Dil Raju: 2 వారాలకో సినిమా విడుదల చేస్తే ఏ సమస్యా ఉండదు: దిల్‌రాజు

ఈ సంక్రాంతి సీజన్‌లో విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సహా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. దీంతో దాదాపు అన్ని చిత్రాల విడుదల విషయంలో భారీ మార్పులు

Published : 27 Jan 2022 23:30 IST

హైదరాబాద్‌: ఈ సంక్రాంతి సీజన్‌లో విడుదల కావాల్సిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సహా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీల్లో అవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆ సినిమాలన్నీ వేసవి సీజన్‌పై కన్నేశాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28కి విడుదల కానుంది. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అదే రోజు మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ‘భీమ్లా నాయక్‌’, ‘ఎఫ్‌ 3’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు కూడా వేసవి సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల విడుదలలో సమస్యలు తలెత్తుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని స్పష్టం చేశారు. తన ప్రణాళికను అమలు చేస్తే పెద్ద సినిమాలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరుసపెట్టి విడుదలవుతాయని చెప్పారు. 

‘‘సంక్రాంతి సీజన్‌ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదే వేసవి సీజన్‌ దాదాపు 50 రోజులు ఉంటుంది. ప్రతి రెండు వారాలకి ఒక సినిమాను విడుదల చేసినట్లయితే సమస్యలు తలెత్తే అవకాశమే లేదు. అలాగే, ఏ సినిమా కలెక్షన్లకూ గండి పడదు. కాబట్టి పెద్ద సినిమాల విడుదల తేదీలను మేం సులువుగా సర్దుబాటు చేయొచ్చు. దీన్ని టాలీవుడ్‌ టాప్‌ హీరోలంతా అర్థం చేసుకుంటారు’’అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆయన యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో సమావేశం ఏర్పాటు చేసి విడుదల తేదీల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. అదే నిజమైతే తెలుగు సినీ అభిమానులకు ఈ వేసవి సీజన్‌ కనుల విందుగా ఉండనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు