
Balakrishna: ఆ జవాబు చెప్పిన వ్యక్తికి బాలకృష్ణ వార్నింగ్
ఇంటర్నెట్‌డెస్క్: బాలకృష్ణ(Balakrishna) వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. సంక్రాంతి సందర్భంగా ప్రసారమైన కార్యక్రమానికి ‘లైగర్’ చిత్ర బృందం విచ్చేసి సందడి చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, కథానాయకుడు విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మిలతో బాలకృష్ణ సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చొని, నాలుగు ప్రశ్నలు అడిగి, అవతలి వ్యక్తి తెలివిగా జవాబులు చెబితే అవి వినటం నా వల్ల కాదని చెప్పా. అందుకు ఒక షరతు పెట్టా. వచ్చిన వాళ్లను ఆడుకుంటానని చెప్పా’ అని అన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండను సెట్లో వేలాడదీసిన శాండ్ బ్యాగ్‌ను తన్నమన్నారు. విజయ్ గట్టిగా దాన్ని తన్నడంతో అది తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో బాలకృష్ణ నటించిన మొదటి చిత్రం ఏది? అని ప్రశ్న అడగ్గా, విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డారు. షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు ‘తాతమ్మకల’ అని సమాధానం చెప్పగా, ‘వాడు నా చేతిలో అయిపోయాడు. ఖతం’ అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆహా’ విడుదల చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ఈ వీడియో నవ్వులు పంచుతోంది.