Lovestory: మనం ఏం చేయలేమని మాటలంటున్నరే: నాగచైతన్య

అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ వచ్చేసింది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు....

Updated : 13 Sep 2021 11:57 IST

మనసును హత్తుకునేలా ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌

హైదరాబాద్‌: అక్కినేని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ వచ్చేసింది. నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సాయిపల్లవి కథానాయిక. మరో కొన్నిరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సోమవారం ఉదయం ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చైతన్య-సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. తెలంగాణ స్టైల్లోని వారి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బిజినెస్‌లు చేయలేం.. మనతోని కాదని.. మాటలు అంటున్నరే’ అంటూ సాగే సంభాషణలు సినిమాలో నాగచైతన్య పాత్ర తెలియజేసేలా ఉన్నాయి. ‘బతుకు కోసం ఈ ఊరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం.. కానీ, తేల్చుకుని చద్దాం’ అంటూ ట్రైలర్‌ చివర్లో నాగచైతన్య చెప్పే డైలాగ్‌ భావోద్వేగానికి గురి చేస్తోంది.

ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య మధ్యతరగతి అబ్బాయి పాత్ర పోషించారు. కుటుంబ పోషణ కోసం పట్నం వచ్చి డ్యాన్స్‌ మాస్టర్‌గా ఇరుగుపొరుగు వారికి క్లాసులు చెబుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అబ్బాయిగా ఆయన కనిపించనున్నారు. అదే సమయంలో సాయిపల్లవి సైతం బీటెక్‌ పూర్తి చేసి.. ఉద్యోగం వేటలో ఉన్న అమ్మాయిగా సందడి చేయనున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైన హీరోయిన్‌కి మధ్యతరగతి కుటుంబానికి చెందిన హీరోకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? వారి ప్రేమ విజయం సాధించిందా? అనేది తెలియాలంటే సెప్టెంబర్‌ 24 వరకూ వేచి చూడాల్సిందే. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై  నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని