Puneeth Rajkumar: పునీత్‌ మరణం.. బెంగళూరుకు తారక్‌

తన ప్రాణమిత్రుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్తతో తారక్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన స్నేహితుడిని చివరిసారిగా చూసుకునేందుకు ఎన్టీఆర్‌ శనివారం ఉదయం బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది...

Updated : 30 Oct 2021 12:04 IST

హైదరాబాద్‌: తన ప్రాణమిత్రుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణవార్తతో తారక్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన స్నేహితుడిని చివరిసారిగా చూసుకునేందుకు ఎన్టీఆర్‌ శనివారం  బెంగళూరుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పునీత్‌ పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యుల్ని పరామర్శించనున్నారని సమాచారం. మరోవైపు, నందమూరి కుటుంబసభ్యులు, అందులోనూ తారక్‌తో పునీత్‌కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. పునీత్‌-తారక్‌ ఎంతో కాలంగా మంచి స్నేహితులు. పునీత్ నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్‌ ‘గెలయా గెలయా’ అనే పాటని ఆలపించిన విషయం తెలిసిందే.

అంత్యక్రియలు నేడే..?

పునీత్ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కొంతమంది శనివారం సాయంత్రం అని చెబుతున్నారు. అయితే పునీత్‌ కుమార్తె వందిత అమెరికాలో ఉన్న కారణంగా ఆమె వచ్చిన తర్వాతనే ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ విషయంపై బెంగళూరు సీపీ కమల్‌ స్పందించారు. పునీత్‌ కుటుంబసభ్యుల నిర్ణయం మేరకే అంత్యక్రియలు జరుగుతాయని.. ఈ రోజు సాయంత్రమే జరిగే అవకాశాలున్నాయని తెలిపారు.

భారీగా తరలివస్తున్న అభిమానులు..

తమ అభిమాన కథానాయకుడు పునీత్‌కి తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరుకు చేరుకుంటున్నారు. కంఠీరవ స్టేడియం వద్దకు చేరుకుని పునీత్‌ పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. పునీత్‌ మరణవార్త విని చాంరాజ్‌నగర్‌కు చెందిన మునియప్ప, బెళగావికి చెందిన పరశురామ్‌ గుండెపోటుతో మృతిచెందారు. మరోవైపు కంఠీరవ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని