Updated : 12/04/2021 13:59 IST

హారికా నారాయణ్‌.. సింగర్‌ మాత్రమే కాదు..

ప్రముఖ సింగర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లాహే లాహే లాహే లాహే’.. గత కొన్నిరోజుల నుంచి ఎక్కడా విన్నా.. ఎవరి ఫోన్‌లో చూసిన ఇదే పాట వినపడుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’లోని ఈ పాట గాయని హారికను మరెంతో మంది సినీప్రియులకు చేరువచేసింది. చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఆమె ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘స్వరాభిషేకం’తో గాయనిగా వెలుగులోకి వచ్చింది. అనంతరం వరుస స్టేజ్‌ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌లో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో హారికా నారాయణ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

అమ్మే మొదటి గురువు

ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువే హారికా నారాయణ్‌. సంగీత నేపథ్య కుటుంబంలో పుట్టిన హారికకు మొదటి గురువు వాళ్లమ్మగారే. చిన్నప్పటి నుంచి హారిక కర్ణాటక‌ సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆ‌ సంగీతంపై ఉన్న ఆసక్తితో అందులో డిప్లామా చేస్తున్నారు.


ఏదో అనుకుంటే ఏదో అయ్యిందే..

హారికా నారాయణ్‌ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రాజోలులోనే అయినప్పటికీ తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. అక్కడే చదువుకొన్నారు. ‘మనం ఒకటి అనుకుంటే దేవుడు మరొకటి చేస్తాడు’ అనే మాట హారికకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కాకపోతే, అనుకోని విధంగా గాయనిగా మారి తన గాత్రంతో అందర్నీ మెప్పిస్తుంది.


‘పాడుతా తీయగా’లో.. తొలి అడుగులు

హారికకు మొదటి నుంచి తెలుగు సినిమా పాటలపై ఎలాంటి అవగాహన లేదు. కేవలం కర్ణాటక సంగీతంపైనే‌ ఆమె ధ్యాసంతా ఉండేది. అయితే, ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజుల్లో ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘పాడుతాతీయగా’ ఆడిషన్స్‌లో తొలిసారి పాల్గొన్నారు. అనంతరం ఆమె ‘స్వరాభిషేకం’లో కోరస్‌ సింగర్‌గా కొన్ని పాటలు పాడారు. అలా, అదే స్టేజ్‌పై ఎస్పీ చరణ్‌తో కలిసి ‘అమ్మ బ్రహ్మ దేవుడో’ అనే పాటను మొదటిసారి ఆమె అలపించారు.


‘అమ్మ’ పాట.. మొదటిపాట

నిహారిక కథానాయికగా నటించిన ‘సూర్యకాంతం’తో హారిక ప్లేబ్యాక్‌ సింగర్‌గా మారారు. ‘నాదనే లోకమిలా’ అంటూ సాగే పాటను అలపించారు. ఓవైపు స్టేజ్‌ షోలు చేస్తూనే తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆమె కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకూ ఆమె పాడిన ‘ఫేసే లేని హీరో వీడు’ (ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ),  ‘నా తప్పు ఏమున్నదబ్బా’ (బ్లాక్‌ రోజ్‌), పాటలు ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి.


స్టార్‌ హీరోలు.. ఇంటర్నేషనల్‌ సింగర్స్

విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక.. మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో ‘లాహే లాహే’తోపాటు మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’లో టైటిల్‌ ట్రాక్‌ పాడింది ఈ ముద్దుగుమ్మనే. కేవలం సినిమాల్లో పాటలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ స్పెషల్‌ ఆల్బమ్స్‌తోనూ ఈమె అభిమానులను మెప్పిస్తున్నారు. ఇటీవల 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్‌ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్‌ అందర్నీ ఆకర్షించింది.


గాయని మాత్రమే కాదు..

హారిక కేవలం గాయని మాత్రమే కాదు నటి కూడా. వరుణ్‌తేజ్‌ నటించిన ‘ముకుందా’తో ఆమె మొదటిసారి సినిమాల్లో కనిపించారు. అందులో ఓ చిన్న పాత్ర పోషించిన హారిక అనంతరం ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు మరదలి పాత్రలో మెప్పించారు. ‘సైరా’లోనూ ఓ పాత్రలో తళుక్కున మెరిశారు ఈ భామ. సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి గాయనిగానే ఉండాలనుకుంటున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మరెన్నో విశేషాలు

*హారికకు బైక్‌ రైడింగ్స్‌ అంటే ఎంతో ఇష్టం. ఇంజనీరింగ్‌ చదువుతున్న రోజుల్లో పరీక్షలకు బైక్‌పైనే కళాశాలకు వెళ్లేదట ఈమె.

*హారికకు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. మహేశ్‌ను దగ్గర నుంచి చూడొచ్చనే ‘బ్రహ్మోత్సవం’లో నటించారట.

*ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. హారికను లుక్స్‌పరంగా నటి శ్రుతిహాసన్‌తో పోల్చేవారట.

*హారికకు పెయింటింగ్స్‌ వేయడం అంటే ఆసక్తి. ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఆమె అందమైన చిత్రాలను వేస్తుంటుంది.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని