Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Tollywood: లవ్‌స్టోరీ, మహాప్రస్థానం, పరిణయం సహా ఏయే చిత్రాలు థియేటర్‌, ఓటీటీల్లో అలరించనున్నాయంటే?

Published : 21 Sep 2021 01:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మొదలై సెప్టెంబరు చివరి వారంతో సుమారు రెండు నెలలు పూర్తికానుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా థియేటర్స్‌లో సినిమాలను ప్రదర్శిస్తున్నా, పూర్తి స్థాయిలో నడపలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కొన్ని చిత్రాలు ఓటీటీకే సై అంటున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న చిత్రాలేంటో చూసేద్దామా!

క్రేజీ ‘లవ్‌స్టోరీ’

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్‌ డ్రామా ‘లవ్‌స్టోరీ’. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వినాయకచవితికి తీసుకువస్తారని ప్రకటించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చివరి నిమిషంలో విడుదల తేదీని మార్చారు. ఎట్టకేలకు సెప్టెంబరు 24న ‘లవ్‌స్టోరీ’ విడుదల కానుంది. ఫీల్‌గుడ్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించడం, నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పైగా ‘సారంగదరియా’ పాట విపరీతంగా ట్రెండ్‌ అయింది. అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై నారంగ్‌ దాస్‌, పుష్కర్‌ రామ్‌మోహన్‌లు నిర్మించిన ‘లవ్‌స్టోరీ’కి పవన్‌ సీహెచ్‌ స్వరాలు సమకూర్చారు.


మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘మరో ప్రస్థానం’

నీశ్‌, ముస్కాన్‌ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. జానీ దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ఈ చిత్రం విడుదలకానుంది. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. విలన్‌ బృందం వరుస హత్యలు చేస్తుంటుంది. హీరో బృందం వాటిని చిత్రీకరించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. హత్యల్ని షూట్‌ చేసిన కెమెరా విలన్లకి దొరుకుతుంది. దాంతో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. చివరకు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఓంకారేశ్వర క్రియేషన్స్‌, మిత్ర మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.


హారర్‌ థ్రిల్లర్‌ ‘సిండ్రెల్లా’

తిథి పాత్రలు, ఐటమ్స్‌తో అలరిస్తున్న నటి రాయ్‌లక్ష్మి ఈసారి భిన్నమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న చిత్రం ‘సిండ్రెల్లా’. ఎస్‌జే సూర్య సహాయకుడు వినో వెంకటేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫాంటసీ హారర్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో రాయ్‌ లక్ష్మి మూడు భిన్న పాత్రల్లో నటిస్తోంది. అశ్వమిత్ర సంగీతం సమకూరుస్తున్నారు. కోవై సుబ్బయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘సిండ్రెల్లా’ డ్రెస్‌ వేసుకున్న తర్వాత రాయ్‌లక్ష్మికి ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


సాహసాల ‘జంగిల్‌ క్రూయిజ్‌’

సాహసయాత్రలతో కూడిన చిత్రాలను ఇష్టపడేవారి కోసం మరో హాలీవుడ్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. డ్వేన్‌ జాన్సన్‌, ఎమిలి బ్లంట్‌, ఎడ్గర్‌ రమీజ్‌, జాక్‌ వైట్‌ హాల్‌ కీలక పాత్రల్లో నటించిన అడ్వెంచర్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘జంగిల్‌ క్రూయిజ్‌’. జైము కొల్లెట్‌ సెరా దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఈ ఏడాది జులైలో అమెరికాలో విడుదలైంది. ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబరు 24న అన్ని భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.


ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు...

‘ఆహా’లో పరిణయం

దుల్కర్‌ సల్మాన్‌, కల్యాణి ప్రియదర్శన్‌ జంటగా నటించిన రొమాంటిక్‌ కామెడీ డ్రామా ‘వరునె అవశ్యముంద్‌’. అనూప్‌ సత్యన్‌ దర్శకుడు. గతేడాది ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. సురేశ్‌గోపి, శోభన కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ‘వరునె అవశ్యముంద్‌’ను ‘పరిణయం’ పేరుతో తీసుకువస్తోంది. సెప్టెంబరు 24నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది. దుల్కర్‌ సల్మాన్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు అల్ఫాన్స్‌ జోసెఫ్‌ స్వరాలు సమకూర్చారు.


ఆ ఓటీటీలో ‘ఆకాశవాణి’

రాజమౌళి వద్ద సహాయకుడిగా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. పద్మనాభరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది. సోనీ లివ్‌ వేదికగా సెప్టెంబరు 24న స్ట్రీమింగ్‌ కానుంది.


ఎంఎక్స్‌ ప్లేయర్‌లో ‘పీఎం మోదీ బయోపిక్‌’

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ నటించిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సెప్టెంబరు 23 నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 మే 24 విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంలో వివేక్‌తో పాటు బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషి, జరీనా వాహబ్‌, రాజేంద్ర గుప్తా వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోదీ రాజకీయ జీవితం గురించి ప్రధానంగా ప్రస్తావించారు.


ఓటీటీలో సందడి చేయనున్న మరికొన్ని చిత్రాలు..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* రామే అందాళుమ్‌- సెప్టెంబరు 24

* బర్డ్స్‌ ఆఫ్ ప్యారడైజ్‌ - సెప్టెంబరు 24

* గోలియత్‌ - సెప్టెంబరు 24

* డెస్పికబుల్‌ మి - సెప్టెంబరు 25

నెట్‌ఫ్లిక్స్‌

* ఇంట్రూజన్‌ -సెప్టెంబరు 22

* మిడ్‌నైట్‌ మాస్‌-సెప్టెంబరు 24

* కోటా ఫ్యాక్టరీ2 -సెప్టెంబరు 24 (వెబ్‌సిరీస్‌)

జీ5

* అలాంటి సిత్రాలు -సెప్టెంబరు 24


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని