Skater girl: సినిమా కోసం స్కేటింగ్‌ పార్క్

ఓ వైపు సినిమా తీస్తూనే అక్కడి చిన్నారుల జీవితాల్లో  మార్పు తెచ్చిన స్ఫూర్తిమంతమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

Published : 15 Jun 2021 10:26 IST

చిన్నారులకూ ఉపయోగపడాలని శాశ్వతంగా నిర్మించిన చిత్ర బృందం

నిజ జీవితాల్లోంచి స్ఫూర్తి పొంది అనేక కథలు వెండితెరపై సందడి చేస్తాయి. అయితే ఓ వైపు సినిమా తీస్తూనే అక్కడి చిన్నారుల జీవితాల్లో  మార్పు తెచ్చిన స్ఫూర్తిమంతమైన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ‘స్కేటర్‌ గర్ల్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 11న విడుదలైన సినిమా. మంజరి మకిజన్య్‌ ఆ చిత్రానికి దర్శక-నిర్మాత.  రాజస్థాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో స్కేటింగ్‌ క్రీడలో రాణించాలని కలలు గనే పదహారేళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాకోసం ఉదయ్‌పుర్‌కి సమీపంలోని ఖేమ్‌పుర్‌ గ్రామంలో భారీ స్కేటింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. అంతేకాదు క్రీడపై ఆసక్తి కలిగిన చిన్నారుల కోసం ఓ స్కేటింగ్‌ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు ఆ చిత్ర దర్శక-నిర్మాత మంజరి మకిజన్య్‌.

సినిమాకు మించిన ప్రాజెక్ట్‌

భారత్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న క్రీడ స్కేటింగ్‌. మన దేశంలోని  మధ్యప్రదేశ్‌, ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో చాలా మంది స్కేటింగ్‌ క్రీడాకారులు, క్రీడా సంఘాలున్నాయి. అయితే ఆ క్రీడ గురించి ఏమాత్రం పరిచయం లేని ఓ మారుమూల ప్రాంతంలో సినిమాను తీయాలనుకున్నారు దర్శకురాలు మంజరి. అందుకు రాజస్థాన్‌లోని ఖేమ్‌పుర్‌ అనే మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నారు.  ఆ ప్రాంతంలోనే ఓ స్కేటింగ్ పార్క్‌ను నిర్మించేందుకు నిధులను సేకరించారు. సినిమా తర్వాత కూడా అక్కడ పిల్లలు శిక్షణ పొందాలనే లక్ష్యంతో అన్ని హంగులతో 14,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘డిసెర్ట్‌ డాల్ఫిన్‌ స్కేట్‌ పార్క్‌’ను నిర్మించారు. సినిమాకు మించిన జీవిత కాల ప్రాజెక్ట్‌గా దీన్ని భావించారు. అందుకే క్రీడా పార్క్‌ను అలా నిర్మించి వదిలేయకుండా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి వాలంటీర్ల సాయంతో శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టింది చిత్ర బృందం. 

మొదట్లో భయపడ్డారు

‘స్కేటర్‌ గర్ల్‌’ సినిమాలోలాగే ఖేమ్‌పుర్‌ వాసులు కూడా మొదట్లో దీన్నొక వింత క్రీడగా చూసేవారు. పిల్లలు గాయపడతారనే భయంతో వారికి స్కేటింగ్‌పై భయం, అయిష్టత ఉండేది.  అయితే పార్క్ అందుబాటులోకి వచ్చాక పిల్లలు తమను తాము నిరూపించుకోడానికి, ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడుతుందని గుర్తించి శిక్షణకు పంపించడం మొదలుపెట్టారు. అయితే అక్కడ ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. మగపిల్లలతో పోల్చితే శిక్షణ తీసుకుంటున్న ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. తల్లిదండ్రులు అమ్మాయిలను పంపేందుకు ఇంకా వెనకాడుతున్నారు. స్కేటర్‌ గర్ల్‌ సినిమా చూశాక ఖేమ్‌పుర్‌ వాసుల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకురాలు.

సాంబా కూతురు.. హాలీవుడ్‌లోనూ హవా.

ఈ సినిమా దర్శక-నిర్మాత ఎవరో కాదు. హిందీ ‘షోలే’ సినిమాలో సాంబాగా నటించిన మెక్‌ మోహన్‌ కుమార్తెనే ఈ మంజరి. ముంబయిలో ఉన్నప్పుడు స్నేహితులంతా ‘సాంబా కూతుర’నే పిలిచేవారు.  లాస్‌ఏంజెల్స్‌లో నివాసముంటూ ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. బాలీవుడ్‌లో ‘వేకప్‌ సిడ్‌’, ‘సెవన్‌ ఖూన్‌ మాఫ్‌’ చిత్రాలకు సహాయ దర్శకురాలిగా చేశారు. హాలీవుడ్‌లో  ‘వండర్‌ వుమన్‌’, ‘డంక్రిక్‌’, ‘ది డార్క్‌నైట్‌ రైసెస్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి భారీ చిత్రాలకు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు.  లఘు చిత్రాలను తెరకెక్కించి అవార్డులు గెలుచుకున్నారు. ఇండియాలో స్కేటింగ్‌ క్రీడపై తెరకెక్కిన తొలి చిత్రం ‘స్కేటింగ్‌ గర్ల్‌’ కావడం గమనార్హం. ఈ సినిమా కోసం విస్తృతమైన పరిశోధన చేశారు.  వేల మంది చిన్నారులను పరిశీలించి కొందరిని సినిమా కోసం ఎంచుకున్నారు. వారందరికి కొన్నినెలల పాటు స్కేటింగ్‌లో శిక్షణనిచ్చారు. అంతేకాదు ఈ సినిమా కోసం అలనాటి తార వహీదా రెహమాన్‌ను ఓ కీలకపాత్ర కోసం ఒప్పించారు.  ప్రస్తుతం ‘స్పిన్’‌, ‘స్కేట్‌ బస్తీ’ ప్రాజెక్టులను చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని