Suma: రాజీవ్‌.. అందుకు నువ్వు బాధపడ్డావని తెలుసు కానీ..: సుమ

‘లవ్‌స్టోరీ’లో నరసింహంగా నటించడానికి రాజీవ్‌ కనకాల ఎంతో బాధపడ్డాడని ఆయన సతీమణి, ప్రముఖ వ్యాఖ్యాత సుమ అన్నారు. తాజాగా ‘లవ్‌స్టోరీ’...

Published : 01 Oct 2021 12:28 IST

భర్తపై వ్యాఖ్యాత పోస్ట్‌

హైదరాబాద్‌: ‘లవ్‌స్టోరీ’లో నరసింహంగా నటించడానికి రాజీవ్‌ కనకాల ఎంతో బాధపడ్డాడని ఆయన సతీమణి, ప్రముఖ వ్యాఖ్యాత సుమ అన్నారు. తాజాగా ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని వీక్షించిన ఆమె చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, తన భర్త రాజీవ్‌ ఎంతో అద్భుతంగా నటించాడని పొగిడారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ‘లవ్‌స్టోరీ’ నుంచి రాజీవ్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ను షేర్‌ చేశారు. ‘అతి తక్కువమంది నటీనటులు మాత్రమే తమ నటనతో మన మనస్సులను తాకుతారు. అలాంటి నటీనటుల్లో నా భర్త రాజీవ్‌ కూడా ఒకరు. నరసింహంగా ఎంతో అద్భుతంగా నటించినందుకు అభినందనలు. నాకు తెలుసు ఆ పాత్ర చేయడానికి నువ్వు ఎంతో బాధ, ఇబ్బందిపడ్డావనీ.. కానీ, ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావు. ఇలాంటి సున్నితమైన కథను మరింత సున్నితంగా తెరకెక్కించిన శేఖర్‌కమ్ముల, చైతన్యలకు ధన్యవాదాలు. సాయిపల్లవి డ్యాన్స్‌ చూసి నా కళ్లు అలసిపోయాయి. డ్యాన్స్‌ ఎక్కడ మిస్‌ అవుతానోనని.. కంటి రెప్ప కూడా వాల్చలేదు. మరోసారి టీమ్‌ మొత్తానికి అభినందనలు’ అని సుమ పేర్కొన్నారు.

ఫీల్‌గుడ్‌ ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరీ’లో రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయిపల్లవి నటించారు. కుటుంబపోషణ నిమిత్తం పట్టణం వచ్చి జుంబా ట్రైనర్‌గా మారిన ఓ మధ్య తరగతి కుర్రాడిగా చై తన నటనతో అందర్నీ మెప్పించాడు. ఇక, సాయిపల్లవి తన డ్యాన్స్‌తో ఫిదా చేసింది. సాయిపల్లవి బాబాయ్‌ పాత్రలో రాజీవ్‌ నటించారు. కుటుంబసభ్యులే అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే విషయాన్ని శేఖర్‌ ఈ సినిమాలో ఎంతో సున్నితంగా చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని