‘కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయండి’

రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి పార్టీని విలీనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారందరికీ బీఎస్పీ విప్‌ జారీ చేసింది.......

Published : 27 Jul 2020 09:06 IST

తమ పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలకు బీఎస్పీ విప్‌ జారీ

లఖ్‌నవూ: రాజస్థాన్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి పార్టీని విలీనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా వారందరికీ బీఎస్పీ విప్‌ జారీ చేసింది. శాసనసభ సమావేశమై అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనే పరిస్థితి తలెత్తితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్‌లో పేర్కొంది. జాతీయ స్థాయిలో పార్టీ విలీనమైతేనే.. రాష్ట్ర స్థాయిలో అది చెల్లుబాటవుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా అన్నారు. కేవలం రాష్ట్రంలో పార్టీని విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. ఒకవేళ స్పీకర్‌ విలీనాన్ని అంగీకరించినా అది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. విప్‌ను ధిక్కరిస్తే వారంతా అనర్హతకు గురికాక తప్పదని హెచ్చరించారు.  

బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని అనుమతించిన స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ రాజస్థాన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. అంతకుముందు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం బీఎస్పీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో విలీనం అయిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ అందజేశారు. దానిపై స్పీకర్‌ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని దిలావర్‌ ఆదివారం ఆరోపించారు.

బీఎస్పీ ఎమ్మెల్యేల చేరికతో సభలో కాంగ్రెస్‌కు బలం పెరిగింది. ఒకవేళ బలపరీక్ష జరిగితే ఇది వారికి కలిసొచ్చే అంశం. ఒకవేళ వారి విలీనానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే.. కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదీ చదవండి..

కరోనాపై చర్చకు అసెంబ్లీ..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని