ప్రధానిపై అసభ్య పోస్ట్‌: కాంగ్రెస్‌ MLAపై కేసు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తిపై కేసు నమోదైంది.

Published : 10 Aug 2020 00:59 IST

ప్రధాని ఫోటోను మార్ఫింగ్‌ చేసిన ఇండోర్‌ ఎమ్మెల్యే జితు పట్వారి
కేసు నమోదుచేసిన మధ్యప్రదేశ్‌ పోలీసులు

ఇండోర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తిపై కేసు నమోదైంది. అయోధ్య భూమిపూజ సందర్భంలోని మోదీ ఫోటోలను మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ శాసనసభ్యుడు జితు పట్వారి మార్ఫింగ్‌ చేసి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇండోర్‌ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్న వ్యక్తి ఇలా చేయడంపై అక్కడి బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అక్కడి బీజేపీ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జితు పట్వారిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసినట్లు ఇండోర్‌ పోలీసులు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్‌ 188, సెక్షన్‌ 464 కింద కేసు నమోదు చేసినట్లు ఛత్రిపుర పోలీసులు తెలిపారు. ప్రధానిపై అసభ్యకర పోస్టు చేసినందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీ శంకర్‌ లాల్వాణీ మధ్యప్రదేశ్‌ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

అయితే, మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన సదరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తాను ప్రధానిని అగౌరవపరిచే పోస్టులు, వ్యాఖ్యలు చేయలేదని మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం కేంద్రప్రభుత్వ వైఫల్యాలపైనే వ్యాఖ్యలు చేసినట్లు ఆయన మీడియాతో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని