Puri Musings: ప్రేమలో పడతాం.. ఐ లవ్‌ యూ చెబుతాం.. కానీ అదిప్రేమ కాదు: పూరీ జగన్నాథ్‌

ప్రేమ అనేది నిజమైన ఫీలింగ్‌ కాదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. మనలో పుట్టే ప్రతి అనుభూతికి శరీరంలో జరిగే కెమికల్‌ రియాక్షన్సే కారణమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌’.....

Updated : 19 Jan 2022 16:49 IST

హైదరాబాద్‌: ప్రేమ అనేది నిజమైన ఫీలింగ్‌ కాదని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌. మనలో పుట్టే ప్రతి అనుభూతికి శరీరంలో జరిగే కెమికల్‌ రియాక్షన్సే కారణమని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ‘పూరీ మ్యూజింగ్స్‌’ వేదికగా ‘కెమికల్‌ రియాక్షన్స్‌’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఎలాంటి ఫీలింగ్ వచ్చినా సరే దేవుడ్ని మొక్కుతుంటామని.. ఇకపై అలా చేయవద్దని ఆయన అన్నారు.

‘‘సడెన్‌గా ఓ రోజు ప్రేమలో పడతాం. ప్రేమించడం మొదలుపెడతాం. ఐ లవ్‌ యూ చెబుతాం. విరహగీతాలు రాస్తాం. ఇంట్లో వాళ్లు అడ్డుపడతారు. చేతులు కోసుకుంటాం. గోడ దూకుతాం. ఇంట్లో నుంచి పారిపోతాం. చేసేది లేక అక్షింతలు వేసి అందరూ వెళ్లిపోతారు. మీ ఇద్దరూ మిగిలిపోతారు. అది క్లైమాక్స్‌ అనుకుంటాం. కాదు అది సీన్‌ నంబర్‌ వన్‌. ఆ తర్వాత మీ ఇద్దరి సరదా తీరిపోతుంది. మనలో పుట్టే ప్రేమ అనే ఫీలింగ్‌ నిజం కాదు. మన శరీరంలో జరిగే ఓ కెమికల్‌ రియాక్షన్‌. దానివల్ల మనలో యుఫోరియా కలుగుతుంది. దాన్నే మనం పవిత్రమైన ప్రేమ అనుకుంటాం. మనలో పుట్టే ప్రతి అనుభూతి కూడా కెమికల్స్‌, హార్మోన్ల వల్ల పుట్టినవే. ప్రేమ ఒక్కటే కాదు మనలో కలిగే ఎన్నో అనుభూతులకు కెమికల్‌ రియాక్షన్సే కారణం. మన మెదడు రిలీజ్‌ చేసే హార్మోన్ల వల్లే ఇవన్నీ కలుగుతాయి.’’

‘‘మన మెదడు సిరిటోరియన్ విడుదల చేస్తుంది. అది మనం నిద్రపోవడానికి, లేదా కుంగుబాటుకు కారణం అవుతుంది. అలాగే డోపమైన్. దీన్ని ప్రెజర్ కెమికల్ అని పిలుస్తారు. ఇక, మనలో పుట్టే ప్రేమ.. లైంగిక ఆకర్షణ కారణంగా పుట్టిందే. అసలిక్కడ గొడవెంటంటే.. మనకి ఏ ఫీలింగ్ వచ్చినా వెంటనే దేవుడికి మొక్కేస్తాం. ఒకవేళ సంతోషం వస్తే.. జీవితాంతం ఈ ఇలాగే ఉండాలి అని కోరుకుంటాం. బాధ వస్తే ఈ కష్టాలు వద్దు స్వామీ అంటాం. భయం వేస్తే ‘‘శ్రీ అంజనేయం..’’ అంటాం. ఏ ఫీలింగ్ వచ్చినా దేవుణ్ణి పిలిచేయడమేనా? మనలో కలిగే ప్రతీ ఫీలింగ్ ‘మాయ’ అని దేవుడికి తెలుసు కాబట్టే మన కోరికల్ని ఆయన సీరియస్‌గా తీసుకోడు. అందుకే ఊరికూరికే మొక్కకండి. ప్రతీ కెమికల్ రియాక్షన్‌కి వరాలు ఇచ్చుకుంటూ పోవడానికి ఆయన పిచ్చోడు కాదు.. దేవుడు’’ అని పూరీ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని