారు. ఈ వీడియోని 24 లక్షల మంది వీక్షించారు.

‘స్టే హోమ్‌’లో 34 మంది

బుల్లితెర ప్రేక్షకులను ధారావాహికలతో మెప్పించే తారలందరూ ‘స్టే హోమ్‌’ అన్నారు. అలా 32 మంది బుల్లితెర తారలు ‘స్టే హోమ్‌’ షార్ట్‌ఫిల్మ్‌తో ప్రేక్షకులకు మంచి మెస్సేజ్‌ ఇచ్చారు. వీరి కష్టానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తోడయ్యారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘పుట్టడానికి తొమ్మిది నెలలు ఓపిక పట్టావ్‌.. బతకడానికి కొన్నిరోజులు ఓపిక పట్టలేవా’ అంటూ ఎస్పీబీ ఆలోచింపజేశారు.

‘ఏమాయ చేసావె’ మేజిక్‌ రీక్రియేట్‌

ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీగా గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఏమాయ చేసావె’. ‘విన్నైతాండి వరువాయ’ పేరుతో తమిళ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలో శింబు, త్రిష జంటగా మెప్పించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల సినీ పరిశ్రమ ఏవిధంగా ఇబ్బంది పడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల గౌతమ్‌ మేనన్‌ రూపొందించిన లఘుచిత్రం ‘కార్తీక్ డయల్ సేతా యెన్’. ఇందులో త్రిష, శింబు నటన చూసి ప్రేక్షకులు వావ్ అన్నారు. అలా ఈ షార్ట్‌ఫిల్మ్‌ 68 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

‘రైటర్‌’గా పాయల్‌

‘ఆర్‌ఎక్స్‌100’ చిత్రంతో మెప్పించిన పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా నటించిన షార్ట్‌ఫిల్మ్‌ ‘ఏ రైటర్‌’. 24 గంటల్లోనే రూపొందించిన ఈ ఫిల్మ్‌ను పాయల్‌ బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్‌ ధింగ్రా డైరెక్ట్‌ చేశారు. గృహహింసను ప్రధానంగా చూపిస్తూ తెరకెక్కిన ఈ వీడియోను క్వారంటైన్‌ స్పెషల్‌ అని పేర్కొంటూ విడుదల చేశారు. దాదాపు 48 వేల మంది వీక్షించారు.

సుమక్క ‘సూపర్‌ 4’

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్‌ సుమ. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబపోషణ విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు ఆమె ఇటీవల పలు ఫన్నీ గేమ్‌ షోలను నిర్వహించారు. బుల్లితెర యాంకర్స్‌ రవి, అనసూయ, ప్రదీప్‌, రష్మీలతో ఆమె చేసిన ‘సూపర్‌ 4’, శ్రీముఖి, అవినాష్‌తో రూపొందించిన ‘సూపర్ 2’ నెటిజన్లను ఎంతగానో మెప్పించాయి. ‘సూపర్‌ 4’ వీడియోకి వచ్చిన మొత్తాన్ని సాయం కోరేవారికి ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ వీడియోను ఇప్పటివరకూ 6 లక్షల మంది చూశారు.

శ్రీముఖి ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

బుల్లితెర రాములమ్మగా పేరుపొందిన యాంకర్‌ శ్రీముఖి లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటూ బోర్‌ఫీల్‌ అవుతున్న ప్రేక్షకుల కోసం పలు వీడియోలను రూపొందించారు. అవినాష్‌, విష్ణుప్రియతో ఆమె రూపొందించిన ‘బతుకు బలైపోయిన బండి’ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పటివరకూ 13 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. దీనితోపాటు ‘మీలో ఎవరికి బోర్‌ కొడుతుంది?’, ‘ఒక్కఛాన్స్‌’ వీడియోలతో ఆమె మెప్పించారు.

రవి ‘దాగుడుమూతలు’

షూటింగ్స్‌ నుంచి ఖాళీ దొరకడంతో యాంకర్‌ రవి ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. తన కుమార్తె వియాతో కలిసి ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆడారు. ఈ ఆటలో అనసూయ, రాహుల్‌ సిప్లింగజ్‌, అలీ రెజా కూడా భాగమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రవి నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉండి రూపొందించారు. ‘స్టే హోమ్‌ స్టే సేఫ్‌’ నినాదంతో అలరించిన ఈ వీడియోను ఇప్పటివరకూ 6లక్షల మంది వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని