Bollywood: బాలీవుడ్‌ హుషారు... విడుదల జోరు

‘సూర్యవంశీ’ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్‌ హుషారుగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాది బుకింగులు అయిపోయాయి... వచ్చే ఏడాది కోసం చాలా చిత్రాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి.

Updated : 21 Nov 2021 07:07 IST

‘సూర్యవంశీ’ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో బాలీవుడ్‌ హుషారుగా అడుగులు వేస్తుంది. ఈ ఏడాది బుకింగులు అయిపోయాయి... వచ్చే ఏడాది కోసం చాలా చిత్రాలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. ముందస్తుగానే విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు. శనివారం పలు బృందాలు ఈ మార్గంలో నడిచాయి.

ఆమిర్‌ఖాన్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’కు సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమిర్‌, కరీనా సన్నిహితంగా ఉన్న ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆమిర్‌ యువకుడిగా, వయసుపై బడిన వాడిలా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ కారణంతోనే సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా వస్తోంది. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్‌14నే పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్‌ 2’, వరుణ్‌ధావన్‌ ‘భేడియా’ కూడా రానుంది. ప్రభాస్‌ ‘సలార్‌’ కూడా ఇదే రోజున రానుంది. సలార్‌, ‘కేజీఎఫ్‌’...ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కావడంతో ‘సలార్‌’ విడుదల తేదీ మారే అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.


హిందీలో ‘హిట్‌’ కొట్టడానికి

తెలుగులో విజయం సాధించిన ‘హిట్‌’ చిత్రం అదే పేరుతో హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలనుయే హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. రాజ్‌కుమార్‌రావ్‌, సాన్యా మల్హోత్ర జంటగా నటించారు. ఈ సినిమాని మే 20, 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భూషణ్‌కుమార్‌, దిల్‌రాజు, క్రిషన్‌ కుమార్‌, కులదీప్‌ రాథోర్‌ నిర్మిస్తున్నారు.


జుగ్‌ జుగ్‌ సందడి

వచ్చే ఏడాది కోసం కర్చీఫ్‌ వేసిన మరో చిత్రం ‘జుగ్‌ జుగ్‌ జీయో’. వరుణ్‌ ధావన్‌, అనిల్‌కపూర్‌, కియారా అడ్వాణీ, నీతూ కపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌ 24న విడుదల చేయనున్నారు. ‘గుడ్‌న్యూస్‌’ దర్శకుడు రాజ్‌మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. కుటుంబం, అనుబంధాల నేపథ్యంగా సాగే చిత్రమిది. ప్రేమ, తరాల మధ్య అంతరం అనే విషయాల్ని ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని