Dhee 13: ‘ఢీ’లో పల్లె వాతావరణం.. ప్రెసిడెంట్‌గా సుధీర్‌ హంగామా

అటు డ్యాన్సులు, ఇటు నవ్వులతో ఈటీవీ వేదికగా ప్రతి బుధవారం సందడి చేసే ‘ఢీ 13’ ఈసారి రెట్టింపు హంగామా చేసేందుకు సిద్ధమైంది. ‘విలేజ్‌ థీమ్‌ స్పెషల్‌’ అంటూ పల్లె వాతావరణాన్ని ఆవిష్కరించనుంది.

Updated : 17 Aug 2022 10:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటు డ్యాన్సులు, ఇటు నవ్వులతో ఈటీవీ వేదికగా ప్రతి బుధవారం సందడి చేసే ‘ఢీ 13’ ఈసారి రెట్టింపు హంగామా చేసేందుకు సిద్ధమైంది. ‘విలేజ్‌ థీమ్‌ స్పెషల్‌’ అంటూ పల్లె వాతావరణాన్ని ఆవిష్కరించనుంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పాటలు, మాటలతో ఆద్యంతం అలరిస్తోంది. ‘ఉట్టిమీద కూడు ఉప్పు చేప తోడు’, ‘నేల తల్లి గుండెలో’ అనే పాటలకి కంటెస్టెంట్లు చేసిన డ్యాన్సు అందరినీ కట్టిపడేసేలా ఉంది. మరి పల్లెటూరు స్పెషల్‌ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు మాత్రమే స్టెప్పులేస్తే సరిపోదు కదా. అందుకే ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలు, టీం లీడర్లూ కాలు కదిపారు. ఒకరిని మంచి మరొకరు పోటీపడి నర్తించారు.

రొమాంటిక్‌ ప్రెసిడెంట్‌ ఎలా ఉంటాడో తనదైన శైలిలో చూపించాడు సుధీర్‌. ఆయనకు ఆది తోడైతే ఎలా ఉంటుంది? నవ్వులే నవ్వులు. సుధీర్‌ నివసించే గ్రామంలో ఉండేందుకు ప్రదీప్‌ విచ్చేస్తాడు. సుధీర్‌కి అనువైన చోట ప్రదీప్‌ని ఉండమని ఆది వివరించే సందర్భం గిలిగింతలు పెడుతుంది. మధ్యలో రష్మి, దీపికా ఎంట్రీ ఇస్తారు. ‘మా ఇంటికి రండి’ అని ప్రదీప్‌ని ఆహ్వానిస్తుంది దీపికా. ‘ఎప్పుడైనా నన్ను అడిగారా మా ఇంటికి వస్తారా? అని’ సుధీర్‌ అనగానే ‘మిమ్మల్ని అడగకపోయినా వస్తారు కదండి’ అని దీపికా సమాధానం ఇస్తుంది. వెంటనే ‘అయ్యా!!’ అంటూ రష్మి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ హైలెట్‌గా నిలిచింది. అందరూ తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి, ఆకట్టుకుంటున్నారు. పల్లెటూరి యాసని అనుకరించి, మెప్పిస్తున్నారు. ఈ హంగామాని చూడాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసి ఆనందించండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని