డాక్టర్‌గా యాక్టరై... ‘మిస్సమ్మ’ను తిరగరాసి

తెలుగు చలనచిత్ర చరిత్రలో 60 సంవత్సరాల సుదీర్ఘకాలం సినిమాల్లో నటించిన కళాకారులలో ప్రధముడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాతి స్థానం ప్రముఖ నటుడు రావి కొండలరావుదే. అంతేకాదు తన భార్య రాధాకుమారితో కలసి  సుమారు

Published : 29 Jul 2020 00:59 IST

రావి కొండలరావు నటనా ప్రస్థానం

తెలుగు చలనచిత్ర చరిత్రలో 60 సంవత్సరాల సుదీర్ఘకాలం సినిమాల్లో నటించిన కళాకారులలో ప్రధముడు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాతి స్థానం ప్రముఖ నటుడు రావి కొండలరావుదే. అంతేకాదు తన భార్య రాధాకుమారితో కలసి  సుమారు 100 సినిమాలలో భార్యాభర్తలుగా నటించిన ప్రపంచ రికార్డు కూడా వీరికే దక్కుతుంది. నటుడిగానే కాకుండా, రచయితగా, దర్శకుడిగా పరిశ్రమలో తనదైన ముద్రవేశారాయన. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన నటనా ప్రస్థానం మీ కోసం...

మద్రాసులో తొలి అడుగులు

ఒకసారి 1954లో ఆంధ్ర నాటక పరిషత్తు వారు హైదరాబాదులో నిర్వహించిన నాటకోత్సవాలకు న్యాయ నిర్ణేతగా సినీ రచయిత డి.వి.నరసరాజు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన ఆ ఉత్సవాల్లో శ్రీకాకుళం నుంచి నటరాజ కళాసమితి ప్రదర్మించిన ప్రఖ్య శ్రీరామమూర్తి నాటకం ‘కాళరాత్రి’లో జేవీ సోమయాజులు, జేవీ రమణమూర్తి, జోగారావుతో పాటు రావి కొండలరావు కూడా నటించారు. అప్పుడే వారికి నరసరాజుతో పరిచయమైంది. 1956లో మద్రాసు వెళ్లి ‘ఆనందవాణి’ పత్రికలో కొంతకాలం పనిచేశాక, వాళ్లు జీతాలు సరిగ్గా ఇవ్వకపోతుండడంతో నరసరాజు ద్వారా పొన్నలూరి బ్రదర్స్‌ సంస్థ వారి కథా విభాగంలో చేరారు. అంతకు ముందే కొండలరావుకి కేరళలో ఒక మలయాళ చిత్రానికి డబ్బింగు సంభాషణలు రాసిన అనుభవం ఉంది. పొన్నలూరు బ్రదర్స్‌ నిర్మాత వసంతకుమార రెడ్డి నిర్మించిన ‘శోభ’ సినిమాలో కమలాకర కామేశ్వరరావుకు సహాయకునిగా పనిచేస్తూ, అపద్ధర్మంగా ఒక అయోమయం డాక్టరు పాత్రను పోషించారు. తర్వాత ముద్దుకృష్ణ సహకారంతో కొన్ని సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు. అప్పుడే బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘పూజాఫలము’ చిత్రానికి సహాయకునిగా పనిచేసే అవకాశం దక్కింది. నిర్మాతలు లక్ష్మిరాజ్యం, శ్రీధరరావు నిర్మించిన ‘నర్తనశాల’లో కమలాకర కామేశ్వరరావుకు సహకార దర్శకునిగా పనిచేస్తూ, ఆ సినిమాకు ‘కామెడి ట్రాక్‌’ రాశారు. తర్వాత ‘కీలుబొమ్మలు’, ‘ప్రేమలో ప్రమాదం’, ‘ముగ్గురు వీరులు’ వంటి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు.

డాక్టరుగా యాక్టరై...

హాస్యరసం సున్నితమైంది. శ్రుతి మించిన హాస్యం అపహాస్యమౌతుంది. అందుకే కొండలరావు పాత్రల స్వభావాన్ని బట్టి డైలాగ్‌ మాడ్యులేషన్‌ మార్చుకునేవారు. ఆయన నటించిన పాత్రలు చిన్నవే అయినా ఎంతో సహజంగా వుండి ప్రేక్షకుల మనసును ఆకట్టుకునేవి. సంభాషణలకు మేనరిజం జోడించి చెప్పడం ఆయన ప్రత్యేక శైలి. ముళ్లపూడి వెంకటరమణ కథ, సంభాషణలు సమకూర్చిన ‘దాగుడుమూతలు’ (1964)లో కొండలరావు ధరించిన డాక్టరు పాత్ర బాగా క్లిక్‌ అయింది. గౌతమి పిక్చర్స్‌ వారు దాదామిరాసి దర్శకత్వంలో నిర్మించిన ‘నిర్దోషి’ (1967) సినిమాలో సంగీత ప్రియుడైన డాక్టర్‌ పాత్ర వేశారు. దీనికి స్ఫూర్తి మద్రాసులో తానెరిగిన ఓ డాక్టర్‌ మ్యానరిజమే. కూని రాగం తీస్తూ పలకరించే ఆ డాక్టర్‌ తీరును కొండలరావు నిర్మాత రామబ్రహ్మంకు చెప్పి ఒప్పించారు. ఆ పాత్ర వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ‘‘రామచిలుకనొకటి పెంచి, ప్రేమమీర మాటలాడే’’ అంటూ పాడుతూ అభినయిస్తే, అంతా మెచ్చుకున్నారు. అలాగే తాతినేని రామారావు దర్శకత్వలో ప్రసాద్‌ ఆర్ట్‌ పిక్చర్స్‌ వారు నిర్మించిన ‘బ్రహ్మచారి’ (1968) సినిమాలో కూడా కొండలరావు డాక్టరుగా నటించి మంచి మార్కులు కొట్టేశారు. ఆ సినిమాలో రావు సాహెబ్‌ పరంధామయ్య (నాగభూషణం) మనవణ్ణి రక్త పరీక్ష ద్వారా గుర్తించే డాక్టరు పాత్ర ధరించారు. కళ్లజోడు సవరించుకుంటూ ‘‘మీ అబ్బాయి రామకృష్ణ రక్తమున్నూ, ఆ బిడ్డ యొక్క రక్తమున్నూ, అనగా ఇద్దరి రక్తమున్నూ పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి చూడగా తేెలినదేమనగా.. నౌ కమింగ్‌ టు పాయింట్‌... ఒక్కటే! ఏమియూ సందేహము లేదు’’ అంటూ చెప్పే విధానం నవ్వులు పూయించింది.

సైలెన్స్‌... పదండి పోలీస్‌ స్టేషన్‌కి

నిర్మాత, దర్శకుడు పి.పుల్లయ్య తీసిన ‘ప్రేమించిచూడు’లో నాగేశ్వరరావు తండ్రిగా ఒక స్కూల్‌ మేష్టారు పాత్రలో కొండలరావు నటించారు. ఆ పాత్ర కోసం ముళ్లపూడి వెంకటరమణ సలహాపై పుల్లయ్య దగ్గరకు వెళ్లినప్పుడు 30 ఏళ్ల కుర్రాడైన కొండలరావును చూసి ఆయన తన సహజ ధోరణిలో ‘‘ఫస్ట్‌ గెటవుట్‌. నీకు బుద్ధిలేదా... ఆ రమణకి బుద్ధిలేదా.. లేకుంటే నాకు బుద్ధిలేదా.. నువ్వు నాగేశ్వరరావుకి తండ్రివా? అయామ్‌ నాట్‌ ఎ ఫూల్‌. ప్లీజ్‌ గో’’ అన్నారు. ఆ తర్వాత కొడవటిగంటి కుటుంబరావు, ప్రతిభాశాస్త్రి, ముళ్లపూడి వెంకటరమణ కలిసి పుల్లయ్యకు నచ్చజెప్పడంతో కొండలరావుకు ఆ వేషం దక్కింది. అందులో ఆయన పలికే ‘‘సైలెన్స్‌’’ అనే ఊత పదం అందరినీ అలరించింది. ఒక సీనులో గుమ్మడి, శాంతకుమారి గోడ మీద ఉన్న నాగేశ్వరరావు ఫొటో చూసి చుట్టరికాన్ని గురించి అడిగితే, ‘‘ఏవన్నారూ? సైలెన్స్‌... ఎవరయ్యా నువ్వు? ఎక్కడ చదివావు నువ్వు? ఎవరయ్యా నీకు చదువు చెప్పింది? మాట్లాడకు మరి! మా అబ్బాయిని పట్టుకుని వారికీ, వీరికి చుట్టరికమేముందని అంటావేం? ఇదేనా మర్యాద? భూపతా... ఆకాశపతా.. వాడు మా అబ్బాయి రంగడు. బియ్యే చదివాడు. నిక్షేపంగా ఉద్యోగం చేస్తున్నాడు. మావాడి ఫోటో చూసి వాడే వీడనుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. పదండి పోలీసు స్టేషనుకి మీ పని పట్టిస్తాను. కాల్‌ పోలీస్‌.. సైలెన్‌్్స.. అబద్దాలు మాకు చేతకావు. సత్యమునే పలుకవలెను’’ అంటూ కొండలరావు పలికే డైలాగులు ఇప్పటికీ నవ్విస్తూనే ఉంటాయి.

మహాప్రభో.. ఘనరాజసంబుతో వర్థిల్లు

ఎన్టీఆర్‌ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం నిర్వహించిన ‘వరకట్నం’ (1969) సినిమాలో కొండలరావు నటించడం తొలిసారి. రాజనాల వెంటవుండే భట్టుమూర్తి అనే పాత్ర అది. రాజనాల ‘‘సై సై జోడెడ్లా బండి.. షోకైన దొరల బండి’’ అని పాడు కుంటూ ఎడ్లబండిని నడుపుతుంటే చరణం పూర్తవగానే పొగడ్తలా ‘‘మహప్రభో’’ అంటూ తల ఊపుతూ వుంటారు కొండలరావు. ఈ పాత్ర కోసం రెండు పద్యాలు కూడా పెట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ సొంత సంస్థలో వరుసగా ఎనిమిది సినిమాల్లో కొండలరావు నటించడం జరిగింది.

మిస్సమ్మను తిరగరాసి...

విజయావారి ‘మిస్సమ్మ’ సినిమాలో పెళ్లికాని ఇద్దరు నిరుద్యోగ యువతీ యువకులు, ఉద్యోగ సంపాదన కొసం భార్యాభర్తలుగా నటిస్తూ చివరకు పెళ్లిచేసుకుంటారు. కొండలరావు ఈ నేపథ్యాన్ని తీసుకొని ఇద్దరు పెళ్లైన యువతీ యువకులు అనివార్యమైన పరిస్థితుల్లో అవివాహితులుగా చెప్పుకొని ఉద్యోగంలో చేరడం అనే పాయింట్‌తో కథ అల్లితే, దాన్ని బాపు, రమణలు ‘పెళ్లిపుస్తకం’ (1991)గా మలిచారు. సినిమాలో బాబాయి వేషంతో అందరి ప్రశంసలు పొందిన కొండలరావుకు ఉత్తమ కథారచయితగా నంది బహుమతి, ముళ్లపూడికి ఉత్తమ సంభాషణల రచయితగా నంది బహుమతి దక్కాయి.

చిన్న పాత్రలు... పెద్ద గుర్తింపు

ఒకవైపు ‘విజయచిత్ర’ సినిమా పత్రికకు సంపాదకునిగా వుంటూనే నటునిగా తనదైన ముద్ర వేసుకున్న కొండలరావు నటించిన సినిమాలు 600 దాకా వుంటాయి. చేసినవి చిన్న పాత్రలైనా అన్నీ గుర్తింపు తెచ్చుకున్నవే. ‘గూఢాచారి 116’లో ఫోటోగ్రాఫర్‌ పాత్ర, ‘పంతులమ్మ’ సినిమాలో గిరిజకు భార్యాలోలుడైన భర్తగా కనపడిన వాళ్లందరినీ ‘టైం ఎంతైంది’’ అనే పాత్ర; ‘ప్రేమకానుక’లో ఛాయాదేవికి, ‘ముహూర్తబలం’లో సూర్యకాంతానికి భార్యా విధేయుడైన భర్తగాను మూడు పాత్రల్లోను వైవిధ్యం కనపరుస్తూ అలరించారు కొండలరావు. ‘ఇద్దరు మొనగాళ్లు’ జానపద సినిమాలో కొండలరావుది పెద్ద వేషం. రాజుగారి తమ్ముడిగా అతని నటన అద్భుతంగా వుంటుంది. అలాగే మరో జానపద చిత్రం ‘మహాబలుడు’లో మాంత్రికునిగా రాణించారు. ‘ఆలీబాబా 40 దొంగలు’, ‘వీరాభిమన్యు’ సినిమాల్లో మంచి పాత్రలు కొండలరావుకు దక్కాయి. ‘వేములవాడ భీమకవి’ లో మేనమామగా, ‘నేనంటే నేనే’లో ఎస్టేట్‌ మేనేజరుగా, ‘వింతకాపురం’లో కృష్ణకు తండ్రిగా సీరియస్‌ పాత్రల్లో నటించి, తన నటనా సామర్ధ్యాన్ని నిరూపించారు.

అలాగే ‘పాపకోసం’లో బ్రాహ్మణుడిగా, ‘గాంధిపుట్టిన దేశం’లో కార్మికునిగా, ‘కులగౌరవం’లో రెండవ హీరోయిన్‌ తండ్రిగా, ‘సత్యానికి సంకెళ్లు’లో వచ్చీరాని ఇంగ్లిషు మాట్లాడే వ్యక్తిగా, ‘సి.ఐ.డి’లో విలన్‌కు సహచరునిగా, ‘తిక్కశంకరయ్య’లో పిచ్చాసుపత్రిలో వేసే అంతర్నాటకంలో లక్ష్మణుడిగా, ‘రాముడు-భీముడు’లో రిజిస్ట్రారుగా, ‘ద్రోహి’, ‘ప్రేమలోప్రమాదం’ చిత్రాల్లో సబ్‌-ఇన్స్‌పెక్టరుగా, ‘మాతృమూర్తి’లో చెవిటివానిగా, ‘ప్త్రెవేటుమాస్టారు‘లో పోస్టుమాస్టరుగా, ‘కధానాయకుడు’లో పద్మనాభం మామగా, ‘దొంగ కోళ్లు’లో లాయరుగా, ‘అత్తగారు-కొత్తకోడలు’లో మిలటరీ అధికారిగా ఇలా చెప్పుకుపో తుంటే... ఎన్నో అనుభూతులు! ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాలో కొండలరావు పెళ్లిళ్ల పేరయ్య వేషం వేసి సుశీలతో కలసి ఒక పాటకూడా పాడారు. బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ‘బంగారు పంజరం’(1969) సినిమాలో శోభన్‌బాబుకు మేనమామ రామకొటిగా పెద్ద పాత్రలో నటించారు. తండ్రి లేని శోభన్‌ ఇంట్లో తిష్టవేసి, వారి కాపురాన్ని నాశనం చెయ్యాలని కుట్ర పన్నే విలన్‌గా నటించి రాణించిన పాత్రకు కొండలరావుకు ఉత్తమ సహాయ నటుడుగా నంది బహుమతి లభించింది.

విలన్‌గా కొత్తరూపం

హాస్య నటునిగా ముద్రపడిన కొండలరావును ఇబ్బంది పెట్టిన సినిమాలూ లేకపోలేదు. పి. గంగాధరరావు నిర్మించిన ‘అర్థరాత్రి’(1968) సినిమాలో కొండలరావుది విలన్‌ వేషం. హీరోని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంటాడు. సినిమా చివర్లో హీరో జగ్గయ్యతో కాగడాలతో ఫైటుంది. ఆ సన్నివేశంలో కొండలరావు చెయ్యి కాలింది. అలాగే జగ్గయ్య మీద కూడా కిరసనాయిలు చింది నిప్పులు రేగాయి. అయినా జగ్గయ్య ‘‘పాపం ఇలాంటి వేషానికి మాస్టారు కొత్త’’ అని నచ్చ జెప్పి ఫైటింగ్‌ సన్నివేశాన్ని పూర్తిచేయించారు.

సినిమాల్లో ‘ఇగో’లు

సినిమా నటుల్లో ‘ఇగో’ (అహం) కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. రాజ్యం పిక్చర్స్‌ వారి ‘సత్య హరిశ్చంద్ర’ సినిమాలోని ఒక సన్నివేశంలో హరిశ్చంద్ర పాత్రధారి అయిన యస్‌.వి.రంగారావును, విశ్వామిత్ర పాత్రధారి గుమ్మడి కాలితో తన్నాలి. కానీ ఆ సన్నివేశంలో నటించేందుకు రంగారావు ఒప్పుకోలేదు. డూప్‌తో షాట్‌ తీయాల్సి వచ్చింది. అలాగే ‘ప్రేమించి చూడు’ సినిమాలో రామలింగయ్య, రేలంగిని ‘బావా’’ అని పిలవాలి. అందుకు రేలంగి ఒప్పుకోలేదు. దర్శకుడు పుల్లయ్య మందలించిన తర్వాత కానీ రేలంగి దిగిరాలేదు. ‘వీరాభిమన్యు’ సినిమాలో ద్రోణుడి పాత్ర ధరించిన కొండలరావుకు దుర్యోధునుడు కాళ్లు కడిగి, ఆ జలాన్ని నెత్తిన చల్లుకోవాలి. ఆ సన్నివేశంలో నటించేందుకు రాజనాల ఎంతగా ఫీలై పోయాడో చెప్పలేం. అదే ‘ప్రేమించి చూడు’ సినిమాలో కొండలరావు పాత్ర అక్కినేని ‘‘ఒరేయ్‌ గాడిదా! ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అంటూ అడగాలి. ఆ సన్నివేశంలో నటించేందుకు కొండలరావు సందేహిస్తే అక్కినేనిని, ‘‘ఈ సన్నివేశంలో తండ్రి కొడుకును మందలింపుగా ప్రశ్నిస్తున్నాడు. ఆక్కినేనిని కొండలరావు గాడిదా అనడంలేదు’’ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. దాంతో కొండలరావు ఆ పాత్రలో విజృంభించారు. విజయా సంస్థకు కొండలరావు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడు కూడా. అందుకే నాగిరెడ్డి సలహా మేరకు చందమామ-విజయా కంబైన్స్‌ నిర్మించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాలు కొండలరావు నిర్మాణ నిర్వహణలోనే పూర్తిచేశారు.

- ఆచారం

ఇదీ చదవండి: 

వేషం అడగడానికి వెళ్తే.. ‘గెట్‌ అవుట్‌’ అన్నారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు