ఆ మాట నేను అనలేదు: ఇళయరాజా

ప్రసాద్‌ స్టూడియోకు, తనకు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వివాదం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగానూ స్పందించకపోవడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. తనకు లభించిన జాతీయ, పలు రాష్ట్ర అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారంటూ...

Updated : 20 Jan 2021 16:57 IST

వరుస కథనాలపై క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్‌ మ్యాస్ట్రో

చెన్నై: ప్రసాద్‌ స్టూడియోకు, తనకు మధ్య గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వివాదం పట్ల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగానూ స్పందించకపోవడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. తనకు లభించిన జాతీయ, రాష్ట్ర అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ఈ మేరకు ఇళయరాజా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘ఎన్నో సంవత్సరాలుగా నేను పొందిన అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నానంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తాజాగా నా దృష్టికి వచ్చింది. ఆ వార్తలు ఎలా పుట్టాయో నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి’ అని తెలియజేశారు.

చెన్నైలోని ప్రసాద్‌ స్టూడియోస్‌ యాజమాన్యానికి, ఇళయరాజాకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టూడియో వ్యవస్థాపకుడు ఎల్వీ ప్రసాద్‌.. గతంలో స్టూడియోలోని రికార్డింగ్‌ థియేటర్‌ను వాడుకోమని తనకి మాట ఇచ్చారని.. కానీ ప్రస్తుతమున్న యాజమాన్యం దానికి అంగీకారం తెలపడంలేదని.. స్టూడియోలోకి తనని ప్రవేశించనివ్వడం లేదని పేర్కొంటూ ఇళయరాజా కొన్ని నెలల క్రితం కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా తనని మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన ప్రస్తుత యాజమాన్యం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకూ కోర్టు సూచించడం.. అనంతరం ఇటీవల ఇళయరాజా స్టూడియోని ఖాళీ చేయడం కూడా జరిగింది.

ఇదీ చదవండి

ఆ రోజు రాత్రి నిద్రపోలేదు: గోపీచంద్‌ మలినేని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని