Cinema news: పండగే పండగ.. సీజన్‌లో వరుస కట్టనున్న సినిమాలు

తెలుగు నాట కుర్రకారుకి పండగంటే సినిమా, సినిమా అంటే పండగే. పండగొస్తుందంటే చూడాల్సిన కొత్త సినిమాల జాబితా కూడా సిద్ధమై పోతుంది. కరోనావల్ల రెండేళ్లుగా థియేటర్ల దగ్గర పండగ కళే కనిపించలేదు. కొన్ని సినిమాలు పండగలకి విడుదలైనా...

Updated : 19 Oct 2021 06:39 IST

ఉత్సాహంలో తెలుగు చిత్రసీమ

తెలుగు నాట కుర్రకారుకి పండగంటే సినిమా, సినిమా అంటే పండగే. పండగొస్తుందంటే చూడాల్సిన కొత్త సినిమాల జాబితా కూడా సిద్ధమై పోతుంది. కరోనావల్ల రెండేళ్లుగా థియేటర్ల దగ్గర పండగ కళే కనిపించలేదు. కొన్ని సినిమాలు పండగలకి విడుదలైనా... భయం భయంగానే చూశారు ప్రేక్షకులు. కానీ ఈసారి వ్యాక్సిన్‌ రావడంతో థియేటర్లకి ధైర్యంగా వెళుతున్నారు. పరిశ్రమ కూడా సినిమాల్ని అంతే ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది. ప్రధానంగా అగ్ర తారల సినిమాలు పండగలపై దృష్టిపెట్టాయి. సినిమాలకి పెట్టిన భారీ పెట్టుబడులు రాబట్టుకోవడానికి పండగే కీలకం. అందుకే రానున్న దీపావళి, క్రిస్మస్‌, సంక్రాంతి పండగలకి కొత్త సినిమాలు వరుస కడుతున్నాయి.

దసరాకి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రతి సినిమా కూడా వాటి స్థాయిలో మంచి ప్రారంభ వసూళ్లనే సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులు పండగ పూట ఉత్సాహంగా థియేటర్లకి వస్తారన్న సంగతిని మరోమారు నిరూపించాయి ఈసారి దసరా సినిమాలు. రానున్న పండగల కోసం పరిశ్రమ మరింత జోష్‌తో సినిమాల్ని ముస్తాబు చేస్తోంది. దీపావళికి సినీ టపాసులు పేలనున్నాయి. కొత్త ఏడాది సంబరాలు ముందే మొదలెట్టేద్దాం అన్నట్టుగా క్రిస్మస్‌ సినిమాలు వరుస కడుతున్నాయి. సంక్రాంతి హంగామా అయితే జనవరి 7 నుంచే షురూ కాబోతోంది.  

వారం వారం

దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినీ సందడి ముందే మొదలైంది. తెలుగు ప్రేక్షకులు సినిమా అభిరుచిని ప్రదర్శిస్తూ కరోనా భయాలు కొనసాగుతున్న సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లకి వచ్చారు. దాంతో ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు వరుసగా విడుదలవుతూ వస్తున్నాయి. ప్రతీ వారం కొత్త సినిమా సందడి కనిపిస్తూనే ఉంది. అగ్ర తారల సినిమాల జోరు రానున్న పండగల్లో మరింత స్పష్టంగా కనిపించనుంది. దసరాకి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దసరా సినీ సరదాల్ని కొనసాగిస్తూ మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అక్టోబర్‌ 22న ‘నాట్యం’, ‘మధురవైన్స్‌’, ‘మిస్సింగ్‌’ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆ తర్వాత వారం ‘రొమాంటిక్‌‘, ‘వరుడు కావలెను’తోపాటు, ‘జై భజరంగి’ అనే అనువాద చిత్రం విడుదలవుతోంది.

దీపావళి... క్రిస్మస్‌ హంగామా

నవంబర్‌లో దీపావళి హంగామా మొదలవుతోంది. పండగ సందర్భంగా నవ్వించేందుకు మారుతి సినిమా ‘మంచి రోజులొచ్చాయి’ నవంబర్‌ 3న విడుదలవుతోంది. ఇక ‘పెద్దన్న’గా రజనీకాంత్‌ వస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం నవంబర్‌ 4న విడుదలవుతోంది. ‘ఎనిమీ’, ‘పుష్పకవిమానం’ తదితర సినిమాలు కూడా నవంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా కూడా తెలుగులో కీలకమైన సినిమాలు విడుదలవుతుంటాయి. అవి కొత్త ఏడాది ఆరంభంతోపాటు సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు మంచి వసూళ్లని సొంతం చేసుకుంటుంటాయి. అందుకే క్రిస్మస్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని సినిమాల్ని సిద్ధం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఈసారి ఆ హంగామాని తన ‘పుష్ప’ చిత్రంతో ముందే మొదలుపెడుతున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఆ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న విడుదలవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో నాలుగు దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ విడుదలవుతోంది. ఇక డిసెంబర్‌ 24న నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ విడుదలవుతుంది. తేదీ ఖరారు కాలేదు కానీ, బాలకృష్ణ ‘అఖండ’ కూడా విడుదల కోసం సిద్ధమవుతోంది.


‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో మొదలు

సుదీర్ఘంగా సాగే సినిమా సీజన్లలో సంక్రాంతి ఒకటి. పండగ రోజుల్లోనే ఎక్కువగా సినిమాలు విడుదలైనా వాటి విజృంభణ నెలంతా కొనసాగుతుంటుంది. అయితే ఈసారి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ వల్ల సంక్రాంతి సీజన్‌ చాలా ముందుగానే మొదలవుతోంది. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ జనవరి 7నే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదవలవుతోంది. ఈ సినిమా ఎప్పుడొచ్చినా తెలుగు ప్రేక్షకులకు పండగే. అంతగా ఆత్రుతని కలిగిస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఎప్పట్లాగే సంక్రాంతి బెర్తుల్ని ముందే ఖరారు చేసుకున్న సినిమాల సంగతి సరే సరి. పవన్‌కల్యాణ్‌ - రానా కథానాయకులుగా నటిస్తున్న ‘భీమ్లానాయక్‌’ జనవరి 12న, మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ 13న, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ 14న విడుదల తేదీల్ని పక్కా చేశాయి. అగ్ర కథానాయకుల్లో సగభాగం సంక్రాంతి సీజన్లలోనే సందడి చేస్తుండడంతో వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని సినీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. మొత్తంగా టాలీవుడ్‌లో పండగ కళ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని