Updated : 20/09/2021 20:21 IST

Love story: కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది..కానీ దాని గురించి పట్టించుకోం..

ఫీల్‌గుడ్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌పై ప్రత్యేక ముద్రవేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్‌’, ‘ఫిదా’ ఇలా ఆయన సినిమాలన్నీ ప్రత్యేకమైన శైలిలో కొనసాగుతాయి.  మరోసారి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య తొలిసారి నటించిన ‘లవ్‌స్టోరి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శేఖర్‌ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

‘లవ్‌స్టోరి’ కూడా నా గత చిత్రాల్లాగే ఫీల్‌గుడ్‌ మూవీ. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండే మంచి ప్రేమకథతోపాటు సమాజంలోని ఓ ప్రధాన సమస్యను చూపించాం. అందుకే నా మిగతా చిత్రాలతో పోలిస్తే ఇది మరో స్థాయిలో ఉండే సినిమా. ఇందులో రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. నాగచైతన్య అణగారిన వర్గం నుంచి వచ్చిన యువకుడి పాత్రలో నటించాడు. సమాజంలో ఉండే కుల సమస్యతో పాటు స్త్రీ పట్ల ఉండే వివక్షను తెరపై చూపించే ప్రయత్నం చేశాను. ‘లీడర్‌’లో అవినీతి గురించే ఎక్కువ చర్చించాం. అంటరానితనం మీద అందులో కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ సినిమా నుంచే కులవివక్ష మీద ఏదైనా తీయాలనే ఆలోచన మొదలైంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఇప్పుడు ‘లవ్‌స్టోరి’కి తగిన కథ కుదిరింది. సమాజంలో కుల వివక్ష తప్పకుండా ఉంది. లేదనడం సరికాదు.  అవి మన దృష్టికి రావు. ప్రస్తుత సమాజంలో వెతుక్కుంటే ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. సినిమాలు, మీడియా ద్వారా వాటిని చూపించాల్సిన ఆవశ్యకత ఉంది.  ఈ సమస్యను సంపూర్ణంగా చూపించానని చెప్పలేను. కానీ, సాధ్యమైనంత వరకూ దాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేశాను. వాస్తవానికి కుల వివక్ష చాలా ఎక్కువగా ఉంది. మనం దాని గురించి మాట్లాడుకోం, స్పందించే ప్రయత్నం చేయం.

ఒత్తిడిగానే ఉంది

‘లవ్‌స్టోరి’ షూటింగ్‌ 30 రోజుల్లో పూర్తవుతుందనగా కొవిడ్‌ వచ్చింది. సంవత్సరం తర్వాత చిత్ర యూనిట్‌ అందరికీ బీమాలు చేయించి, పీపీఈ సూట్లు ఇప్పించి కొవిడ్‌ నిబంధనలతో షూటింగ్‌ మళ్లీ మొదలుపెట్టాం. మూడింతలు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. అంతలోనే మళ్లీ సెకండ్‌ వేవ్‌ దెబ్బ పడింది. వేరే నిర్మాతలైతే ఓటీటీకి వెళ్లేవారే. మా నిర్మాత నారాయణదాస్‌ మాత్రం ఏదీ ఏమైనా థియేటర్లలలోనే విడుదల చేస్తామన్నారు. అది మాకు గొప్ప బలాన్నిచ్చింది. ఈ ప్రక్రియలో ఎన్నో అడ్డంకులను, లెక్కలను అధిగమిస్తూ చివరకు 24న వస్తున్నాం.  వారం నుంచి  చిత్రపరిశ్రమ కూడా మా సినిమా కోసం ఎదురుచూస్తోంది.  మళ్లీ థియేటర్లు పుంజుకుంటాయని అంతా ఆశాభావంగా ఉన్నారు. నాకు ఇది ఒక రకంగా ఒత్తిడే. కథాంశం పరంగా అందరినీ మెప్పించాలి. కరోనాను అధిగమించి మా సినిమా ఆడాలి.

చైతూ చాలా కష్టపడ్డాడు

తెలంగాణ యాసను పట్టుకునేందుకు నాగచైతన్యతో పాటు, మా టీమంతా కష్టపడ్డాం.  షూటింగ్, డబ్బింగ్‌ సమయంలో ప్రతి పదాన్ని చెప్పించి మా శక్తిమేర ప్రయత్నం చేశాం.  గత చిత్రాలకు భిన్నమైన మ్యానరిజం,లుక్‌లో కనిపిస్తాడు. మొదటి నుంచి డ్యాన్స్‌లో కష్టపడాలని చైతూ చెబుతుండేవాడు. శేఖర్‌, అనీ ఇద్దరూ మంచి శిక్షణనిచ్చారు. ‘లవ్‌స్టోరి’ కోసం హీరో చైతూ చాలా కష్టపడ్డారు. మమ్మల్ని నమ్మి వీలైనన్ని ఎక్కువ డేట్లు ఇచ్చి మాతో ప్రయాణం చేశాడు. మీరు కచ్చితంగా కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి నటి. ‘ఫిదా’లో చేసింది కాబట్టి తనెలా నటిస్తుందో నాకు తెలుసు. ‘ఫిదా’లోని భానుమతికి, ‘లవ్‌స్టోరి’లో ఆమె పోషించిన పాత్రకు చాలా తేడా ఉంటుంది. ఇందులో మరింత పరిణతి ఉన్న పాత్ర ఆమెది. చాలా కష్టపడి చేసింది. ఆమెను మరింత  కొత్తగా చూపించేందుకు కష్టపడ్డాం.  చైతూ తల్లిగా ఈశ్వరీరావు అద్భుతంగా నటించారు. తల్లీకొడుకులుగా వాళ్లిద్దరికీ చాలా బాగా కుదిరింది. రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌, దేవయాని, ఆనంద చక్రపాణి అందరూ బాగా నటించారు. నా ఉద్దేశంలో మా సినిమాకు రిపీట్‌ ఆడియన్స్‌ ఎక్కువవుంటారు.  మళ్లీ మళ్లీ చూస్తారనే నమ్మకముంది.

కళ్లలో నీళ్లు తిరిగాయి

అమిర్‌ఖాన్‌కు ట్రైలర్‌ పంపించాం. ఆయనకు తెగ నచ్చింది.  ప్రీ రిలీజ్‌ వేడుక ఉందని చెప్పగానే ఆయనే వస్తానన్నారు. ఎప్పటికైనే అమిర్‌ఖాన్‌కు కథ చెప్పి ఒప్పిస్తాననే నమ్మకం చాలా రోజుల నుంచి ఉండేది. కానీ ప్రస్తుతానికి నేను తెలుగు సినిమాలకే పరిమితమయ్యాను. ఆయన కోసం ప్రత్యేకంగా  సినిమా చూపించమన్నారు.  మెగాస్టార్‌ చిరంజీవి గారు ‘లవ్‌స్టోరి’ని సొంత సినిమాలా భావించారు. ఆయన్ను చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. వీరిద్దరి కృషితో మా సినిమా మరో స్థాయికి వెళ్లింది. నా సినిమాల నిడివి ఎక్కువగానే ఉంటుంది.  పాత్రలను బాగా ప్రేమించి రాస్తాను. వాటిని ఇంకా ఎక్కువ చెప్పాలనే తాపత్రయముంటుంది. మిట్టపల్లి సురేందర్‌ రాసిన పాటలో హైదరాబాద్‌లోని చారిత్రక చిహ్నాలను చూపించాం. భాగమతి కోసం మహమ్మద్‌ కులీకుతుబ్‌షా పురానాపూల్‌ను కట్టించారు. ప్రేమకోసం వంతెన కట్టి దానికి పురానాపూల్‌ అని పేరు పెట్టారు. అలాంటి చరిత్ర మనది. ఏ ఫిల్మ్ మేకర్‌ అయినా చరిత్రలో నిలిచిపోవాలనే సినిమాలు తీస్తారు. ప్రతి సన్నివేశం, పాటను ఇంకెవరు తీయలేరు అన్నట్టుగానే ప్రయత్నిస్తారు. ‘లవ్‌స్టోరి’ని పదేళ్ల తర్వాత చూసిన గర్వంగా అనిపించాలి.  చరిత్రలో నిలిచిపోతుందని చెప్పలేను. కానీ,  అలా నిలవాలనే ఆశ మాత్రం ఉంది.  ‘ప్రేమ్‌ నగర్‌’తో పోల్చడం సంతోషమే. ‘లవ్‌స్టోరి’ ఆ సినిమా స్థాయిలో  30 శాతానికి చేరినా చాలు.  

పరిష్కారాలు చూపలేదు

చిన్న ఊళ్లలో నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చే వారి కథను నిజాయతీగా తెరపై చూపించే ప్రయత్నం చేశాను. సినిమాలు చూసి మార్పు వస్తుందనేది మన చేతుల్లో ఉండదు. మనం కూడా అలా కావచ్చు అనే ఆలోచనను కలిగించగలిగితే నా జన్మ ధన్యమైనట్టే. అమ్మాయిలు కూడా ఇది మా కథ అని స్ఫూర్తి పొందితే మేం విజయం సాధించినట్లే.  నాకు తెలిసింది, నాకు వచ్చింది  నిజాయితీగా చెప్పే ప్రయత్నం మాత్రం చేశాను.  వేల సంవత్సరాల నుంచి ఈ కులసమస్య ఉంది. పరిష్కారాలు ఎవరు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. దానిపై మనం ప్రశ్న కూడా వేసుకోం. నిర్భయ తర్వాత ఎన్ని ఘటనలు జరగలేదు? వీటికి అలవాటు పడుతున్నామనే భయం పట్టుకుంది.  అవి మన జీవన విధానమైపోయింది. ఒకటో తరగతి పుస్తకం మొదటి పేజీలోనే మనమంతా ఒకటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఎన్ని ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకెంత సాహిత్యం కావాలి?

ధనుష్‌తో వచ్చే ఏడాది

తదుపరి చిత్రం ధనుష్‌తో చేస్తున్నాను. అది ప్రేమకథ మాత్రం కాదు. ఒక థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. నా కథలు మిగతా భాషల్లోనూ వర్కౌట్‌ అవుతాయని నమ్ముతాను. హిందీలోనూ ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అందుకే తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు సినిమాను అందించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. వచ్చే ఏడాది ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. ‘లీడర్‌’ సీక్వెల్‌ తప్పకుండా చేస్తా. అవే పాత్రలుంటాయి. కచ్చితంగా రానాతోనే చేస్తాను.  ‘లీడర్‌’ కథకు అక్కడే ముగింపు పడింది. కథాపరంగా మాత్రం అది సీక్వెల్‌ కాదు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని