Nagarjuna: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా.. నాగార్జున

‘తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. సినీ పరిశ్రమకి మద్ధతివ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు నాగార్జున.

Updated : 28 Sep 2021 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. సినీ పరిశ్రమకి మద్దతివ్వాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని అభ్యర్థిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ‘లవ్‌స్టోరి’ సక్సెస్‌ మీట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘2020 మార్చి నుంచి కరోనాతో పోరాడుతూనే ఉన్నాం. ఒక వేవ్ వచ్చిపోయిందనుకునే లోపు మరో వేవ్ వచ్చి దెబ్బతీసింది.  ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కరోనా ప్రభావం తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతటా కొవిడ్‌ మరణాలు తగ్గుతున్నాయి. ముందుగా మనం దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. టాలీవుడ్‌కే కాదు అన్ని చిత్ర పరిశ్రమకి ‘లవ్‌స్టోరి’ ఒక ధైర్యానిచ్చింది. ఈ ఉత్సాహంతోనే మరిన్ని చిత్రాలు విడుదలవుతాయి. ఓ మంచి సినిమా అందించండి.. ‘మేం థియేటర్లకి వస్తాం’ అని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. సున్నితమైన కథని కమర్షియల్‌ హంగులతో చూపించాలంటే చాలా కష్టం.  సెన్సిటివ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దాన్ని అద్భుతంగా డీల్‌ చేశారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ‘లవ్‌స్టోరి’ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ క్లాసిక్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. యాక్టర్‌, స్టార్‌.. రెండూ వేరు. అలాంటిది నాగ చైతన్యని స్టార్‌ యాక్టర్‌గా చేసినందుకు శేఖర్‌కి ధన్యవాదాలు చెప్తున్నా. తెలుగువారికి సినిమా అంటే ప్రేమ. మమ్మల్ని (చిత్ర పరిశ్రమ) చల్లగా చూడాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని అభ్యర్థిస్తున్నా. సినీ పరిశ్రమకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని