‘భాజపా అబద్ధాల్ని ఇలా వ్యవస్థీకృతం చేసింది’

కొవిడ్‌-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు............

Published : 19 Jul 2020 13:24 IST

మోదీ సర్కార్‌ విధానాలపై రాహుల్‌ ధ్వజం

దిల్లీ: కొవిడ్‌-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు. తాజాగా.. ‘భాజపా అబద్ధాల్ని వ్యవస్థీకృతం చేసిందం’టూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగుదేశాలతో వివాదాల విషయంలో మోదీ సర్కార్‌ తీసుకుంటున్న పిరికి చర్యలతో భవిష్యత్తులో భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. 

‘‘1. కరోనా నిర్ధారణ పరీక్షల్ని పరిమితం చేయడం.. మరణాల్ని తక్కువగా చేసి చూపడం ద్వారా  కొవిడ్‌-19 విషయంలో..

2. జీడీపీని లెక్కించడానికి కొత్త పద్ధతిని అవలంబించడం ద్వారా..

3. మీడియాను బెదిరించడం ద్వారా చైనా ఆక్రమణ అంశంలో 

భాజపా అబద్ధాల్ని వ్యవస్థీకృతం చేసింది’’ అని ట్విటర్‌ వేదికగా భాజపాపై రాహుల్‌  విమర్శలు గుప్పించారు. 

గత కొన్ని రోజులుగా రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ పార్టీ భాజపా సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితుల్ని చక్కబెట్టడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. భౌగోళిక రాజకీయాలు రాజ్యమేలుతున్న సమయంలో.. కేవలం మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాహుల్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని