పోలింగ్‌ ముగిసింది.. ఫలితాలే తరువాయి!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 54.1% పోలింగ్‌ నమోదైనట్టు ..........

Published : 07 Nov 2020 18:40 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తికాగా.. శనివారం మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సమాప్తమైంది. తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 55.22% పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6గంటల సమయానికి క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్‌ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్‌ 28న 71 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 54.70శాతం పోలింగ్‌ నమోదు కాగా..  నవంబర్‌ 3న 94 స్థానాలకు జరిగిన రెండో విడతలో 55.70% పోలింగ్‌ నమోదైంది. అలాగే, ఈ రోజు వాల్మికినగర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 52.08శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఆఖరి దశలో 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 1,200 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో పురారియా నియోజకవర్గంలో అత్యధికంగా 55.50శాతం నమోదైంది. ఈ నెల 10న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీయే, మహాకూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వికాస్‌ పురుష్‌గా పేరుగాంచిన సీఎం నీతీశ్‌కు ఓట్లు వేసి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. 12 ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని.. ఆర్జేడీ గత 15 పాలనను తూర్పారబెడుతూ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని