Cinema news: ‘యోగా’ భామలు

మూడు పదుల వయసైనా దాటకముందే మనకు జుట్టు రాలిపోవడం.. పొట్ట పెరగడం.. శరీరాకృతిని కోల్పోవడం ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే..

Updated : 21 Jun 2021 10:13 IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూడు పదుల వయసైనా దాటకముందే మనకు జుట్టు రాలిపోవడం.. శరీరాకృతిని కోల్పోవడం ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే.. మనతో పాటే ఈ కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవిస్తున్న హీరోయిన్ల ఫిట్‌నెస్‌ చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించక మానదు. మరి మనకు వాళ్లకు తేడా ఏమిటీ..? వాళ్లు అంత అందంగా.. ఫిట్‌గా ఉండటం ఎలా సాధ్యమవుతుందంటారు.? ఈ ప్రశ్నకు చాలా మంది చెప్పే జవాబు ఒక్కటే..! ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు యోగా చేయటం..! బాలీవుడ్‌, టాలీవుడ్‌.. హీరోయిన్లు ఎక్కువకాలం పరిశ్రమలో తమ ఉనికి కాపాడుకోవాలంటే ఫిట్‌నెస్‌ తప్పనిసరి. అందుకే హీరోయిన్లు అందరూ తమ అందాన్ని కాపాడుకోవడానికి.. అవకాశాలు అందుకోవడానికి యోగాకు ప్రాధాన్యం ఇస్తుంటారు. మరి వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా.. ఫిట్‌గా తయారవుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందామా..? ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.

1. సమంత..

తెలుగింటి కోడలు సమంతకు ఇష్టమైనవి గార్డెనింగ్‌.. యోగా చేయడం. అందం, అభినయంతో టాప్‌గేర్‌లో దూసుకెళుతోంది సమంత. భర్త నాగచైతన్యతో కలిసి యోగా చేస్తున్న ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ పంచుకుంటుంది.


2. కరీనా కపూర్‌..

పెళ్లి.. పిల్లలు.. వయసు.. శరీరాకృతికి ఏమాత్రం అడ్డుకాదని నిరూపిస్తోంది బాలీవుడ్‌ సీనియర్‌ నటి కరీనా కపూర్‌. 40ఏళ్ల వయసులోనూ ఆమె జీరో సైజ్‌ కాపాడుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని పనులున్నా క్రమం తప్పకుండా యోగా చేయడం మాత్రం ఆపేది లేదంటోందామె. ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట.


3. శిల్పాశెట్టి..

అప్పుడు నటిగా.. ఇప్పుడు బిజినెస్‌ ఉమెన్‌గా రాణిస్తున్న శిల్పాశెట్టి తన శరీరాకృతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తోంది. 46ఏళ్ల వయసులోనూ పదహారేళ్ల పిల్లలా శరీరాన్ని విల్లులా వంచుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాను యోగాను జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకున్నానంటోంది. ఎంత బిజీగా ఉన్నా.. వారానికి కనీసం మూడు రోజులైనా గంటపాటు యోగాకు సమయం కేటాయిస్తానంటోంది. సూర్య నమస్కారం చేయడం తనకెంతో ఇష్టమట.


4. జాక్వెలిన్‌..

శ్రీలంకన్‌ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌.. అద్భుతంగా శరీరాన్ని వంచుతూ యోగాసనాలు చేస్తుంది. ఆ ఆసనాలు చూస్తే అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా అనే సందేహం రాకమానదు. కొన్నేళ్లుగా యోగా తన జీవితంలో అంతర్భాగమైందంటున్నారు ఈ భామ. మన శరీరాన్ని, మనస్సును నియంత్రణలో పెట్టేది యోగానే అని అంటోందామె.


5. మలైకా అరోరా..

పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే టీచర్‌లాగే.. మలైకా క్రమం తప్పకుండా సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌ దుస్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా.. ఆమె నిత్యం గంటలు తరబడి యోగా చేస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు ఆమె ఏకంగా #StartTohKaro అనే ఒక కార్యక్రమం చేపట్టింది. అసలు యోగా అంటేనే తెలియని తన బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌కు కూడా దానిపై ఆసక్తి కలిగేలా చేసిందామె.


6. రకుల్‌ప్రీత్‌సింగ్‌

నటిగా మాత్రమే మనకు సుపరిచితురాలై రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక ఫిట్‌నెస్‌ ప్రేమికురాలు. జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్లు చేసే ఈ చిన్నది.. జిమ్‌ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. యోగా వల్లే తాను కరోనా నుంచి వేగంగా కోలుకోగలిగానని ఆమె చెప్తోంది.


7.శ్రియ

నటి శ్రియాసరన్‌కు అధోముఖాసనంతోనే రోజు ప్రారంభమవుతుందట. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యోగా తరగతులు కూడా చెబుతుంది.


8. మంచు లక్ష్మి

విదేశాల్లో చాలామంది యోగా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, యోగా పుట్టిన మన దేశంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారంటోంది మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. మనం ఎదుర్కొనే ఎన్నో భయాలను యోగాతో మటుమాయం చేయవచ్చంటోంది. మానసికవృద్ధితో పాటు శారీరకంగానూ మనకు యోగా ఎంతో దోహదం చేస్తుందంటోంది.


9.దీపిక పదుకొణె

బాలీవుట్‌ హీరోయిన్లలో అత్యంత ఫిట్‌గా కనిపించే వారిలో దీపిక పదుకొణె ఒకరు. సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు ఆమె యోగా చేసేందుకు ప్రాధాన్యమిస్తుందట. దాని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఫలింగా ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయగలమని ఆమె అంటోంది.


10. శ్రద్ధాదాస్‌

ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ అలరిస్తున్న శ్రద్ధాదాస్‌ మాత్రం తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఏమాత్రం తగ్గించలేదు. నిత్యం యోగా చేస్తూ.. తోటి హీరోయిన్లు అసూయపడే కటౌట్‌ మెయింటైన్‌ చేస్తోందామె.

వీళ్లే కాదు.. కాజల్‌ అగర్వాల్‌, రాశీఖన్నా, అనుష్కశెట్టి ఇలా.. దాదాపు చాలామంది హీరోయిన్లు తమ శరీరాకృతిని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫొటోలు కూడా పంచుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు