MaheshBabu: ఇలాంటి డ్యాన్స్‌ ఎప్పుడూ చూడలేదు..: మహేశ్‌బాబు

‘లవ్‌స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య తనలోని నటుడ్ని ప్రతిఒక్కరికీ పరిచయం చేశాడని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌ ట్విటర్‌ వేదికగా చిత్రబృందంపై అభినందనల...

Updated : 07 Dec 2022 19:29 IST

లవ్‌స్టోరీ టీమ్‌పై మహేశ్‌ ప్రశంసల వర్షం

హైదరాబాద్‌: ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య తనలోని నటుడిని ప్రతిఒక్కరికీ పరిచయం చేశాడని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌ ట్విటర్‌ వేదికగా చిత్రబృందంపై అభినందనల వర్షం కురిపించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని.. చిత్రబృందం పడిన కష్టానికి సరైన విజయం దక్కిందని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం సమాజంలో మనం చూస్తోన్న ఎన్నో విషయాలను సున్నితంగా చెబుతూ అద్భుతమైన చిత్రాన్ని అందించారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. నాగచైతన్య తనలోని పూర్తిస్థాయి నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇక, సాయిపల్లవి ఎప్పటిలాగే అదరగొట్టేసింది. అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా? ఆన్‌స్క్రీన్‌పై ఇలాంటి డ్యాన్స్‌ నేను ఇప్పటివరకూ చూడలేదు. ఆమె డ్యాన్స్‌ ఒక కలలా ఉంది. సినిమాకి పవన్‌ అందించిన మ్యూజిక్‌ సెన్సేషనల్‌. రెహమాన్‌ సర్‌.. మీ శిష్యుడు మిమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్ర నిర్మాతలకు నా అభినందనలు’’ అని మహేశ్‌ పేర్కొన్నారు.

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య మధ్యతరగతి యువకుడిగా రేవంత్‌ పాత్రలో మెప్పించారు. బీటెక్‌ పూర్తి చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే అమ్మాయిగా సాయిపల్లవి నటించారు. సమాజంలో ఉన్న కుల వ్యవస్థతోపాటు కుటుంబంలో ఉండే వ్యక్తుల నుంచే అమ్మాయిలు ఏవిధంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారే విషయాన్ని ఈ చిత్రంలో ఎంతో సున్నితంగా శేఖర్‌ చూపించారు. ఈశ్వరీ, రాజీవ్‌ కనకాల, ఉత్తేజ్‌, దేవయానీ కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని