Published : 20/09/2021 01:48 IST

Chiranjeevi: అందుకే నా చిత్రంలో సాయి పల్లవిని వద్దనుకున్నా..!

హైదరాబాద్‌: ‘నా సినిమాలో నటించేందుకు సాయి పల్లవి ఒప్పుకోకపోతే బాగుణ్ణు అనిపించింది’ అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. ‘లవ్‌స్టోరి’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ముందస్తు విడుదల వేడుకని చిత్రబృందం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలకి వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతే ఈ రోజు నాకు కలుగుతోంది. ప్రత్యక్షంగా ఇలాంటి వేడుకకి వచ్చి, ఆయా సినిమాల గురించి మాట్లాడుతూ ప్రేక్షకుల చప్పట్లు వింటున్నప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. నిర్మాత నారాయణ్‌ దాస్‌ గారంటే నాకెంతో గౌరవం. 1980ల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయన్ను నా గురువులా భావిస్తాను. ఆయన తనయుడు సునీల్‌ చాలా స్మార్ట్‌. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు ఇంత బాగా ఉండటానికి కారణం సునీలే. నాగ చైతన్య నిలకడగా వ్యవహరించే నటుడు. తను ఎంపిక చేసుకునే కథలు, కాంబినేషన్లు చాలా బాగుంటున్నాయి. నాగ చైతన్య, నా మిత్రుడు ఆమిర్ ఖాన్‌ కలయికలో రూపొందుతోన్న ‘లాల్‌సింగ్‌సింగ్‌ చద్దా’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకకి వచ్చిన ఆమిర్‌ఖాన్‌కి థ్యాంక్స్‌. ఇది యువ నటులకి ఆయనిచ్చే ప్రోత్సాహం. వరుణ్‌ తేజ్‌తో ‘ఫిదా’ సినిమా చేసేంతవరకు సాయి పల్లవి ఎవరో నాకు తెలియదు. ఈ చిత్రంలో తను డ్యాన్స్‌ చేసిన ఓ పాటని చూసి ఆశ్చర్యపోయా. ఓ సినిమాలో నాకు చెల్లెలిగా నటించేందుకు సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్ర బృందం అనుకుంది. కానీ, నాకు మాత్రం వద్దు అనిపించింది. తను ఒప్పుకోకూడదని మనసులో కోరుకున్నా. ఎందుకంటే అన్నాచెల్లెళ్లుగా నటించాలని నాకు లేదు. మంచి డ్యాన్సర్‌తో కలసి నేనూ డ్యాన్స్‌ చేయాలనుకుంటాను. కానీ, చెల్లెమ్మా ఎలా ఉన్నావు? అని ఎలా అనగలను (నవ్వుతూ). శేఖర్‌ కమ్ముల తీసిన ప్రతి చిత్రమూ క్లాసిక్‌ అవుతుంది. ఈ చిత్రం మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

సాయి పల్లవి అభిమానిని: ఆమిర్‌ఖాన్‌

‘మీలానే నేనూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. నేనూ ఈ నెల 24నే ఈ చిత్రాన్ని చూస్తా. అంతకంటే ముందూ చూడను, ఆ తర్వాతా చూడను. తప్పకుండా థియేటర్‌లోనే ఈ చిత్రాన్ని చూస్తా. మహారాష్ట్రలో అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు స్క్రీనింగ్‌ హాల్లో వీక్షిస్తా. చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలుపుతున్నా. సాయి పల్లవి డ్యాన్సుకి నేను అభిమానిని. ఈ రోజు ఆమెను కలవడం సంతోషంగా ఉంది’ అని ఆమిర్‌ఖాన్‌  తెలిపారు.

ఆయన కోసం ఎంతదూరమైన వెళ్లొచ్చు: నాగ చైతన్య


‘ఈ వేడుకకి విచ్చేన చిరంజీవి, ఆమిర్‌ఖాన్‌కి ధన్యవాదాలు. ఈ సినిమా ట్రైలర్‌ చూసి ఆమిర్‌ఖాన్‌ నాకు మెసేజ్‌ చేశారు. అలా ముచ్చటిస్తుండగా ఈ ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఉందని చెప్పాను. నేను వస్తా అన్నారు. ఆయన వచ్చారనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. చాలా రోజుల తర్వాత అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను బాగా  ఇన్వాల్వ్‌ అయి నటించిన చిత్రమిది. దానికి కారణం దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సినిమా ప్రారంభంలో ఆయన స్టైల్‌ కొత్తగా అనిపించింది. తర్వాతర్వాత ఆయన పద్ధతి చూశాక ఈ మనిషి కోసం ఎంతదూరమైనా వెళ్లొచ్చు అనిపించింది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోవద్దని నాకు తెలిసిన నటులందరికీ చెబుతుంటా. ఆయనతో చేసిన ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. కథని, నటీనటుల్ని నమ్మి ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదలచేయాలని భావించిన నిర్మాతలకి థ్యాంక్స్‌’ అని అన్నారు.

‘ఆయన సినిమాకి నో చెప్పినందుకు ముందుగా చిరంజీవి గారిని క్షమాపణ కోరుతున్నా. నేను ఆయన డ్యాన్స్‌ చూస్తూ పెగిగాను. నా డ్యాన్సులో గ్రేస్‌ ఉందంటే దానికి కారణం ఆయనే. ఇందుకు థ్యాంక్స్‌ చెబుతున్నా. ఆమిర్‌ఖాన్‌ సర్‌ను కలవడాన్ని నమ్మలేకపోతున్నా. ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకి కృతజ్ఞతలు’ అని సాయి పల్లవి తెలిపింది.

‘ఈ వేడుకకి విచ్చేసిన చిరంజీవి, ఆమిర్‌ఖాన్‌కి చాలా థ్యాంక్స్‌’ అన్నారు చిత్ర నిర్మాత నారాయణ్‌దాస్‌ కె. నారంగ్‌.  ‘ఆమిర్‌ఖాన్‌ సర్‌ ముందు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్మి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకి, ఈ చిత్రంలో పాటలు రాసిన, పాడిన వారికి ధన్యవాదాలు’ అని సంగీత దర్శకుడు పవన్‌ పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ ఆన్‌లైన్‌ వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని