RRR: త్వరలో మీ ముందుకు వస్తాం.. అన్నింటికీ సమాధానమిస్తాం: రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌...

Updated : 25 Nov 2021 17:44 IST

‘జనని’ పాట విడుదల కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా నవంబర్‌ 26న ‘జనని’ అనే పాట విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు.  ‘‘జనని’ పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఓ సోల్‌. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు. డిసెంబర్‌ మొదటి వారంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్‌ భారీగానే ప్లాన్‌ చేశాం. వచ్చే నెలలో వరుసగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. నటీనటులు, మెయిన్‌ టెక్నిషియన్స్‌.. ఇలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెబుతాం’ అని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు.

బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌చరణ్‌-తారక్‌ మొదటిసారి ఈ సినిమా కోసం స్క్రీన్‌ పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ.. కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘జనని’ పాటపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని