Tollywood: ఇండియన్‌ సినిమాపై ప్రశాంత్‌నీల్‌ మల్టీవర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారా?

‘కేజీయఫ్‌2’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా ‘సలార్‌’ తెరకెక్కిస్తున్నారు.

Published : 22 May 2022 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌2’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా ‘సలార్‌’ తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల తారక్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో సినీ  పరిశ్రమలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్‌ నీల్‌ తీసే సినిమాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లు చెబుతున్నారు.  అంటే ఈ సినిమాలన్నీ మల్టీవర్స్‌ సిరీస్‌లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేజీయఫ్‌, సలార్‌, ఎన్టీఆర్‌ 31 సినిమాల థీమ్‌ డార్క్‌ గ్రే కలర్‌లో ఉన్నాయి. హీరోలందరూ రఫ్‌లుక్‌లోనే కనిపిస్తున్నారు. కేజీయఫ్‌ గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యం అయితే, సలార్‌ కోల్‌ మైనింగ్‌ అని టాక్‌. మరి ఎన్టీఆర్‌ మూవీ నేపథ్యం ఏంటో తెలియదు.

ఇంతేకాదు, మరో విషయంలోనూ ఈ మూడు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయని అంటున్నారు. ‘కేజీయఫ్‌2’లో ఈశ్వరీరావు కుమారుడి పేరు ‘ఫర్మాన్‌’. రాఖీభాయ్‌ దగ్గర పనిచేస్తూ అధీర చేతికి చిక్కుతాడు. అయితే, అతడిని చంపేశారా? లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. ఈ క్రమంలో ‘ఫర్మాన్‌’ మెడలో ఉన్న లాకెట్‌ ‘సలార్‌’లో ప్రభాస్‌ మెడలో ఉన్న లాకెట్‌ ఒకేలా ఉన్నాయి. మరి ఫర్మాన్‌ బతికే ఉన్నాడా? సలార్‌లో ప్రభాస్‌ పాత్ర అదేనా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. మరోవైపు ‘సలార్‌’లో జగపతిబాబు రాజమన్నార్‌ అనే విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. గుబురు గడ్డం, కోరమీసంతో మాస్‌ లుక్‌లో జగపతిబాబు కనిపించారు. తాజాగా ఎన్టీఆర్‌ 31 ప్రీలుక్‌లో ఎన్టీఆర్‌ అచ్చం అలాగే ఉన్నారు.  అసలు ఈ మూడు సినిమాలకూ మధ్య సంబంధం ఉందా? లేదా? ‘కేజీయఫ్‌3’ ఉంటుందా? ఉంటే ఆ కథ ఎలా నడుస్తుంది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని