ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని

కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా... ప్రేమ అన్నీ గెలుస్తుంది. ఎదురుచూపులు, ఎడబాట్లు భరిస్తుంది. లక్ష్యం చేరే క్రమంలో ప్రేయసీ, ప్రియులకు అండగా నిలుస్తుంది. అలాంటి అసలు సిసలు ప్రేమను అక్షరాల్లో నింపి... సంగీతాన్ని జతచేస్తే...

Published : 03 Mar 2021 19:32 IST

కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా... ప్రేమ అన్నీ గెలుస్తుంది. ఎదురుచూపులు, ఎడబాట్లు భరిస్తుంది. లక్ష్యం చేరే క్రమంలో ప్రేయసీ, ప్రియులకు అండగా నిలుస్తుంది. అలాంటి అసలు సిసలు ప్రేమను అక్షరాల్లో నింపి... సంగీతాన్ని జతచేస్తే... ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘నీ చిత్రం చూసి...’  పాటలా పల్లవిస్తుంది. శేఖర్‌ కమ్ముల  దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య , సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌ స్టోరీ. ఈ సినిమా నుంచి ప్రేమికుల దినోత్సవం రోజున విడుదలైన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏఆర్‌ రెహమాన్‌ శిష్యుడు పవన్‌ సిహెచ్‌ సంగీతాన్ని  సమకూర్చిన ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యాన్ని సమకూర్చగా అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. దీని గురించి రచయిత సురేందర్‌ ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు...

అసలు నేను ఈ పాట రాస్తానని అనుకోలేదు. ఒక్కసారి శేఖర్‌ కమ్ములని చూసి మాట్లాడితే చాలనుకునేవాణ్ని. ఆయన దగ్గర ఉండే రచయిత్రి చైతన్య పింగిళి ఫోన్‌ చేసి నువ్వొక పాట రాయాలి అన్నారు. మొదట నేను నమ్మలేదు. పదే పదే ఫోన్‌ చేయడంతో పద్మారావునగర్‌లోని శేఖర్‌ కమ్ముల  ఆఫీసుకు వెళ్లా. ఆయన నేలపై కూర్చొని ఉన్నారు. నేనూ కిందే కూర్చున్నా. మామిడికాయ పచ్చడి, కందిపప్పు, చింతపులుసు, మజ్జిగ, పెరగన్నం పెట్టి ‘లవ్‌ స్టోరీ’ కథ చెబుతూ పాట రాయమన్నారు. సంగీత దర్శకుడు పవన్‌ ట్యూన్‌ వినిపించారు. అప్పటికప్పుడు పల్లవి, చరణం రాసి వినిపించా. బాగుందన్నారు. రెండో చరణం రాయడానికి కొంత సమయం అడిగా. అప్పుడే గొంతునొప్పి ఎక్కువైంది. ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడే బెడ్‌పై కూర్చొని మిగతా చరణం పూర్తి చేసి ఒకటే వర్షన్‌ పంపించాను. రిప్లై కోసం ఎదురుచూసేవాణ్ని. సమాధానం వచ్చేది కాదు. తీరా ఫిబ్రవరి 14న మీ పాట విడుదల చేస్తున్నామనేసరికి ఆశ్చర్యపోయా. ప్రేమికులిద్దరు దూరదూరంగా ఉండాల్సిన సందర్భంలో ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ పాడుకునే పాట ఇది. చిత్రం అంటే ముఖం. చిత్తం అంటే మనస్సు. చిత్తరువు అంటే ఆశ్చర్యం. ఈ మూడు పదాల్లో ఒక అమ్మాయి అబ్బాయిని తొలి సారిగా చూసినప్పుడు కలిగే భావనను వర్ణిస్తూ రాశా. నువ్వు మన లక్ష్యం కోసం అటు వైపు అడుగు వేస్తున్నావ్‌. మనిద్దరం దగ్గర అవడం కోసం నేను నీవైపు అడుగు వేస్తున్నా. వాళ్లు(పెద్దలు) ఒప్పుకొంటే తాళి కట్టడం కాదు. నేను ఎప్పుడో మానసికంగా నీదాన్ని అయిపోయా. ఆ ఏడడుగులు నడుస్తున్నప్పుడు దారిలో ఎదురయ్యే గందరగోళాలు మంగళవాయిద్యాలుగా, చుట్టూ వినిపించే అల్లర్లు మంత్రాలుగా భావించి నేను ఎప్పుడో నీతో ఏడడుగులు వేశానని ప్రియురాలు అనుకుంటుంది. చరణానికి వచ్చే సరికి ప్రియురాలి నుంచి దూరంగా వెళ్లిపోయిన ప్రియుడు... పెద్దలు పెట్టిన షరతులను నెగ్గి ఇచ్చిన మాట ప్రకారం ఒక్క క్షణం ముందైనా వచ్చి నిన్ను గెలుచుకుంటానంటాడు. ప్రియుడి వేదన తెలిసేలా... ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని రాశా. ఇరువురి ఎడబాటు కాలానికి పెద్దది కావచ్చు కానీ ప్రేమకు చిన్నదనే విషయాన్ని
చెబుతూ అందంగా అల్లాను.

శేఖర్‌ కమ్ముల పిలిచి పాట ఇచ్చారంటే మా ఇంట్లో వాళ్లే ఎవరూ నమ్మలేదు. ఆయనతో సెల్ఫీని చూశాక అంతా నమ్మారు. నేను ఎక్కువగా ప్రజా చైతన్య గీతాలు రాస్తుంటాను కాబట్టి అలాంటి పాటే ఏదో ఇచ్చారనుకున్నారట. నా పాట ఆమోదించినప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిందో ఈ పాట విడుదలయ్యాక నా చుట్టూ ఉన్నవాళ్లకు అంతే ఆశ్చర్యం కలిగింది. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను
కాబట్టి ఆ ప్రేమే నాతో ఈ ప్రేమపాట రాయించిందనుకుంటున్నా.

చిత్రం: లవ్‌ స్టోరి, నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకులు: శేఖర్‌ కమ్ముల, పాట: నీ చిత్రం చూసి, సంగీత దర్శకుడు: పవన్‌ సి.హెచ్‌, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్‌, గానం: అనురాగ్‌ కులకర్ణి. 

పల్లవి: నీ చిత్రం చూసి.. నా చిత్తం చెదిరి...

నే చిత్తరువైతిరయ్యో... ఓ ఓ ఓఓ

ఇంచు ఇంచులోన.. పొంచి ఉన్న ఈడు

నిన్నే ఎంచుకుందిరయ్యో...ఓ ఓ ఓఓ

నా ఇంటి ముందు... రోజు వేసే ముగ్గు

నీ గుండె మీదనే వేసుకుందు

నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో!

చరణం 1:
ఈ దారిలోని గందరగోళాలే... మంగళవాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో..

మన పెళ్లి మంత్రాలుగా
అటు వైపు నీవు.. నీ వైపు నేను

వేసేటి అడుగులే ఏడు అడుగులని

ఏడు జన్మలకి ఏకమై పోదామా... ఆ ఆ ఆ

ఎంత చిత్రం ప్రేమ.. వింత వీలునామ రాసింది మనకు ప్రేమా

నిన్ను నాలో దాచి... నన్ను నీలో విడిచి

వెళ్లి పొమ్మంటుంది ప్రేమా!

చరణం 2:

ఈ కాలం కన్న ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని

నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి.. నిను ఊరేగిస్తానని

ఆకాశమంత మన ప్రేమలోన..

ఏ చీకటైన క్షణకాలమంటు

నీ నుదుట తిలకమై... నిలిచిపోవాలని

ఎంత చిత్రం ప్రేమ... వింత విలునామా రాసింది

మనకు ప్రేమా... ఆ ఆ ఆఆ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని