
Shahid kapoor:సినిమా చివర్లో ఏడ్చేశా..
‘జెర్సీ’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో షాహిద్ కపూర్
ఇంటర్నెట్ డెస్క్: అటు బాలీవుడ్‌లోనే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘జెర్సీ’. 2019లో తెలుగులో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’.. ఈ ఏడాది డిసెంబర్ 31న అదే పేరుతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. నటుడు షాహిద్ కపూర్ హీరోగా నటించారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెర్సీ సినిమా ముచ్చట్లతో పాటు పలు ఆసక్తికర విషయాలను ఇలా పంచుకున్నారు.
నన్ను ట్రోల్ చేసినా.. కెరీర్‌లోనే పెద్ద హిట్ అయ్యింది
రెండేళ్ల క్రితం బాలీవుడ్‌లో వచ్చిన కబీర్ సింగ్ (తెలుగులో ‘అర్జున్ రెడ్డి’) నా కెరీర్‌లోనే గొప్ప విజయంగా నిలిచింది. అందులో నటించిన కొన్ని సన్నివేశాలకు నన్ను ట్రోల్ చేశారు. మొత్తానికి ఆ సినిమా మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. 18 ఏళ్ల నుంచి సినీ ఇండస్ర్టీలో ఉన్న నేను.. ఇన్నేళల్లో ఎప్పుడూ అంత కలెక్షన్స్‌ను అందుకోలేదు. ఇదంతా జరిగినప్పుడు నాకు ఎటువెళ్లాల్లో కూడా అర్థం కాని పరిస్థితి. అంతా కొత్తగా అనిపించింది. ఆ తరువాత అందరూ యాక్షన్ సినిమాలు చేయమని సలహా ఇచ్చారు. కానీ కబీర్ సింగ్ విడుదల ముందు నాని జెర్సీ చూశా. సినిమా చివర్లో ఏడ్చేశా. ఎందుకు అలా ఎమోషనల్ అయిపోయారంటూ నా భార్య నన్ను అడిగింది. ఎందుకంటే జెర్సీ కథ నన్ను అంతలా కదిలించింది. అప్పుడే ఈ సినిమా చేయాలని నిశ్చయించుకున్నా.
కబీర్ సింగ్ కన్నా ముందే జెర్సీ అవకాశం !
కబీర్‌సింగ్ కన్నా ముందు నాకు జెర్సీ అవకాశం వచ్చింది. అప్పుడు ఈ చిత్రాన్ని చేయకూడదనుకున్నా. ఈలోపు నేను కబీర్‌సింగ్ చేస్తుండటంతో జెర్సీ వాయిదా పడింది. అయినప్పటికీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నాకోసం ఎంతో కాలం ఎదురుచూశారు. ఈ సందర్భంగా గౌతమ్‌కి నా ధన్యవాదాలు! ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతా! ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాల్లో జెర్సీ ది బెస్ట్ అని. జెర్సీ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ‘‘మనిషి చైతన్యానికి విజయం’’ అని చెబుతా
థియేటర్లలో విడుదల చేయాలని రెండేళ్లు ఆగాం..
ఈ టీమ్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ కాలంలో ఈ సినిమాని 50శాతం పూర్తిచేశాం. వాక్సిన్ అందుబాటులో లేక కొన్ని రోజులు షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో నాతో పాటు మానాన్న, కొడుకు ఉండేవారు. అన్ని అడ్డంకులు దాటుకొని వచ్చేసరికి.. ఇంత పెద్ద ప్రయాణంలా సాగింది. కుటుంబంతో కలిసి చూడాల్సిన కథ ఇది. అందుకే థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకే రెండేళ్లు నిరీక్షించాం. ఈవిషయంలో నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్‌కి నా ధన్యవాదాలు.